TDP Cadre on YS Jagan: తెలుగు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నేతల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఒకరు. తండ్రి (వైఎస్ఆర్) మరణాంతరం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతోనే కొట్లాది బయటకొచ్చిన జగన్.. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ (YSRCP) పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల ఓటమి తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ లో పాదయాత్ర నిర్వహించిన జగన్.. అది విజయవంతం కావడంతో 2019 ఎన్నికల్లో ఏకంగా 175 స్థానాలకు గాను 151 గెలుచుకొని ఏపీ సీఎం అయ్యారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కలయిక కారణంగా 2024 ఎన్నికల్లో ఘోర పరాభవానికి గురై 11 సీట్లతో జగన్ సరిపెట్టుకున్నారు. అయితే తనకు బాగా కలిసొచ్చిన పాదయాత్రపై జగన్ మళ్లీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది పాదయాత్ర చేయబోతున్నట్లు జగన్ స్వయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో జగన్ పై విమర్శనాస్త్రాలను ఆయన ప్రత్యర్థులు సంధిస్తున్నారు. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఇంతకీ జగన్ ఏమన్నారంటే?
బుధవారం తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఏలూరుకు చెందిన నేతలతో జగన్ భేటి అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన పాదయాత్ర గురించి కీలక ప్రకటన చేశారు. కూటమి పాలనా కాలాన్ని బడ్జెట్ తో పోలుస్తూ.. ఇంకా మూడేళ్ల కాలమే మిగిలి ఉందని జగన్ అన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్న ఆయన.. వచ్చే ఏడాదిలో తన పాదయాత్ర ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. దీంతో సమావేశంలో ఒక్కసారిగా హర్షధ్వానాలు, కేరింతలు వినిపించాయి. ప్రస్తుతం జగన్ చేసిన ఈ వ్యాఖ్యలే.. ప్రత్యర్థులకు అస్త్రాలుగా మారుతున్నాయి.
ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తా.. ఆ తర్వాత ప్రజలతోనే మమేకమవుతూ, ప్రజలతోనే ఉంటా
– వైఎస్ జగన్ pic.twitter.com/WlKkjjoYL3
— ChotaNews App (@ChotaNewsApp) January 21, 2026
అసెంబ్లీ గైర్హజరుతో లింకప్..!
జగన్ పాదయాత్ర వ్యాఖ్యలపై అధికార పార్టీ వర్గాలు సెటైర్లు వేస్తున్నాయి. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలను ప్రస్తావించడానికే భయపడుతున్న వ్యక్తి.. పాదయాత్ర చేసి సామాన్యులకు ఏం ఒరగబెడతారని ప్రశ్నిస్తున్నారు. ప్రజలపై అంత ప్రేమ ఉంటే అసెంబ్లీకి వచ్చి.. చంద్రబాబు (CM Chabrababu) నేతృత్వంలోని ప్రభుత్వాన్ని నేరుగా ఎదుర్కొవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. జగన్ తన మెుదటి పాదయాత్రలో ఒక్క చాన్స్ అంటూ ప్రజలను వేడుకున్నారని.. దానిని నమ్మి ప్రజలు 2019లో జగన్ కు పట్టం గట్టారని గుర్తు చేశారు. మూడు రాజధానుల పేరిట జగన్ ఆడిన మూడు ముక్కల ఆట చూసి ప్రజలు విసుగుచెందారని ఆరోపిస్తున్నారు. అందుకే 11 సీట్లు మాత్రమే ఇచ్చి పక్కన పెట్టారని స్పష్టం చేస్తున్నారు. ఈసారి జగన్.. పాద యాత్ర పేరుతో మరో డ్రామాకు తెరతీసిన ప్రజలు పట్టించుకునే పరిస్థితి ఉండదని టీడీపీ శ్రేణులు, అధికార పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Also Read: YS Jagan: భూముల రీసర్వే రగడ.. పెద్ద మనిషి అంటూనే.. చంద్రబాబుపై జగన్ సెటైర్లు!
పాదయాత్రతో ఫలితం ఉంటుందా?
ఏపీలో 2029లో ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం తలపిస్తే 2028 చివరిలో ఎన్నికలు ఉండొచ్చని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొనే జగన్.. 2027లో తన పాదయాత్ర ప్రారంభించేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. అయితే ఈ దఫా జగన్ చేపట్టే పాదయాత్రకు.. 2019లో ఉన్న స్థాయిలో ఆదరణ ఉంటుందా? అన్నది చెప్పడం కష్టమే. ఎందుకంటే జగన్ అసెంబ్లీకి వెళ్లకుండా ప్రతిపక్ష హోదా కోసం పోరాడటంపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజల సమస్యలపై కాకుండా తన వ్యక్తిగత హోదా కోసం జగన్ పాకులాడటం వైసీపీ నేతలకు సైతం రుచించడం లేదన్న టాక్ ఉంది. జగన్ అసెంబ్లీకి వెళ్లి కూటమి ప్రభుత్వం తప్పులను కడిగివేస్తే చూడాలని ఆ పార్టీ శ్రేణులు సైతం ఆశిస్తున్నారు. అది వదిలేసి పాదయాత్ర ద్వారా ప్రజల వద్దకు వెళ్తే.. వారి నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పుకోగలరా? అన్న ప్రశ్నలు రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

