Ananthagiri Hills: అనంతగిరిలో గ్లోబల్ ఐకానిక్ ప్రాజెక్టు
Ananthagiri Hills ( image credit: swetcha reporter)
Telangana News

Ananthagiri Hills: అనంతగిరిలో గ్లోబల్ ఐకానిక్ ప్రాజెక్టు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్.. అభివృద్ధి ప్రణాళికలు ఇవే!

Ananthagiri Hills: తెలంగాణ ఊటీగా పేరొందిన అనంతగిరి కొండలు (Ananthagiri Hills) అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా మారబోతున్నాయి. అక్కడి సహజవనరులకు ఎలాంటి విఘాతం కలగకుండా ‘గ్లోబల్ ఐకానిక్ ప్రాజెక్టు’ను చేపట్టేందుకు పర్యాటక శాఖ శ్రీకారం చుట్టింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా, సుమారు రూ. 500 కోట్ల నిధుల మంజూరుకు హామీ ఇచ్చింది. ఈ నెల 13న ఢిల్లీలో జరిగిన పర్యాటక శాఖ కార్యదర్శుల సమావేశంలో రాష్ట్ర విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించడంతో, పర్యాటక శాఖ అధికారులు ప్రస్తుతం డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) రూపకల్పనలో నిమగ్నమయ్యారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతితో ఈ నివేదికను కేంద్రానికి అందజేయనున్నారు.

ప్రకృతి ఒడిలో తెలంగాణ ఊటీ

అనంతగిరి ప్రాంతమంతా ప్రకృతి రమణీయతతో పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఎత్తైన కొండలు, దట్టమైన అడవి అందాలు సందర్శకులకు సరికొత్త అనుభూతిని ఇస్తున్నాయి. అడవిలో నెమళ్ల విన్యాసం, జింకల పరుగులు, పక్షుల కిలకిల రావాలు పర్యాటకులను మైమరపింపజేస్తున్నాయి. సహజ సిద్ధమైన మంచినీటి బుగ్గలు, పచ్చటి హరిత వనాలు ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి వన్నె తెస్తున్నాయి. అందుకే అనంతగిరిని ‘తెలంగాణ ఊటీ’గా పిలుచుకుంటారు. ప్రతి వారాంతంలో శని, ఆదివారాల్లో ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య సాధారణ రోజుల కంటే రెట్టింపుగా ఉంటోంది. రాష్ట్ర పర్యాటకులే కాకుండా విదేశీయులు కూడా అనంతగిరి అందాలను వీక్షించేందుకు తరలివస్తుండటంతో, ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇప్పటికే పలు భారీ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది.

Also Read: Heavy Rains: కుండపోత వర్షంతో కనిపించని రహదారులు.. ఎక్కడంటే..?

అభివృద్ధి ప్రణాళికలు ఇవే

ఈ భారీ ప్రాజెక్టులో భాగంగా రూ. 200 కోట్లను సైట్ డెవలప్‌మెంట్ కోసం, మరో రూ. 100 కోట్లను ‘ఎక్స్ పీరియం’ (థీమ్ పార్కులు, విభిన్న మొక్కల పెంపకం) కోసం వెచ్చించనున్నారు. మిగిలిన నిధులతో మౌలిక సదుపాయాలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం తక్కువ వడ్డీతో, దీర్ఘకాలిక పరిమితితో రుణాన్ని ఇచ్చేందుకు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. అనంతగిరి కొండలు సుమారు 3,763 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నందున అమ్రాబాద్, జెన్నారం తరహాలో ఇక్కడ ‘సఫారీ ఏరియా’ను కూడా అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే అనంతగిరి పర్యాటకులకు స్వర్గధామం కానుంది.

ప్రపంచ స్థాయి వసతులు

అనంతగిరిని పర్యాటక హబ్‌గా మార్చే క్రమంలో వరల్డ్ క్లాస్ రిసార్ట్స్, కార్పొరేట్ తరహా వసతులు, వెల్ నెస్ సెంటర్లు, యోగా డెస్క్, వెడ్డింగ్ డెస్టినేషన్, స్పా ఏరియాలను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే సర్కార్ శ్రీకారం చుట్టింది. పర్యాటకులకు ఆహ్లాదంతో పాటు మానసికోల్లాసం కలిగించేలా అన్ని రకాల సౌకర్యాలను ఒకే చోట కల్పించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం. అభివృద్ధి పనుల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ‘డిస్టినేషన్ మేనేజ్‌మెంట్ కమిటీ’ని కూడా ఏర్పాటు చేయనున్నారు. వెయ్యికోట్లతో మెగా సైతం అభివృద్ధి పనులకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నది. ఈ పనులన్నీ పూర్తయితే అనంతగిరి జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు అనంతగిరి ప్రధాన కేంద్ర బిందువుగా మారనుంది.

Also Read: Illegal Admissions: ఇదెక్కడి విడ్డూరం.. 10వ తరగతి పూర్తవ్వకుండానే ఇంటర్ అడ్మిషన్లు!

Just In

01

KTR on SIT Investigation: ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన కేటీఆర్ విచారణ.. సంచలన వ్యాఖ్యలు

Raakaasaa Glimpse: సంగీత్ శోభన్ ‘రాకాస’ గ్లింప్స్ వచ్చేశాయ్ చూశారా.. నిహారిక రెండో సినిమా

Veenvanka Anganwadi Centres: అంగన్వాడీ పౌష్టికాహారం పక్కదారి.. పసిపిల్లల ఆహారంపై అక్రమార్కుల కన్ను!

Groundnut Price: రికార్డ్ స్థాయిలో వేరుశనగ ధర.. తొలిసారి ఎంతకు పెరిగిందంటే?

Medaram Jatara: మేడారం జాతర ఏర్పాట్లలో కలెక్టర్, ఎస్పీ ఫుల్‌ బిజీ.. ఎక్కడికక్కడ తనిఖీలు