Medaram Jatara 2026: మేడారం మహా జాతర కోసం 4000 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. శనివారం మేడారాన్ని సందర్శించిన ఆయన.. అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్ స్టేషన్ ను ప్రారంభించారు. అనంతరం పొన్నం మాట్లాడుతూ భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచుతామని స్పష్టం చేసారు. ఈ ఏర్పాట్ల కోసం రవాణా శాఖ తరపున వందలాది మంది అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా నియమించి, జాతర ప్రయాణ సేవలను అధికారికంగా ప్రారంభించినట్లు తెలిపారు. జాతర ప్రయాణ సేవలు జనవరి 20 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిరంతరంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.
సొంత వాహనాల్లో వస్తే ఇబ్బందే!
భక్తులు తమ ప్రయాణాన్ని సురక్షితంగా, సౌకర్యవంతంగా పూర్తి చేసుకోవాలంటే తప్పనిసరిగా RTC బస్సులనే వినియోగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సొంత వాహనాల్లో మేడారంకు వస్తే దూరంగా ఉండే పార్కింగ్ ఏరియాల్లో వాహనాలు నిలిపి.. ఎక్కువ దూరం నడవాల్సి ఉంటుందని చెప్పారు. అదే ఆర్టీసీ బస్సు ఎక్కితే గద్దెల సమీపంలోనే దించుతాయని తెలిపారు. పైగా ప్రయాణం భద్రంగా ఉంటుందని పేర్కొన్నారు.
తప్పిపోయిన పిల్లలను గుర్తించేలా..
జాతర సమయంలో చిన్న పిల్లలు తప్పిపోయే ఘటనలను నివారించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న చైల్డ్ ట్రాకింగ్ సిస్టమ్‌ను ప్రతి తల్లిదండ్రులు తప్పనిసరిగా వినియోగించుకోవాలని మంత్రి పొన్నం కోరారు. ఈ విధానం ద్వారా తప్పిపోయిన పిల్లలను వేగంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ 2024లోనే రేవంత్ రెడ్డి మేడారం జాతరకు రవాణా మౌలిక వసతులు కల్పించాలనే దూరదృష్టితో ముందడుగు వేశారని గుర్తు చేశారు. ప్రతి జాతర సమయంలో తాత్కాలిక ఏర్పాట్లతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దీర్ఘకాలిక పరిష్కారంగా శాశ్వత ఆర్.టి.సి. బస్‌స్టాండ్‌ను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
Also Read: T Hub – CM Revanth: టీ-హబ్‌ను స్టార్టప్ కంపెనీలకే వదిలేయండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
పొన్నంకు సీతక్క ధన్యవాదాలు
ప్రతి ఏడాది జాతర సందర్భంగా అధిక సంఖ్యలో RTC బస్సులు ఏర్పాటు చేయడమే కాకుండా, ఈసారి మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా మేడారానికి వచ్చి రవాణా ఏర్పాట్లను పరిశీలించారని మంత్రి సీతక్క అన్నారు. భక్తులు, ప్రయాణికులు ఎలాంటి అసౌకర్యాలు ఎదుర్కోకుండా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.ములుగు జిల్లాలో సంవత్సరాల తరబడి బస్ డిపో లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, వెంటనే స్పందించి దాదాపు రూ.5 కోట్ల వ్యయంతో శాశ్వత బస్‌డిపో ను మంజూరు చేసినందుకు రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

