Medaram Jatara 2026: తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే సమ్మక్క, సారలమ్మ మేడారం మహా జాతర మరో పది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సారి మహా జాతర జనవరి 28నుండి 31 వరకు జరుగనుంది. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో మేడారం స్వరూపం పూర్తిగా మారిపోయింది. నాటి మేడారానికి నేటి మేడారానికి ఎంతో తేడా కనిపిస్తోంది. జాతర నిర్వహణకు అవసరమైన వసతుల కల్పన, అభివృద్ధి పనులను త్వరితగతిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిచేసింది. ఈసారి శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేయడం విశేషం.
గద్దెల పున: నిర్మాణం
వందల ఏళ్లపాటు చెక్కుచెదరకుండా నిలిచేలా గద్దెల పున: నిర్మాణం పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసింది. గద్దెల విస్తరణ, ఆలయ ప్రాంగణం చుట్టూ గ్రానైట్ రాతి ప్రాకార నిర్మాణం, స్వాగత తోరణాల ఏర్పాటు చేశారు. మేడారం గద్దెల చుట్టూ నిర్మించిన 32 గ్రానైట్ పిల్లర్లపై ఆదివాసీ సంస్కృతి, ఆచారాలు, చరిత్రను తీర్చిదిద్దారు. మార్బుల్ శిలలతో గద్దెలూ, జంపన్నవాగు సుందరీకరణ, డ్రైనేజీ వ్యవస్థలు, ఫ్లడ్ మేనేజ్‌మెంట్, 60 అడుగుల వెడల్పుతో నాలుగు లైన్లకు రోడ్ల విస్తరణ, క్యూ లైన్లు, సత్రాలు, వాచ్ టవర్లు, గ్రీనరీ పనులు పూర్తయ్యాయి.
ఆదివాసుల సంస్కృతికి పెద్దపీట
గద్దెల ప్రాంగణానికి ఎదుట 50 అడుగుల వెడల్పున ప్రధాన స్వాగత తోరణం నిర్మించారు. వృత్తాకారంలో ఉండే గద్దె చుట్టూ 8 స్తంభాలు, మధ్యలో వెదురు బొంగులను పోలిన గ్రానైట్ తో తీర్చిదిద్దారు. శిలలపై ఆదివాసుల సంస్కృతికి పెద్దపీట వేశారు. తాళపత్రాల్లోని కోయ వంశీయుల చరిత్రను ప్రాంగణ గోడలపై చిహ్నాలుగా, బొమ్మలుగా చెక్కించారు. ఇందుకోసం తెలుపు రంగు రాళ్లను ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు తరలించి శిల్పులతో చెక్కించాక మేడారానికి తీసుకొచ్చారు.
రూ.251 కోట్లతో అభివృద్ధి పనులు..
మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. రూ.251 కోట్లతో మేడారం సమగ్ర అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. గద్దెల విస్తరణకే 101 కోట్లు కేటాయించింది. 4,000 టన్నుల గ్రానైట్‌తో గద్దెల ప్రాంగణ నిర్మాణ పనులు చేపట్టారు. 750 మంది కోయ వంశీయుల పేర్లకు సంబంధించిన 7,000కి పైగా శిల్పాలు, 930 ఏళ్ల కోయల తాళపత్ర గ్రంథాల ఆధారంగా శిల్ప రూపకల్పన చేశారు. 46 స్తంభాలతో 271 చ.మీ విస్తీర్ణంలో ప్రాకారం, 8 స్తంభాలతో వృత్తాకార గద్దె నిర్మాణం చేపట్టారు. 40 అడుగుల వెడల్పుతో 3 స్వాగత తోరణాలు, 30 అడుగుల వెడల్పుతో 5 స్వాగత తోరణాలు, 50 అడుగుల వెడల్పుతో ప్రధాన స్వాగత తోరణం ఏర్పాటు చేశారు.
Also Read: Janwada Land Scam: జన్వాడ లాండ్స్ స్కామ్‌లో సంచలనం.. సత్యం రాజు సహా 213 మందికి నోటీసులు
భావితరాలకు తెలిసేలా..
మేడారంలో కోయల ఆచార సంప్రదాయాలకు తగ్గట్టుగా సర్కారు పనులు చేపట్టింది. సమ్మక్క సారలమ్మ తల్లుల చరిత్ర అందరికీ తెలిసేలా శిలలపై చెక్కించారు. కోయల వద్ద దొరికిన 930 ఏండ్ల నాటి తాళపత్ర గ్రంథాల ఆధారంగా చెక్కించిన శిల్పాలు, చిహ్నాలు. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సమ్మక్క, సారక్క పగిడిద్దరాజు, గోవిందరాజు, కోయల ఇష్టదైవాలకు ప్రతిరూపంగా భావించే పులి, జింక, దుప్పి, పావురం, ఏనుగు, నెమలి, మొసలి, పశుపక్ష్యాదులతో పాటు కోయల జీవనశైలికి, ఆచార సంప్రదాయాలకు, గొట్టుగోత్రాలకు ప్రతిరూపంగా భావించే సూర్యచంద్రులు, త్రిశూలం, నెలవంక, బండి చక్రాలు, అడ్డ, నిలువు గీతలకు స్తంభాలపై చోటు దక్కింది. అలాగే సమ్మక్క- సారలమ్మ వంశస్తులైన దాదాపు 250 కోయల ఇంటి పేర్లు, వారి మూలాలను శిలలపై చెక్కడం ద్వారా వాళ్ల చరిత్రను భావితరాలు తెలుసుకునే అవకాశం దక్కుతుంది.
ఆదివాసీల అతిపెద్ద పండుగ అయిన మేడారం సమ్మక్క – సారలమ్మ పుణ్యక్షేత్రం పునరుద్ధరణ పూర్తయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు ప్రజలకు అంకితం చేశారు. ఈ చారిత్రాత్మక ఘట్టంలో ముఖ్యమంత్రి గారు కుటుంబ సమేతంగా సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ఆశీర్వాదం పొందారు.… pic.twitter.com/B6quNAvkI8
— Telangana CMO (@TelanganaCMO) January 19, 2026

