Harish Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ నోటీసులు పంపడాన్ని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. హమీలు అమలు చేయడం చేతకాక.. ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నోటీసులు పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న తనకు.. ఇవాళ కేటీఆర్ కు సిట్ (SIT) నోటీసులు అందాయని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని నోటీసులు పంపినా, ఎన్ని కేసులు పెట్టినా ఆయన్ను వెంటాడుతూనే ఉంటామని హరీశ్ రావు శపథం చేశారు.
నిలదీయడాన్ని తట్టుకోలేకనే..
గురువారం మెదక్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్లిన హరీశ్ రావు.. కాంగ్రెస్ కి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ కేటీఆర్ కు సిట్ నోటీసులు పంపడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే తమకు సిట్ నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ ఒకవైపు.. తాను మరోవైపు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే వారి వద్ద సమాధానాలు ఉండటం లేదని పేర్కొన్నారు. ఈ కారణం చేతనే ప్రేమ లేఖ లాగా.. సీఎం రేవంత్ సిట్ నోటీసులు పంపిస్తున్నారని ధ్వజమెత్తారు. తమకు ఎన్ని నోటీసులు ఇచ్చినా ప్రశ్నిస్తూనే ఉంటామని హరీశ్ రావు తేల్చి చెప్పారు.
నోటీసులు పంపినా.. వెనక్కి తగ్గబోం
మహాలక్ష్మీ ఇచ్చేదాక, రైతు రుణమాఫీ అయ్యేదాక సీఎం రేవంత్ సర్కార్ ను ప్రశ్నిస్తూనే ఉంటామని హరీశ్ రావు అన్నారు. అవ్వతాతలకు రూ. 4000, తులం బంగారం ఇచ్చేదాకా అడుగుతూనే ఉంటామన్నారు. సిట్ నోటీసుల పేరుతో అటెన్షన్ డైవర్షన్ చేసినా.. వెనక్కి తగ్గబోమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు ఫీజు రీఎంబర్స్ మెంట్ డబ్బులు ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి వెంటపడుతూనే ఉంటామన్నారు. మెదక్ లో కాంగ్రెస్ కు ఓటు వేయడం అంటే మన జిల్లాను మనమే రద్దు చేసుకోవడమని.. మన కంటిని మనమే పొడుచుకున్నట్లని హరీశ్ రావు విమర్శించారు.
నిన్న నాకు నోటీసు..
నేడు @KTRBRS గారికి నోటీసు..బొగ్గు స్కాంపై సమాధానం చెప్పే దమ్ములేదు
నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డా రేవంత్ రెడ్డి.. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసేదాకా నీ వెంట పడుతూనే ఉంటం
ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా నిన్ను వదిలి… pic.twitter.com/dJrzgahaOg
— Harish Rao Thanneeru (@BRSHarish) January 22, 2026
Also Read: Notice to KTR: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. కేటీఆర్‌కు సిట్ నోటీసులు
కేసీఆర్‌తో అత్యవసర భేటి..
కేటీఆర్ కు సిట్ నోటీసుల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరింత హీటెక్కాయి. కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR)తో కేటీఆర్, హరీశ్ రావు భేటి కాబోతున్నారు. ప్రస్తుతం సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్, మెదక్ పర్యటనలో హరీశ్ రావు ఉన్నారు. దానిని త్వరితగతిన ముగించుకొని.. ఎర్రవల్లి ఫాంహౌస్ వద్దకు ఇరువురు నేతలు వెళ్లనున్నారు. మరోవైపు కేసీఆర్ కు సైతం సిట్ నోటీసులు ఇవ్వొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సిట్ కేసులో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై ముగ్గురు నేతలు చర్చించే అవకాశముంది.

