Athreyapuram Brothers: సినిమా రంగంలో ప్రస్తుతం ట్రెండ్ మారింది. మూస కథలను కాకుండా సరికొత్త కాన్సెప్ట్‌లను కోరుకుంటున్న నేటి తరం ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా, దర్శకుడు రాజేష్ జగన్నాధం ‘ఆత్రేయపురం బ్రదర్స్’ అనే వైవిధ్యభరితమైన చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు తాజాగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగాయి. S2S సినిమాస్ మరియు ది ఫెర్వేంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్లపై VSK సంజీవ్, వంగపల్లి సందీప్, వంగపల్లి సంకీర్త్, ప్రవీణ్ గద్దె, రాజేష్ గద్దె, రాకేష్ గద్దె సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Read also-Allu Arjun: అల్లు అర్జున్ ‘AA23’లో పూజ హెగ్డే.. అలా వైకుంఠపురంలో రిపీట్ అవుతుందా..
ఈ ప్రారంభోత్సవ వేడుకకు టాలీవుడ్ యువ దర్శకులు వశిష్ట, అనుదీప్, ఆదిత్య హాసన్, ప్రవీణ్ కాండ్రేగుల ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు. ముహూర్తపు సన్నివేశానికి వశిష్ట క్లాప్ కొట్టగా, విజయ్ కనకమేడల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనుదీప్ గౌరవ దర్శకత్వం వహించగా, ప్రవీణ్ కాండ్రేగుల మరియు ఆదిత్య హాసన్ స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందజేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ‘ఏ స్వీట్ రైవల్రీ’ అనే ట్యాగ్‌లైన్‌తో కూడిన కాన్సెప్ట్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.
Read also-AR Rahman: ఏఆర్ రెహమాన్‌పై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన ఆర్జీవీ.. ఏం జరిగిందంటే?
నటీనటుల విషయానికి వస్తే రాజీవ్ కనకాల, రఘు బాబు, గవిరెడ్డి, సన్నీ పత్సా, గీత్ సాయిని, నేహా పఠాన్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాంకేతికంగా కూడా ఈ సినిమా పటిష్టంగా ఉండబోతోంది; రమీజ్ నవనీత్ ఛాయాగ్రహణం అందిస్తుండగా, సంతు ఓంకార్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అనిల్ పసల ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆత్రేయపురం నేపథ్యంలో సాగే ఈ ఆసక్తికరమైన కథకు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ మరియు ఇతర వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

