Veenvanka Anganwadi Centres: హుజూరాబాద్ వీణవంక మండల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పసిపిల్లల ఆరోగ్యం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ పంపిణీ చేస్తున్న ఆహార పదార్థాలు లబ్ధిదారులకు చేరడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కనపర్తి గ్రామంలో అంగన్వాడీ సరుకులు పక్కదారి పడుతున్నాయని స్థానిక గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అర్హులకు అందని సరుకులు
ప్రభుత్వం అందజేస్తున్న బియ్యం, పప్పులు, నూనె, కోడిగుడ్లు సక్రమంగా పంపిణీ కావడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. మరికొన్ని కేంద్రాల్లో నాణ్యత లేని ఆహారాన్ని సరఫరా చేస్తున్నారని దీనివల్ల చిన్నారుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని వాపోతున్నారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు కార్యాలయాలకే పరిమితం కావడంతోనే ఈ పరిస్థితి నెలకొందని విమర్శలు వినిపిస్తున్నాయి.
సూపర్ వైజర్ దాటవేత ధోరణి
ఈ అక్రమాలపై వీణవంక మండల సూపర్ వైజర్ ను వివరణ కోరగా ఆమె పొంతన లేని సమాధానాలు చెబుతూ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అక్కడ అలాంటిదేమీ జరగడం లేదని, అంతా సక్రమంగానే ఉందంటూ ఆరోపణలను కొట్టిపారేశారు. సూపర్ వైజర్ ఇలా దాటవేత ధోరణి ప్రదర్శించడంపై గ్రామస్థులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారుల అండదండలతోనే క్షేత్రస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
Also Read: UP Shocker: ఎంబీబీఎస్ సీటు కోసం.. కాలు నరుక్కున్న విద్యార్థి.. ఇదేం వెర్రితనం!
విచారణకు డిమాండ్
నిరుపేద గర్భిణీలు, చిన్నారుల నోటికాడ కూడును దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులు స్పందించి కనపర్తి అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై సమగ్ర విచారణ జరపాలని, పౌష్టికాహారం పంపిణీలో పారదర్శకత పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

