Rice Mill Scam: పేదలకు అందాల్సిన బియ్యాన్ని బుక్కేసిన రైస్ మిల్లర్ల అక్రమాలను ఏసీబీ(ACB) అధికారులు రట్టు చేశారు. దీంట్లో కొంతమంది అధికారుల హస్తం ఉన్నట్టుగా తేల్చారు. ఈ మేరకు నివేదికను రూపొందించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు దానిని ప్రభుత్వానికి సమర్పించనున్నారు. బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేయనున్నారు. ప్రతీ ఏటా ప్రభుత్వం ఆయా రైస్ మిల్లులకు వడ్లు ఇచ్చి బియ్యం పట్టించే విషయం తెలిసిందే. ఇలా వచ్చిన బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తారు. అయితే, అక్రమ సంపాదనలకు మరిగిన కొంతమంది మిల్లర్లు తరుగు పేర పేదలకు అందాల్సిన బియ్యాన్ని నొక్కేసి ప్రైవేట్ మార్కెట్ లో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ముడుపులు తీసుకుంటూ దీనికి పౌరసరఫరాల శాఖలో పని చేస్తున్న సిబ్బంది కొందరు సహకరిస్తున్నారు.
37మంది మిల్లర్లు అక్రమాలు
కామారెడ్డి(Kamareddy) జిల్లాలో ఈ తరహా అక్రమాలు పెద్ద ఎత్తున జరిగినట్టుగా ఆరోపణలు రావటంతో ఏసీబీ(ACB) అధికారుల బృందం కలెక్టర్ భవనంలోని సివిల్ సప్లయిస్ కార్పోరేషన్ జిల్లా మేనేజర్ కార్యాలయంలో తనిఖీలు జరిపింది. దీంట్లో పలు అక్రమాలను గుర్తించింది. 2021–22 ఖరీఫ్ సీజన్లో 39మంది మిల్లర్లు అక్రమాలకు పాల్పడినట్టుగా అధికారులు గుర్తించారు. వీరిలో ఇద్దరు మిల్లర్లు 64లక్షల రూపాయల విలువ చేసే 581 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పక్కదారి పట్టించినట్టుగా నిర్ధారించారు. ఇక, 2022–23 ఖరీఫ్ సీజన్ లో 37మంది మిల్లర్లు అక్రమాలు జరిపినట్టుగా ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. వీరిలో ఇద్దరు మిల్లర్అఉ 41కోట్ల రూపాయల విలువ చేసే 19,529 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని బుక్కేసినట్టుగా వెల్లడైంది. 2023–24 ఖరీఫ్ సీజన్ లో 7గురు మిల్లర్లు అకక్రమాలకు పాల్పడగా వీరిలో ముగ్గురు తరుగు పేర 2.5కోట్ల రూపాయల విలువ చేసే 5,194 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని దారి మళ్లించినట్టుగా తేలింది.
Also Read: Megastar Chiranjeevi: ఆ మహిళ వీడియో చూసి నా కళ్ళు చెమర్చాయి
గ్రీన్ హిల్స్ ఆగ్రో ఇండస్ట్రీస్..
2023–24లో గ్రీన్ హిల్స్ ఆగ్రో ఇండస్ట్రీస్(Green Hills Agro Industries) పై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నా సివిల్ సప్లయిస్ అధికారులు బియ్యం పట్టించటానికి వడ్లు ఇచ్చినట్టుగా నిర్ధారణ అయ్యింది. ఇక, 2025, సెప్టెంబర్ నుంచి జిల్లా సివిల్ సప్లయ్ ఆఫీసర్, జిల్లా మేనేజర్, సివిల్ సప్లయిస్ కార్పోరేషన్ సిబ్బంది మండల స్థాయి స్టాక్ పాయింట్లలో తనిఖీలే జరపలేదని ఏసీబీ(ACB) అధికారుల దర్యాప్తులో తేలింది. జిల్లా సివిల్ సప్లయ్ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేస్తున్న ఓ ఉద్యోగి వివరాలను నమోదు చేయటంలో అవకతవకలకు పాల్పడినట్టుగా తేలింది. అక్రమ సంపాదనలకు మరిగిన మిల్లర్లు తరుగు పేర భారీ స్థాయిలో బియ్యాన్ని పక్కదారి పట్టించినా జిల్లా సివిల్ సప్లయ్ అధికారి, జిల్లా మేనేజర్, డిప్యూటీ తహసిల్దార్లు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్పష్టమైంది. ఈ మేరకు నివేదికను సిద్ధం చేసిన ఏసీబీ అధికారులు దానిని ప్రభుత్వానికి అందించనున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నివేదికలో సిఫార్సు చేయనున్నారు.
Also Read: Republic Day 2026: అబ్బురపరిచిన ఏపీ శకటాలు.. అమరావతిలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు!

