Rice Mill Scam: యేండ్లు గడుస్తున్న పట్టించుకోని అధికారులు
–కేసులు పెట్టి చేతులు దులుపుకున్న ఎన్ఫోర్స్మెంట్
–రైతుల ధాన్యంతో కోట్లు సంపాదిస్తున్న మిల్లర్లు
–రైతుల తప్పు దోరికితే తక్షణమే రికవరి, చర్యలు
–అదే మిల్లర్ యాజమాన్యులు తప్పుచేస్తే కేసులకే పరిమితం
–అధికారులతో మిల్లర్ యాజమాన్యులు కుమ్మక్కై
–రికవరి బియ్యాన్ని గాలికి వదిలేస్తున్న వైనం
రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: కాయకష్టం చేసిన పంటకు గిట్టుబాటు ధర చెల్లించేందుకు ప్రభుత్వాలు వెనకముందు ఆలోచిస్తాయి. ఒక వేళ ఖరారు చేసిన గిట్టుబాట ధరను రైతుల వద్ద సేకరించిన ధాన్యానికి సకాలంలో చెల్లించేందుకు ప్రభుత్వాలకు చేతులు రావు. కానీ ప్రభుత్వ సోమ్మును కాజేస్తున్న మిల్లర్ యాజమాన్యులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనకడుగు వేస్తారు. ప్రభుత్వం రైస్ మిల్లర్లకు అప్పిగించిన ధాన్యానికి తగ్గట్టుగా బియ్యంగానీ, నగదునుగానీ రికవరి చేసుకునేందుకు అధికారులకు ధైర్యం లేదు. కంటికి కనిపించని విధంగా చేసే అక్రమాలపై అధికారులు సీరియస్గా పనిచేయడం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో అధికారులతో కుమ్మక్కై పాల్పడిన అక్రమాలు బహిర్గతమైయ్యే పరిస్థితి ఉంది. దీంతో అధికారులు ఏమీ తెలియనట్లు నటిస్తూ మిల్లర్ల వద్ద వచ్చే సీఎంఆర్ బియ్యం రికవరిపై మాటకూడా మాట్లాడటం లేదని తెలుస్తోంది. రంగారెడ్డి(Rangareddy), వికారాబాద్(Vikrabad) జిల్లాలో భారీ ఎత్తున్న బియ్యం రికవరిలో అక్రమాలు జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీల ద్వారా స్పష్టంమైయింది. కానీ కేవలం కేసులు పెట్టి అధికారులు చేతులు దులుపుకున్నారు.
ఇంకేప్పుడు అప్పగిస్తారో…?
రంగారెడ్డి జిల్లాలోని 12 రైస్ మిల్లులకు వరి ధాన్యం సరఫరా చేశారు. 2022–23 రబీ సీజన్లో వచ్చిన ధాన్యాన్ని అమన్గల్లు మండలంలోని శ్రీ లక్ష్మి వెంకటసాయం రైస్ మిల్లుకు 9020 క్వింటాళ్ల ధాన్యం, మాడ్గుల మండలం కొల్కోలపల్లిలోని శ్రీ రాఘవేంద్ర రైస్ మిల్లుకు 7848 క్వింటాళ్లు, మణికంఠ రైస్ మిల్లుకు 6304 క్వింటాళ్లు, పవన్ రైస్ మిల్లుకు 5378 క్వింటాళ్లు, జయలక్ష్మి రైస్ మిల్లుకు 4940 క్వింటాళ్లు, శ్రీ సాయి రామ రైస్ మిల్లు పోలెపల్లికి 3348 క్వింటాళ్లు, శ్రీ రాఘవేంద్ర చింతపల్లికి 1578 క్వింటాళ్లు, కనకదుర్గ రైస్ మిల్లుకు 1423 క్వింటాళ్లు, శ్రీ రామానుంజనేయ రైస్ మిల్లుకు 1280 క్వింటాళ్లు, లక్మిరైస్ మిల్లుకు 67 క్వింటాళ్లు, శ్రీ లక్మి మోడరన్ రైస్ మిల్లుకు 64 క్వింటాళ్లు, సాయి వీరభద్ర రైస్ మిల్లుకు 55 క్వింటాళ్ల చోప్పున సరఫరా చేశారు. అయితే ఈ ధాన్యం సరఫరాలో 70శాతం రైస్ ప్రభుత్వానికి మిల్లర్లు అప్పగించాలి. అయితే నిర్దేశించిన సమయంలో అప్పగించాలి. ఏడాది కాలంలోనే క్లియర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఇప్పటి వరకు పూర్తి స్ధాయిలో బియ్యం సరఫరా చేయడంలో మిల్లర్ల యాజమాన్యం బాధ్యతరహితంగా వ్యవహిరించినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి 3092 క్వింటాళ్ల ధాన్యం వివిధ మిల్లుల ద్వారా అప్పగించాల్సి ఉంది. కేవలం 5 మిల్లుల ద్వారా పూర్తిస్ధాయిలో బియ్యం అప్పగించారు. ఇంకా 7 మిల్లుల యాజమాన్యం బియ్యం ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. అత్యధికంగా పవన్ సాయి రైస్ మిల్లు 1623 క్వింటాళ్లు, శ్రీసాయి రాం రైస్ మిల్లు 1339 క్వింటాళ్ల చోప్పున బియ్యం ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే పవన్ సాయి రైస్ మిల్లులో ధాన్యం ఉండటంతో క్రమ క్రమంగా ప్రభుత్వానికి అప్పగిస్తానని యాజమాన్యం వివరించింది. కానీ అమన్గల్లు మండలం పోలెపల్లిలోని శ్రీసాయి రాం రైస్ మిల్లులో ధాన్యం లేకపోవడంతో బియ్యం ఇవ్వడం కష్టమని అధికారులు గుర్తించారు. అంతేకాకుండా యాజమాన్యం సమాధానం సరిగ్గలేకపోవడంతో కేసు నమోదు చేయాలని జిల్లా అధికారులను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆదేశించారు. ఈ రైస్ మిల్లు యజామాన్యం నుంచి రూ.7కోట్ల 11లక్షల విలువైన బియ్యం ప్రభుత్వానికి అప్పగించాలని తెలిపారు. ఆదేశించి ఆరు నెలలు గడిచిన ఇప్పటి వరకు ఏలాంటి పురోగతి లేదని తెలుస్తోంది. ఈవిషయాలపై అధికారులను అడిగేందుకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు. కార్యాలయానికి వెళ్తే అందుబాటులో ఉండటం లేదు.
