Kishan Reddy: అప్పుల ఊబిలో సింగరేణి.. దీనికి కారణం బీఆర్ఎస్!
Kishan Reddy (imagecredit:twitter)
Telangana News, ఖమ్మం

Kishan Reddy: అప్పుల ఊబిలో సింగరేణి.. దీనికి కారణం బీఆర్ఎస్: మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy: ఒకప్పుడు బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్‌స్ట్రక్షన్(బీఐఎఫ్ఆర్)లో అప్పుల ఊబిలో కూరుకుపోయిన సింగరేణిని ఎన్డీయే ప్రభుత్వం ఆదుకున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తుచేశారు. న్యూఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో రూ.684 కోట్ల అప్పుపై మారిటోరియం విధించి సింగరేణిని కాపాడారని గుర్తుచేశారు. తద్వారా సింగరేణి లాభాల బాటలో పడిందన్నారు. కానీ, 2014 తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిని రాజకీయ ప్రయోగశాలగా మార్చిందని, అవినీతి అక్రమాలకు కేంద్రంగా సింగరేణి మారిపోయిందని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో కొనసాగుతున్నదన్నారు. తెలంగాణ ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం, సింగరేణి సంస్థకు నైని కోల్ బ్లాక్‌ను కేటాయించిందన్నారు. 2015లోనే ఈ బ్లాక్ కేటాయించి.. కేంద్రం నుంచి రావాల్సిన అన్ని అనుమతులను సరైన సమయంలో అందించిందని తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే నైని కోల్ బ్లాక్ విషయంలో.. టెండర్లను ఆహ్వానించి.. ముఖ్యమంత్రి చివరి నిమిషంలో వెనక్కు తగ్గారని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పద్ధతిలో టెండర్లను ఆహ్వానించి వెనకకి తగ్గిందన్నారు. 2024లో తాను బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నైని కోల్ బ్లాక్ కు సంబంధించిన చివరి అనుమతులు రావడంలో సీఎం ఒడిశా, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో మాట్లాడి అనుమతులు వచ్చేలా చొరవ తీసుకున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు. ఈ ప్రయత్నాల కారణంగా సహకార సమాఖ్య స్ఫూర్తితో 643 హెక్టార్ల అటవీ భూమిని సింగరేణికి అప్పగించేందుకు ఒడిశా ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందన్నారు. నైని బ్లాక్‌కు తుది అనుమతులు వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పనులను ప్రారంభించాల్సింది పోయి, పారదర్శకమైన పద్ధతిలో పనులు చేపట్టాల్సింది పోయి ఆలస్యం చేసిందని మండిపడ్డారు. అనేక అక్రమాలు, అవినీతి జరిగినట్లు వార్తలు రావడం దురదృష్టకరమని కిషన్ రెడ్డి వివరించారు.

తెలంగాణ అభివృద్ధిలో సింగరేణిది కీలకపాత్ర

తెలంగాణలో 8 జిల్లాలకు పైగా విస్తరించిన సింగరేణి, తెలంగాణ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిందని కిషన్ రెడ్డి తెలిపారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత.. సింగరేణి ఇబ్బందులను ఎదుర్కొందని వివరించారు. లాభాల్లో ఉన్న సింగరేణిలో తెలంగాణ వచ్చిన తర్వాత సమస్యల్లో చిక్కుకుందన్నారు. ఈ సంస్థలో తెలంగాణ వాటా 51 శాతం, కేంద్రం వాటా 49 శాతం ఉన్నా అనేక సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వానిదే జోక్యం తప్పితే.. అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదని గుర్తుచేశారు. కేంద్రం నుంచి ముగ్గురు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏడుగురు బోర్డు డైరెక్టర్లుగా ఉంటారన్నారు. బీఆర్ఎస్ హయాంలో.. రాష్ట్రంలో పదేళ్ల పాటు కల్వకుంట్ల ఫ్యామిలీ మాటే సింగరేణిలో చెల్లుబాటైందని ఆరోపించారు. టెండర్ల దగ్గర్నుంచి, చిన్న చిన్న కాంట్రాక్టుల వరకు ప్రతి చోటా కేసీఆర్ కుటుంబం ఆడింది ఆట అన్నట్లు సాగిందని ఆరోపించారు. సింగరేణి కార్యక్రమాల్లో రాజకీయ జోక్యంతో.. సమస్యల్లోకి నెట్టేశారని ధ్వజమెత్తారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు రూ.32వేల కోట్ల బకాయిలు పెట్టారన్నారు. ఎన్నిరకాలుగా సింగరేణిని విధ్వంసం చేయవచ్చో, బీఆర్ఎస్ అన్ని ప్రయత్నాలు చేసిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పద్ధతిని ఫాలో అవుతోందని కేంద్ర మంత్రి విమర్శించారు. తమ అవినీతి అక్రమాలకు.. సింగరేణిని బంగారు బాతుగా వాడుకున్నారని మండిపడ్డారు.

