Marri Venkata Reddy: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను ప్రాణాలకు తెగించి పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ మర్రి వెంకట రెడ్డి(Marri Venkata Reddy)కి రిపబ్లిక్ డే సందర్భంగా గ్యాలంటరీ పతకం దక్కింది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బత్తుల ప్రభాకర్ ఎలియాస్ రాహుల్ రెడ్డి(Rahul Reddy) కరడుగట్టిన నేరస్తుడు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అతనిపై 125కు పైగా క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలను టార్గెట్ చేస్తూ కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ప్రభాకర్ 2022లో విశాఖపట్టణం సెంట్రల్ జైలు నుంచి తప్పించుకుని పరారయ్యాడు. అప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు కొన్ని నెలలుగా గాలిస్తున్నారు.
Also Read: MLA Kadiyam Srihari: మనదగ్గరికి స్టువర్టుపురం దొంగలు వస్తున్నారు జాగ్రత్త: ఎమ్మెల్యే కడియం శ్రీహరి
2002 ఫిబ్రవరి 5న..
2025, ఫిబ్రవరి 5న ప్రభాకర్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్బు వద్ద ఉన్నట్టు హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డికి పక్కాగా సమాచారం అందింది. ఈ క్రమంలో వెంకటరెడ్డి సహచర సిబ్బంది ప్రదీప్ రెడ్డి, వీరాస్వామితో కలిసి పబ్ వద్దకు వెళ్లాడు. ప్రభాకర్ ను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆ వెంటనే ప్రభాకర్ తన దుస్తుల్లో నుంచి తుపాకీ బయటకు తీసి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఓ బుల్లెట్ వెంకటరెడ్డి ఎడమకాలికి తగిలింది. తీవ్రంగా రక్తం కారుతున్నా వెనుకడుగు వేయకుండా వెంకటరెడ్డి సహచరులతో కలిసి ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సాహసానికి గుర్తింపుగా 2026, రిపబ్లిక్ డే సందర్భంగా ఆయనకు కేంద్ర ప్రభుత్వ మెడల్ ఫర్ గ్యాలంటరీ దక్కింది.