Also Read: Minister Seethakka: ఫ్రీ బస్ మీద కుట్ర.. అనేక కథనాలు.. మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు
వికారాబాద్ జిల్లాలో అదే పరిస్థితి..
వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం చెన్నారంలోని కృష్ణసాయి రైస్ ఇండస్ట్రీస్ యాజమాన్యంపై సివిల్ సప్లయ్ కార్పోరేషన్ అధికారులు కేసు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం 1850.600 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రైస్ మిల్లుకు అప్పగించారు. ఇందుకు 1239.902 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి అప్పగించాలి. కానీ 801 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే అప్పగించి, 438 మెట్రిక్ టన్నుల బియ్యం ఇచ్చేందుకు నిర్లక్ష్యం చేశారు. దీనిపై అధికారులు జిల్లాలో ఏ ఏ రైస్ మిల్లు ఎన్ని మెట్రిక్ టన్నలు బియ్యం ఇవ్వాల్సి ఉందో ఆ వివరాలను సేకరించింది. అయితే 2024 పిబ్రవరి 29 వరకే ఇచ్చి పూర్తిగా నిలిపివేసిన మిల్లర్ యాజమాన్యంపై చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. దాంతో యాలాల్ మండలం చెన్నారంలోని కృష్ణా సాయి రైస్ ఇండస్ట్రీస్ యాజమాన్యంపై అధికారులు స్ధానిక పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. దీంతో లీజుకు తీసుకున్న వ్యక్తితో పాటు యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ చేసి రీమాండ్ కు తరలించారు. అధికారిక లెక్కల ప్రకారం ఆ రైస్ మిల్లు యాజమాన్యం ప్రభుత్వానికి నగదు రూపంలో రూ.6కోట్ల3లక్షల51వేలు చెల్లించాల్సి ఉంది. ఈ లెక్క ప్రకారం జిల్లాలోని 30 రైస్ మిల్లుల యాజమాన్యం రీకవరీ రూపంలో సుమారుగా రూ.200కోట్లకు పైగా నగదు చెల్లించాల్సి ఉందని సమాచారం.
రీకవరి పేరుతో కాలయాపన
రబీ సీజన్లల్లో రైతుల వద్ద సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లకు సివిల్ సప్లయ్ అధికారులు అప్పగించారు. మిల్లర్లకు అప్పగించిన ధాన్యాన్ని సీఎంఆర్ పద్దతిలో ప్రభుత్వానకి బియ్యం అప్పగించాల్సి ఉంది. కానీ రేండేండ్లు గడుస్తున్న అధికారులు సీరియస్గా తీసుకోవడం లేదు. ప్రభుత్వ ఆదేశాలు పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి కొనుగోలు చేసే ధాన్యం నుంచి వచ్చే సీఎంఆర్ బియ్యంతోనే సరిపెట్టి లెక్కలు వేసుకుంటున్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకంలో భాగంగా పేదలకు, విద్యార్ధులుకు బియ్యం పంపిణి చేస్తున్నారు. అయితే ఆయా జిల్లాల నుంచి వచ్చే ధాన్యాన్ని సేకరించి మిల్లర్లకు పంపించి బియ్యం రూపంలో తిరిగి తీసుకుంటారు. ఆ బియ్యం గోధాముల్లో నిల్వ చేసి ప్రభుత్వం ద్వారా పంపిణికి అవసరమయ్యే వాటిని సరఫరా చేస్తారు. ఈ లెక్కలతో బియ్యం పంపిణీని కాలక్రమేన కొనసాగిస్తున్నారు. అదే మిల్లర్ల యాజమాన్యం నుంచి వచ్చే బియ్యాన్ని రీకవరి చేసేందుకు అధికారులు గాలీకి వదిలేసినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో జరిగిన తప్పును ప్రస్తుత ప్రభుత్వం పున:పరిశీలించాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఆవిషయాన్ని పరిగణలోకి తీసుకోని ప్రభుత్వం సీరియస్గా రికవరి చేయాలని స్ధానికులు కొరుతున్నారు.

