Bandi Sanjay On KTR: ఆ దొంగే నీతులు చెబితే నమ్మే పరిస్థితుల్లో నేను లేను
కేసీఆర్ ఫ్యామిలీని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్‌కు లేదు
ముడుపులు దండుకునేందుకే విచారణ పేరుతో సాగదీతలు
ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి ఆధారాలన్నీ ఉన్నాయి
పోలీసులే నాకు ఆధారాలు, సాక్షాలు చూపారు
మంది కొంపలు ముంచిన కేటీఆర్ వ్యక్తిత్వ హననం గురించి మాట్లాడటమా?
ఆయన చేసిన అరాచకాలు గుర్తుకొస్తే రక్తం మరుగుతోంది: కేంద్ర మంత్రి బండి సంజయ్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : మాజీ మంత్రి కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ దొంగ అని, సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ చేయించింది కేటీఆరేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay On KTR) విమర్శించారు. ఆ దొంగే నీతులు చెబితే నమ్మే పరిస్థితుల్లో తాను లేనన్నారు. ఫోన్ ట్యాపింగ్‌తోపాటు అనేక అవినీతి, అక్రమాలు, అరాచకాలకు పాల్పడినప్పటికీ కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేనేలేదని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పౌరుషం లేదని, చేతులు ముడుచుకుని కూర్చున్న అసమర్ధ ప్రభుత్వమని మండిపడ్డారు. కరీంనగర్ లో శుక్రవారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీకి ముడుపులు కోసమే ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో సాగదీస్తున్నారని ఆరోపించారు. విచారణ పేరుతో హడావుడి చేసినప్పుడల్లా ఫాంహౌజ్ నుంచి ఏఐసీసీకి ముడుపులు వెళుతున్నాయని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి అన్ని ఆధారాలు, సాక్షాలు పోలీసుల వద్ద ఉన్నాయని, తనను విచారణకు పిలిచిన సమయంలో ఆ ఆధారాలను, సాక్షాలను సైతం చూపించారని తెలిపారు. జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు తేలిందన్నారు. అయినా కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. సిట్ అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడం లేదని, ప్రభుత్వంలో కొందరు పెద్దల ఆదేశాలకు అనుగుణంగానే విచారణ చేస్తున్నారని విమర్శించారు. కేటీఆర్ ను ఎందుకు విచారణకు పిలిచారని, ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయించినందుకు పిలిచారా? లేక ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందని చెప్పడానికి పిలిచారా? అని సంజయ్ ప్రశ్నించారు.
Read Also- KTR on SIT Investigation: ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన కేటీఆర్ విచారణ.. సంచలన వ్యాఖ్యలు
సిరిసిల్ల కేంద్రంగా వార్ రూమ్ ను ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేశారని తాను చాలా సార్లు చెప్పానని గుర్తుచేశారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా రూ.వేల కోట్ల లావాదేవీలు జరిగాయని, రియల్ ఎస్టేట్ బిల్డర్లు, వ్యాపారులను, సినీ నటులను బెదిరించి కోట్లు దండుకున్నారని ఆరోపించారు. బెదిరించి బీఆర్ఎస్ కు ఎలక్ట్రోరల్ బాండ్స్ కొనుగోలు చేయించారన్నారు. తన ఫోన్ తో పాటు ప్రస్తుత సీఎం, మంత్రుల ఫోన్లతోపాటు జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని, కేసీఆర్ కుటుంబమే ఇదంతా చేసిందని, అసలు కారకులైన వాళ్లను సాక్షిగా పిలిచి విచారణ పేరుతో వాంగ్మూలం నమోదు చేయడమేంటని బండి ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండేళ్ల విచారణలో సిట్ సాధించిందేంటని, ఒక్క రాజకీయ నాయకుడినైనా అరెస్ట్ చేశారా? అని నిలదీశారు. స్వయంగా కేసీఆర్ కూతురే తన ఫోన్ ట్యాప్ చేశారని చెప్పారన్నారు. మాజీమంత్రి హరీష్ రావు ఆ టైంలో ఏడాదిపాటు ఫోన్ కూడా వాడలేదని, ఇన్ని సాక్షాలు, ఆధారాలున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
Read Also- Daggubati Family: దగ్గుబాటి కుటుంబానికి కోర్టులో చుక్కెదురు.. లీగల్ టీమ్ ఏం చెప్పిందంటే?
కేసీఆర్ పాలనలో సామాన్యులు మొదలు భిక్షాటన చేసే వ్యక్తులు కూడా ఫోన్ ఉన్నా వాట్సప్ కాల్ లో తప్ప నార్మల్ కాల్ మాట్లాడలేని పరిస్థితి తీసుకొచ్చారన్నారు. సిట్ అధికారులకు స్వేచ్ఛనిచ్చి విచారణ జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. మంది కొంపలు ముంచి వ్యక్తిత్వ హననం గురించి కేటీఆర్ మాట్లాడటంపై బండి ఆగ్రహం వ్యక్తంచేశారు. కేటీఆర్ చేసిన అరాచకాలు గుర్తుకొస్తే తమ రక్తం మరుగుతోందని పేర్కొన్నారు. సాక్షాత్తు సీఎంను పట్టుకుని ఎడమ చేతి చెప్పుతో కొట్టాలని ఉందని అంటున్నా కాంగ్రెసోళ్లకు పౌరుషం లేదని పేర్కొన్నారు. అధికారం ఉంది కదా.. అని కోట్లు దండుకోవడంపై దృష్టి పెట్టారని ఫైరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ సహా కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం తమకు చేతకాదని, అసమర్థులమని, చేవ చచ్చినోళ్లమని కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుని సీబీఐ విచారణ జరపాలని కేంద్రానికి లేఖ రాస్తే అప్పుడు కేంద్రం చర్యలు తీసుకునేందుకు సిద్ధమని బండి తెలిపారు.
గెలిచే చోట పార్టీ కార్యకర్తలకే టిక్కెట్లు
కరీంనగర్ కార్పొరేషన్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందా? లేదా? అనే దానిపై రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోందని బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈసారి బీజేపీకి మంచి వాతావరణం ఉందని, కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పదవిని కైవసం చేసుకోవడమే లక్ష్యమని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నేతలు పెద్ద ఎత్తున బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వారిని సాదరంగా ఆహ్వానించడంతోపాటు కలిసికట్టుగా పనిచేసి కార్పొరేషన్‌పై కాషాయ జెండాను ఎగరేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గెలిచే అవకాశమున్న చోట పార్టీ కార్యకర్తలకే టిక్కెట్లు ఇస్తామని పునరుద్ఘాటించారు. కరీంనగర్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం బీజేపీ నేతల సమావేశం జరిగింది. కాగా 24వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఒంటెల సత్యనారాయణరెడ్డి తన అనుచరులతో కలిసి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. అట్లాగే 56వ డివిజన్ మాజీ కార్పొరేటర్ తాటి ప్రభావతి తన అనుచరులతో కలిసి సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఇతర పార్టీల నుంచి డి పెద్ద ఎత్తున నాయకులు బీజేపీలో చేరేందుకు సద్ధంగా ఉన్నారని, వాళ్లను రానీయకుండా కొందరు అడ్డుకోవాలనుకుంటున్నారన్నారు. ఇది సరికాదని, కరీంనగర్ మేయర్ సీటును బీజేపీ కైవసం చేసుకోవాలంటే అంతా కలిసి పనిచేయాలని బండి కోరారు.

