Sama Ram Mohan Reddy: ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సిట్ విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ కు వచ్చిన ఆయన్ను సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే కేటీఆర్ ను లోపల సిట్ విచారిస్తుండగా.. బయట బీఆర్ఎస్ చేయబోయే డ్రామాలు ఇవేనంటూ టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ ఛైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. సీన్స్ నెంబర్ 1,2,3,4 అంటూ జరగబోయే ఘటనలను అంచనా వేశారు.
సీన్ బై సీన్ ఇలా..
సామ రామ్మోహన్ రెడ్డి పోస్ట్ ప్రకారం.. సీన్ నెంబర్ – 1లో తెలంగాణ భవన్ నుండి పోరాటానికి వెళ్తున్నట్లు కేటీఆర్ డ్రామా ఆడనున్నారు. సీన్ నెంబర్ – 2కి వచ్చేసరికి తన అడ్వకేట్లను తనతో పాటు లోపలికి పంపించడం లేదని కేటీఆర్ డ్రామా చేస్తారని పేర్కొన్నారు. ఇక సీన్ నెంబర్ – 3లో కేటీఆర్ లోపల సిట్ అధికారులను ఫుట్ బాల్, రగ్బీ, తొక్కుడు బిళ్ళ, కోతి కొమ్మచ్చి, అష్టాచమ్మా ఆడుతుకున్నారని, అధికారులకు చెమటలు పట్టిస్తున్నాడని బయట హరీశ్ రావు (Harish Rao) డబ్బా కొడతారని సామ రామ్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ఈరోజు కేటీఆర్, హరీష్ చేసే డ్రామా సీన్స్ వారిగా..
సీన్ నెంబర్ 1: తెలంగాణ భవన్ నుండి పోరాటానికి వెళ్తున్నట్లు కేటీఆర్ డ్రామా
సీన్ నెంబర్ 2:
తన అడ్వకేట్లను తనతో పాటు లోపలికి పంపించడం లేదని కేటీఆర్ డ్రామాసీన్ నెంబర్ 3:
కేటీఆర్ లోపల అధికారులతో ఫుట్ బాల్, రగ్బీ, తొక్కుడు బిళ్ళ,…— Sama Ram Mohan Reddy (@RamMohanINC) January 23, 2026
సీన్ 4.. కేటీఆర్ ప్రెస్ మీట్
ఇక సీన్ నెంబర్ – 4కి వచ్చే సరికి.. సిట్ విచారణ అనంతరం కేటీఆర్ ఎలాంటి సమాధానాలు చెప్తారో సామ రామ్మోహన్ రెడ్డి అంచనా వేశారు. ‘సిట్ విచారణలో ఏం అడగలేదు, వట్టిగానే కూర్చోబెట్టారు. అడిగిందే అడిగారు. విచారణకు సంబంధించిన వీడియో ఫుటేజ్ బయట పెట్టాలి అని కేటీఆర్ డిమాండ్ చేస్తారు’ అంటూ సామ రామ్మోహన్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. అయితే దీనికి తెలంగాణ ఇన్నర్ ఫీలింగ్.. ‘లోపల ఏం జరిగిందో మాకు తెలుసు లే’ అని ఉంటుందని సెటైర్లు వేశారు.
Also Read: Phone Tapping Case: నేను ఏ తప్పు చేయలే.. విచారణకు భయపడను.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
సిట్ విచారణకు ముందు కేటీఆర్ రియాక్షన్
కాగా, సిట్ విచారణకు ముందు తెలంగాణ భవన్ లో మాట్లాడిన కేటీఆర్.. తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సిట్ నోటీసుల పేరుతో డ్రామా ఆడుతోందని మండిపడ్డారు. తనపై గత రెండేళ్లుగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్ విచారణ పేరుతో చేసే బెదిరింపులకు తాను భయపడబోనని పేర్కొన్నారు. దండుపాళ్యం ముఠా అక్రమాలు బయట పెడుతున్నందుకే మాపైన ఇలాంటి కేసులు, విచారణలు చేపడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు.