బొగ్గు వెలికి తీసే ప్రక్రియ ఆలస్యం

బొగ్గు వెలికి తీయడం, బొగ్గు రవాణాకు సంబంధించి టెండర్లో ‘సైట్ విజిట్ సర్టిఫికేట్’ నిబంధనను సింగరేణి యాజమాన్యం.., రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో చేర్చిందని కిషన్ రెడ్డి వివరించారు. అనేక చోట్ల సైట్ విజిట్ చేయాలనే నిబంధన ఉందని, కానీ అది సెల్ఫ్ డిక్లరేషన్ అని చెప్పుకొచ్చారు. బ్లాక్ కు సంబంధించి సరైన వివరాలు తెలియకుండా టెండర్ కు వస్తే ఇబ్బందులుంటాయని, అవగాహన కోసం ఈ నియమాన్ని తీసుకొచ్చామని చెప్పారు. సైట్ విజిట్ చేసిన తర్వాతే.. సదరు కాంట్రాక్టర్‌కు మినరల్ నిల్వలపై, అక్కడి భౌగోళిక స్థితిపై ఓ స్పష్టమైన అవగాహన వస్తుందనేది ఆ నిబంధనకు అర్థమని తెలిపారు. కానీ సింగరేణి ప్రభుత్వం దీన్ని తప్పనిసరి నిబంధనగా మార్చి అవినీతికి బాటలు వేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో చాలా చోట్ల టెండర్ల ప్రక్రియలో ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారని కేంద్ర మంత్రి వివరించారు. కానీ, సింగరేణిలో సైట్ విజిట్ నిబంధనను తప్పనిసరి చేసి బొగ్గు వెలికి తీసే ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.

Also Read: Viral Video: అగ్గిపెట్టెంత ఇల్లు.. రూ.1.2 కోట్లు అంట.. కొనేవాళ్లు మరీ అంత పిచ్చోళ్లా!

అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు

కోల్ బ్లాక్ కు సంబంధించి సీబీఐ దర్యాప్తు జరపాలని, కేంద్రమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించడంపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. సీబీఐ దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉండాలని, కానీ కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు. కొన్ని సంస్థలకు, కొందరు వ్యక్తులకు లాభం చేసేలా వ్యవహరించిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. తాడిచర్ల కోల్ బ్లాక్ ను జెన్కోకు కేటాయించామని, దీని మైనింగ్ చేసేందుకు సింగరేణి ముందుకొస్తే వారితో తాము పనిచేయలేమని లేఖ రాయించుకుని ప్రైవేట్ కంపెనీకి 25 ఏళ్ల టెండర్ కట్టబెట్టిన మాట వాస్తవం కాదా? అని కిషన్ రెడ్డి నిలదీశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి సుమారు రూ.47వేల కోట్లు బకాయి పడిందని గుర్తుచేశారు. దేశంలో ఏ కోల్ మైనింగ్ కంపెనీ కూడా.. ఈ స్థాయిలో ఇబ్బందుల్లేవన్నారు. ఇదిలా ఉండగా సింగరేణిలో జీ 11 గ్రేడ్ బొగ్గు అమ్మకం ధర టన్నుకు రూ.4,088 అని, అదే కోలిండియాలో జీ 11 గ్రేడ్ బొగ్గు ధర రూ.1,605 గా ఉందన్నారు. అంటే దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ అని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణిపై పడి దోచుకుంటున్నాయి కాబట్టే.. సంస్థను నడిపేందుకు వారి వద్ద ధరలను పెంచడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని వివరించారు. సింగరేణి కోల్ కొంటున్న జెన్కో కూడా ప్రభుత్వ సంస్థనే కాబట్టి.. సింగరేణి ధరలు పెంచుకుంటూ పోతోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. సింగరేణి బొగ్గు క్వాలిటీ 58 శాతం ఉండగా, కోలిండియాలో బొగ్గు క్వాలిటీ 86 శాతం ఉన్నట్లు తెలిపారు. సింగరేణి అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడింది కాబట్టి.., క్వాలిటీ విషయంలో రేట్ విషయంలో తప్పటడుగులు వేస్తోందని పేర్కొన్నారు. ఎన్టీపీసీ, ఏపీ ప్రభుత్వం, కర్ణాటక సర్కార్ కూడా సింగరేణి బొగ్గు తమకు వద్దని అంటున్నాయని, అవినీతి, అక్రమాల కారణంగా సింగరేణి భవిష్యత్ అంధకారంలో పడే పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు.

మంత్రుల మధ్య వాటాల పంపిణీతోనే వివాదాలు

సింగరేణి భూములను గతంలో బీఆర్ఎస్ నేతలు, ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు ఆక్రమణలు చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు. దీనిపై బోర్డు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ డైరెక్టర్లు లేవనెత్తిన అంశాలపైనా చర్చించడం లేదన్నారు. సీబీఐ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే కేంద్రం దీన్ని పరిశీలిస్తుందని వివరించారు. మంత్రుల మధ్య వాటాల పంపిణీతోనే ఈ వివాదాలు బయటకొచ్చాయని ఆయన పేర్కొన్నారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను ఎలా చెల్లిస్తారని, వివిధ దశల్లో చెల్లిస్తారా? ఒకేసారి చెల్లిస్తారా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. టెండర్ల ప్రక్రియ విషయంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటును కూడా పరిశీలిస్తున్నట్లు ఆయన స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి.., సింగరేణిని లాభాల బాటలో నడిపే బాధ్యతలను తమకు అప్పగిస్తే.. ఆ బాధ్యతను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి తెలిపారు.

Also Read: Ind vs NZ 1st T20: తొలి టీ20లో టీమిండియా విధ్వంసం.. కివీస్‌ ముందు భారీ టార్గెట్!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?