Kavitha Strategy: బీఆర్ఎస్ (BRS) నుంచి బయటకు వచ్చి, సొంత పార్టీ స్థాపనకు ముమ్మరంగా సన్నాహాలు జరుపుతున్న వేళ కవితకు సంబంధించిన ప్రతి అడుగు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసే విషయంలో బీఆర్ఎస్ కంటే ముందే స్పందించాలన్నది ఆమె రాజకీయ వ్యూహం కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సోమవారం నాడు కవిత స్పందనను అందుకు ఉదాహరణగా చూపుతున్నారు.
స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం-2026 సమ్మిట్‌లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), ప్రతినిధుల బృందం ఇప్పటికే బయలుదేరింది. అయితే, దావోస్ వెళ్లి కనీసం సదస్సులో కూడా పాల్గొనకముందే తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కవిత (Kavitha) విమర్శలకు దిగారు. ‘దావోస్ ట్రిప్ దండగ’ అంటూ సోమవారం ఆమె స్పందించారు. ‘‘ఎక్కే విమానం, దిగే విమానం.. రూ.లక్షల కోట్ల పెట్టుబడుల ప్రచారం తప్ప. రెండేళ్లలో తెలంగాణకు మీరు తెచ్చిందేమిటి ముఖ్యమంత్రి గారు?’’ అని ఆమె ప్రశ్నించారు. ‘‘ఆర్థిక సంవత్సరం 2024లో రూ.40,232 కోట్లు, 2025లో రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్‌లో వచ్చినట్టు మీరు, మీ ప్రభుత్వం ప్రచారం చేసుకున్నది. మొన్నటికి మొన్న కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు ఊదరగొట్టారు. దావోస్ సమ్మిట్‌లు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో చేసుకున్న ఎంవోయూలలో ఎన్ని పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయి?. ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయో చెప్తూ శ్వేతపత్రం విడుదల చేయండి’’ అని కవిత ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. కవిత పెట్టిన ఈ పోస్టు రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చకు (Kavitha Strategy) దారితీసింది.
బీఆర్ఎస్ కంటే ముందు స్పందనలు
ఇన్నాళ్లూ వేరు ఇప్పుడు వేరు.. తనకంటూ ఒక ప్రత్యేక రాజకీయ పార్టీ స్థాపించి, అస్తిత్వాన్ని నిర్మించుకునే క్రమంలో వేగంగా స్పందించాలన్నది కవిత ఉద్దేశం కావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై బీఆర్ఎస్ పెద్దగా స్పందించకముందే ఆమె విమర్శలు దాడి మొదలుపెట్టారు. బీఆర్ఎస్, ఇతర విపక్షాల కంటే ముందుగా స్పందించడమే త్వరలో పెట్టబోయే కొత్త పార్టీకి బలమైన పునాది అని ఆమె భావిస్తున్నట్టుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also- Gaddelu Controversy: తెలంగాణలో గద్దెల దుమారం.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య బిగ్ ఫైట్.. అసలేంటీ లొల్లి!
విమర్శల ఘాటు పెంచడం వెనుక వ్యూహం ఇదే!
సాధారణంగా కొత్త పార్టీ పెట్టే నాయకులు అధికారంలో ఉన్నవారిపై, ముఖ్యంగా అగ్రనేతలను అత్యంత బలంగా ఢీకొట్టాలని చూస్తుంటారు. తద్వారానే ప్రజల దృష్టిని ఆకర్షిస్తారు. కవిత కూడా అదే ఫార్ములాను అనుసరిస్తున్నారు. అయితే, ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ విపక్షాలుగా ఉండడంతో, ఆ రెండు పార్టీలను అధిగమించి మరీ ప్రజలను ఆకట్టుకోవాలంటే వేగం చాలా ముఖ్యమని కవిత గ్రహించి ఉండొచ్చు. మరోవైపు, తాను ప్రభుత్వంపై బలంగా పోరాడుతున్నానని చూపించి, తద్వారా బీఆర్ఎస్ శ్రేణులను సైతం ఆకర్షించాలనేది తన ఆలోచనగా ఉండొచ్చు. ఈ క్రమంలో కొత్త పార్టీ ప్రకటన వచ్చే వరకు కవిత తన విమర్శల డోస్ మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

