Notice to KTR: తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. రేపు (శుక్రవారం) ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు రావాలని (Notice to KTR) కోరారు. 160 సీఆర్‌పీసీ కింద ఈ నోటీసులు జారీ చేశారు. కాగా, ఇదే కేసులో మాజీ మంత్రి హరీష్ రావుని మంగళవారమే సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కొడుకుగా ఉన్న కేటీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ప్రతి విషయం తెలుసునంటూ ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నోటీసులు వెలువడడం ఉత్కంఠగా మారింది. కొత్త విషయాలపై ప్రశ్నించేందుకే కేటీఆర్‌ను పిలిచిందా?, ఏయే అంశాలపై సిట్ అధికారులు ప్రశ్నించనున్నారనేది ఉత్కంఠగా మారింది. ఒక లిస్ట్ ముందుపెట్టి సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు హరీష్ రావు నిర్ఘాంతపోయారంటూ ఊహాగానాలు నడుస్తున్నాయి. ‘‘మీపై నిఘా పెట్టి, మీ ప్రతి కదలికను ప్రభుత్వం గమనించింది తెలుసా?’’ అని సిట్ అధికారులు అడిగిన ప్రశ్నకు హరీష్ రావు కొన్ని సెకన్లపాటు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారంటూ ప్రచారం జరుగుతోంది.
Read Also- Naini Coal Block Tender: నైనీ బొగ్గు గనుల టెండర్ రద్దు.. రంగంలోకి కేంద్రం.. విచారణకు ఆదేశం
ఈ కేసులో ఇప్పటికే ప్రశ్నించిన సాక్షులు ఇచ్చిన చాలా సమాధానాలను సమగ్రంగా విన్న తర్వాత అధికారులు నోటీసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. కేటీఆర్‌ను ఏయే ప్రశ్నలు అడగనున్నారు?, ఏమైనా కొత్త విషయాలు బయటపడతాయా? అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
నెక్స్ట్ ఎవరు?
మరోవైపు, ఈ కేసులో బీఆర్ఎస్‌కు చెందిన మరికొందరు నేతలను కూడా ప్రశ్నించవచ్చంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. నాటి ప్రభుత్వ పెద్దగా ఉన్న కేసీఆర్‌ను ప్రశ్నిస్తారా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. సంతోష్‌ని కూడా ప్రశ్నించే ఛాన్స్ ఉందంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. అలాగే, కవితను కూడా సాక్షిగా పిలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే, తన భర్త ఫోన్‌ను కూడా ట్యాపింగ్ చేశారంటూ గతంలో ఆమె ఆరోపించారు.
హరీష్ రావు స్పందన ఇదే
కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ లీడర్ హరీష్ రావు స్పందించారు. నిన్న తనకు నోటీసు, నేడు కేటీఆర్‌కి నోటీసులు ఇచ్చారని, కానీ, బొగ్గు స్కామ్‌పై సమాధానం చెప్పే దమ్ములేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘‘నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డా రేవంత్ రెడ్డి.. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసేదాకా నీ వెంట పడుతూనే ఉంటాం. ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా నిన్ను వదిలి పెట్టం. వెంటపడుతాం’’ అని హరీష్ రావు హెచ్చరించారు. ఈ మేరకు మెదక్‌లో ఆయన మాట్లాడారు.
Read Also- Medaram jatara 2026: భక్తులకు గుడ్ న్యూస్.. మేడారంలో హెలికాప్టర్ రైడ్స్.. ఒక్కొక్కరికి ఎంతంటే?

