Bhatti Vikramarka:
మధిర, స్వేచ్ఛ: రాష్ట్రంలో సంపదను పెంచుతాం, పంచుతాం.. గద్దలు, డేగలు .. రాబందులను దరిదాపుల్లోకి రానివ్వబోమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka) పునరుద్ఘాటించారు. మహిళలను మహారాణులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలోని మహిళా సంఘాల సభ్యులకు రూ.5,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నట్టు చెప్పారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా మొదటి సంవత్సరం రూ.20,000 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తామంటే ఆనాడు హేళన చేశారు, కానీ మేం లక్ష్యాన్ని మించి 26 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశామని ఆయన ప్రస్తావించారు. ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తి చేసుకోవాలని, ప్రతి వారం బిల్లులు మంజూరు చేస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఎన్నికల ముందు పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు యాత్ర చేపట్టగా ప్రతి చోటా ఇల్లు ఇప్పించాలంటూ చాలామంది ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పదేళ్లు పరిపాలించిన వారు ఇల్లు ఇవ్వలేదని, తాము అధికారంలోకి రాగానే ఒక్కొక్కరికి ఐదు లక్షల వ్యయంతో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పామని, హామీ మేరకు అధికారంలోకి రాగానే మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్లు రూ.22,500 కోట్లతో నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.
Read Also- Naini Coal Block: బొగ్గు బ్లాక్ టెండర్లపై ఆరోపణల వేళ.. మాజీ మంత్రి హరీష్ రావు హాట్ హాట్ కామెంట్స్
రైతులు, పేదల సంక్షేమం కోసం మూడు లక్షల కోట్ల బడ్జెట్లో రూ.1,21, 874 కోట్లు ఖర్చు చేసినట్టు భట్టివిక్రమార్క తెలిపారు. ‘‘వ్యవసాయ ఆధారిత రాష్ట్రం మనది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా, సన్నధాన్యానికి బోనస్, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాల కోసం 74,163 కోట్లు నేరుగా రైతులకు పంపిణీ చేస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు పేద వర్గాల సంక్షేమం కోసం చేపట్టి రూ.47,710 కోట్లు నేరుగా రైతులు, పేదల చేతికి ప్రజా ప్రభుత్వం అందిస్తుంది. మహిళలు ఆత్మగౌరవంతో బతికేందుకు ధైర్యంగా ముందుకు వెళ్లేందుకు ఉచితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాం. ఇందుకుగానూ ప్రభుత్వం ఇప్పటివరకు మహిళల పక్షాన ఆర్టీసీకి రూ.7,000 కోట్లు చెల్లించింది’’ అని భట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన చీరలు పొలాల్లో దిష్టిబొమ్మలకు కట్టేందుకు కూడా పనికిరావని, కానీ ప్రజా ప్రభుత్వం వచ్చాక ప్రతి ఆడబిడ్డ ఇంటికి నాణ్యమైన చీరను బొట్టు పెట్టి పంపిణీ చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో 1.15 లక్షల కుటుంబాలు ఉండగా 96 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం కిలో ధర 55 రూపాయలు పలుకుతుండగా ఒక్కో మనిషికి ఆరు కిలోల చొప్పున ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుందని ఆయన చెప్పారు. పిల్లలు ప్రపంచంతో పోటీపడేలా రాష్ట్రవ్యాప్తంగా 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు.
Read Also- Renu Desai: అందుకే పవన్ కళ్యాణ్ నీ నుంచి విడిపోయాడు.. అలాంటి థంబ్స్ పెట్టకండి ప్లీజ్!
సోమవారం సాయంత్రం ఆయన మధిర మున్సిపాలిటీ పరిధిలోని మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. అసాధ్యం అన్నది సాధ్యమని చేసి చూపడమే ప్రభుత్వ లక్ష్యమని, పేద మధ్యతరగతి మహిళల కోసం ఎంతటి ఆర్థిక భారాన్నైనా మోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇప్పటికే 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాల కు సంబంధించిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించిందని తెలిపారు. మహిళలను మహారాణులుగా తీర్చిదిద్దేందుకు మొదటి సంవత్సరంలో 26 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశామని తెలిపారు.

