Boora Narsaiah Goud: ఆయన అన్నీ రాసుకుంటున్నాడు
సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు తీస్తాం
బొగ్గు గనుల కేటాయింపుల ఇష్యూ సైతం బయటపడుతుంది
గాంధీ అందరి మనసులో.. అందరి జేబులో ఉన్నారు
నకిలీ గాంధీలు వచ్చి అసలు గాంధీ పేరు చెడగొట్టారు: మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ఢిల్లీలో తమకో చిత్రగుప్తుడు ఉన్నాడని, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను, వారి అవినీతిని ఎప్పటికప్పుడు ఢిల్లీలోని ఆ చిత్రగుప్తుడు రాసుకుంటున్నాడని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ (Boora Narsaiah Goud) వ్యాఖ్యానించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బొగ్గు గనుల ఇష్యూపై సైతం తమ చిత్రగుప్తుడు రాసుకుంటున్నాడని, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా జీ రామ్ జీ బిల్లును ఆషామాషీ వ్యవహారంగా చూడొద్దన్నారు. ఈ పథకం వల్ల గ్రామాలు, సర్పంచ్ లు, వార్డు మెంబర్లకు జరిగే లబ్ధి గురించి కూడా ఆలోచించాలని సూచించారు. కాంగ్రెస్ లో కేవలం కరప్షన్ మాత్రమే ఉందన్నారు. మన్రేగా మొదలుపెట్టి 2 దశాబ్ధాలు అయిందని, పేదలు తిండి కోసం ఎన్నో తిప్పలు పడ్డారని గుర్తుచేశారు.
Read Also- Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!
మన్రేగా కోసం ఇప్పటి వరకు కేంద్రం మొత్తం రూ.11.53 లక్షల కోట్లు ఖర్చు పెట్టిందని ఆయన పేర్కొన్నారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద పథకమని కొనియాడారు. అయితే యూపీఏ హయాంలో కేవలం రూ.2.13 లక్షల కోట్లు మాత్రమే ఈ పథకం కోసం ఖర్చు చేశారని, అదే.. మోడీ ప్రధాని అయ్యాక రూ.8.55 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు చెప్పారు. మన్రేగా అంటే లోపాల పుట్ట అని, అందుకే మోడీ ప్రక్షాళనలో భాగంగా జీ రామ్ జీ గా మార్చారన్నారు. రూ.11.53 లక్షల కోట్లతో దాదాపు 2 కోట్లకు పైగా ఇండ్లు కట్టే వాళ్ళమని, లక్షకు పైగా కిలోమీటర్ల రోడ్డు నిర్మించవచ్చని, 19 వేల హాస్పిటల్స్, వేల కొద్దీ స్కూల్స్ నిర్మించేవాళ్ళమన్నారు. కానీ మన్రేగా వల్ల నిర్మాణాత్మక పని ఒక్కటైనా జరిగిందా? అని ఆయన ప్రశ్నించారు.
Read Also- Minister Seethakka: మేడారంలో సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి సీతక్క ప్రశంసల జల్లు.. కారణం ఏంటంటే?
గతంలో 100 రోజుల పనిదినాలు ఉండేదని, కానీ గరిష్టంగా 80 రోజులు కూడా పనిదినాలు పూర్తి చేయలేదన్నారు. కేంద్రం జీ రామ్ జీ పథకం కింద ప్రతీ ఏడాది బడ్జెట్ అందించాలని నిర్ణయించిందని, ప్రతీ ఏటా రూ.1.51 లక్షల కోట్ల బడ్జెట్ ను కేటాయించాలని నిర్ణయించినట్లు బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. దీంతో ప్రతి గ్రామానికి ఏడాదికి రూ.50 లక్షలు వస్తాయన్నారు. రాష్ట్ర వాటా 40 శాతం ఉంటుందన్నారు. ఇకపోతే సీఎం పొట్ట కోస్తే అణా పైసా కూడా ఉండదని, కానీ కేంద్రంపై విమర్శిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. గాంధీ అందరి మనసులో, అందరి జేబులో ఉన్నారన్నారు. నకిలీ గాంధీలు వచ్చి అసలు గాంధీ పేరు చెడగొట్టారని విరుచుకుపడ్డారు. గాంధీ అంటే ఏ గాంధీ అనుకోవాలని, జీ రామ్ జీ లో ముందు, వెనుక గాంధీనే ఉందన్నారు. సీఎం.. సీపీఎం మీటింగులో బీజేపీ బ్రిటిష్ వాళ్లకంటే డేంజర్ అని విమర్శించారని, అయితే.. మత రాజకీయాలు, హిందూ దేవుళ్ళను కించపరిచేవాళ్లకు, దేశాన్ని నాశనం చేయాలని చూసే వారికి బీజేపీ డేంజరేనని వార్నింగ్ ఇచ్చారు. సీఎం అవ్వకముందు రేవంత్ అంటే గౌరవం ఉండేదని, సీఎం అయ్యాక అందరూ మారిపోతున్నారంటూ బూర చురకలంటించారు. ఫైటర్ నుంచి చీటర్ గా మారారని విమర్శించారు. మోడీని ఢిల్లీలో పొగిడి.. ఇక్కడికి వచ్చి తిడుతున్నాడని బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. మోడీని ఈ లిల్లీ పుట్ గాళ్ళు గద్దె దింపుతారా? అని ఫైరయ్యారు. మోడీ భీష్మాచార్యుడి లాంటి వ్యక్తి అని.., ఆయన అనుకున్నప్పుడే దిగుతారని. ఇతరులు అనుకుంటే అది జరగని పని అని నర్సయ్య గౌడ్ తెలిపారు.

