Phone Tapping Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ను సిట్ విచారించబోతోంది. సిట్ విచారణకు మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ డ్రామా ఆడుతోందని మండిపడ్డారు. తెలంగాణ సాక్షిగా తాను ఎలాంటి తప్పు చేయలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. తనపై గత రెండేళ్లుగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మేం టైంపాస్ పాలిటిక్స్ చేయలేదు’
సిట్ విచారణకు తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ కోసం ఆనాడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సుదీర్ఘంగా కొట్లాడమని కేటీఆర్ అన్నారు. ‘రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు, నేను మంత్రి అయ్యాను. 10 ఏళ్లలో రాష్ట్రం కోసం ఎంతో పనిచేశాం. మేము ఎన్నడు టైం పాస్ రాజకీయాలు చేయలేదు. మా నాయకుడు కేసీఆర్ గొప్పతనం ఏంటి అంటే ఇవ్వని వాగ్దానాలు కూడా నెరవేర్చారు’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
‘విచారణలకు భయపడబోం’
సిట్ విచారణ పేరుతో ప్రభుత్వం చేసే బెదిరింపులకు తాము భయపడబోమని కేటీఆర్ స్పష్టం చేశారు. ‘ఒక్కో రోజు ఒక్కో డ్రామా పేరుతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఇచ్చిన హామీలు పక్కకు వెళ్లిపోయాయి. పుట్టిన మట్టి సాక్షిగా నేను ఎటువంటి అక్రమ పనులు నేను చేయలేదు. నా పైన రెండేళ్ల నుంచి వ్యక్తిత్వ హనానికి పాల్పడ్డారు. నేను డ్రగ్స్ తీసుకుంటానని.. నాకు హీరోయిన్లతో సంబంధం ఉందని వార్తలు రాయించారు. నన్ను నా కుటుంబాన్ని బాధ పెట్టారు. రెండేళ్ల నుంచి నా పరువుకు బాధ్యుడు ఎవడో సమాధానం చెప్పాలి. ఇదే విషయాన్ని సిట్ విచారణలో నేను అడుగుతాను’ అని కేటీఆర్ అన్నారు.
నేను ఎన్నడూ అక్రమ, అనైతిక పనులు చేయలేదని పుట్టిన ఈ మట్టి సాక్షిగా చెప్తున్నాను: కేటీఆర్ pic.twitter.com/FHqNVlYXIQ
— ChotaNews App (@ChotaNewsApp) January 23, 2026
సింగరేణి స్కామ్ బయటపెట్టామని..
తమ ఎమ్మెల్యేలను కొనేందుకు యత్నించి గతంలో రూ. 50 లక్షల రూపాయాలతో గతంలో రేవంత్ రెడ్డి దొరికిపోయారని కేటీఆర్ గుర్తుచేశారు. ఆయన ముఖ్యమంత్రి కాగానే మా పైన ఇలాంటి దాష్టీకానికి పాలపడుతున్నారని అన్నారు. ‘సింగరేణిలో అతి పెద్ద కుంభకోణం జరిగింది అని హరీష్ రావు బయట పెట్టారు. ఉదయం ఈ కుంభకోణంపై మాట్లాడగానే సాయంత్రం లోపు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇచ్చారు. హరీష్ రావు సిట్ విచారణకు హాజరై సిట్ అధికారులనే ఎదురు ప్రశ్నలు అడిగారు’ అని కేటీఆర్ తెలిపారు.
Also Read: Phone Tapping Case: త్వరలో కేసీఆర్‌కు నోటీసులు? గులాబీ నేతల్లో సిట్ తీరుపై చర్చ!
పోలీసులకు వార్నింగ్
కాంగ్రెస్ ప్రభుత్వం.. ఫోన్ ట్యాపింగ్ కేసును టీవీ సీరియల్లా నడిపిస్తోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘ఒక సినిమాలో బ్రహ్మానందం దొంగగా ప్రతిసారీ దొరుకుతాడు. అలానే రెండేళ్ల నుంచి రేవంత్ రెడ్డి దొంగ పనులు చేసుకుంటూ దొరికిపోతున్నాడు. దండుపాళ్యం ముఠా అక్రమాలు బయట పెడుతున్నందుకే మాపైన ఇలాంటి కేసులు, విచారణలు. నా వ్యక్తిత్వం హనానికి పాల్పడుతున్న కొందరి పోలీస్ అధికారులను అధికారంలోకి రాగానే వదిలి పెట్టేది లేదు. అర్జునుడి కన్ను పక్షి మీద ఉన్నట్లు మేము మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై పోరాడుతూనే ఉంటాం’ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

