Ramchander Rao: నైనీ కోల్ బ్లాక్ టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంపై బీజేపీ (Bjp) తీవ్రంగా స్పందించింది. టెండర్లలో అవకతవకలు జరిగాయా? లేక తమకు కావాల్సిన వారికి కట్టబెట్టేందుకే రద్దు చేశారా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రశ్నించారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన స్టేట్ ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి విషయంలో కేంద్రం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై బురదజల్లాలని చూస్తున్న కాంగ్రెస్ కుట్రలను ప్రతి కార్యకర్త అడుగడుగునా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వంలోని అగ్రనేతల మధ్య వాటాల గొడవల వల్లే ఈ అవకతవకలు బయటపడ్డాయని ఆయన ఎద్దేవా చేశారు.
Also Read: Ramchander Rao: సేమ్ అక్కడ సీన్ ఇక్కడ కూడా రిపీట్ చేస్తాం: రాంచందర్ రావు
అన్ని పరిణామాలపై సీబీఐ విచారణ
ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ హయాం నుంచి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వరకు జరిగిన అన్ని పరిణామాలపై సీబీఐ విచారణ జరిపించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని రాంచందర్ ప్రకటించారు. గతంలో బీఆర్ఎస్ తమ వారికే ఈ బ్లాక్ ఇవ్వాలని చూడటం వల్ల కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లిందని గుర్తు చేశారు. ఇదిలా ఉంటే, జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేతలు, మాజీ జెడ్పీటీసీ బత్తిని అరుణ, ఇంద్రకరణ్ దంపతులు బీజేపీలో చేరారు. రాక సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎన్వీ సుభాష్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు రాంచందర్‌ను కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.
Also Read:Ramchander Rao: కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తప్పదు: రాంచందర్ రావు

