KGBV Teachers: పనిలో ముందు.. ఫలితాల్లో సాటి.. కానీ గుర్తింపులో మాత్రం వెనకబడ్డారు. ఇది నేడు రాష్ట్రవ్యాప్తంగా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో(Kasturba Gandhi Girls’ Schools) (కేజీబీవీ) పనిచేస్తున్న వేలాది మంది బోధన, బోధనేతర సిబ్బంది ఆవేదన. నిన్నటికి నిన్న నల్లగొండ(Nalgonda) జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కల్పన, జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయిని గీతారెడ్డి మృతి చెందడంతో, వారి దశాబ్దాల నాటి ఉద్యోగ భద్రత అంశం మరోసారి చర్చనీయాంశమైంది. నిరుపేద, అణగారిన వర్గాల బాలికలకు విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన కేజీబీవీల్లో చాలామంది టీచర్లు గత 20 ఏళ్లుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికనే విధులు నిర్వహిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా చదువుల తల్లి సేవలో తరిస్తున్నా, ప్రభుత్వం తమను పర్మినెంట్ చేయకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వయస్సు పైబడుతున్నా ఉద్యోగ భద్రత లేక భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు.
మాపై ఎందుకీ వివక్ష?
పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెరగకపోవడంతో కేజీబీవీ సిబ్బంది ఆర్థికంగా కుంగిపోతున్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలను పోషించుకోవడం భారంగా మారిందని, కనీసం ‘సమాన పనికి సమాన వేతనం’ అనే సూత్రం కూడా తమకు వర్తించడం లేదని వారు వాపోతున్నారు. సెలవులు, ఇతర సౌకర్యాల విషయంలోనూ తమపై వివక్ష కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ ప్రమాదం కేజీబీవీ ఉద్యోగుల దీనస్థితిని కళ్ళకు కట్టింది. విధి నిర్వహణలో ఉంటూ మరణించినా, వారి కుటుంబాలకు సరైన పరిహారం గానీ, ఆదుకునే భరోసా గానీ లేని పరిస్థితి నెలకొంది. పర్మినెంట్ ఉద్యోగులకు ఉండే బీమా, గ్రాట్యుటీ, పెన్షన్ వంటి సౌకర్యాలు లేకపోవడంతో బాధిత కుటుంబాలు వీధిన పడుతున్నాయి. అందుకే తమను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సౌకర్యాలు కల్పించాలని కేజీబీవీ ఉద్యోగ సంఘాలు, ఇతర ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి తమ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతున్నాయి.
Also Read: PhonePe Fake Links: సంక్రాంతి కానుక.. ఉచితంగా రూ.5 వేలు.. ఇలాంటి లింక్ కనిపిస్తే జాగ్రత్త!
ఉద్యోగ భద్రత కల్పించాల్సిందే..
అర్ధాంతరంగా మరణించిన కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని టీఎస్ యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రెండు దశాబ్దాలుగా నామమాత్రపు వేతనాలతో కేజీబీవీల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసులను రెగ్యులరైజ్ చేసి, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, వెంకట్ ప్రభుత్వాన్ని కోరారు. మరణం ఒకటే అయినా, రెగ్యులర్ ఉద్యోగులకు మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు అందే మరణానంతర ప్రయోజనాల్లో తీవ్రమైన వ్యత్యాసం ఉండటంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. కేజీబీవీల్లో పనిచేసే వారికి నెలవారీ వేతనం మినహా ఎలాంటి అదనపు ప్రయోజనాలు లేవని, అనారోగ్యం పాలైనా లేదా మరణించినా కనీస పరిహారం అందడం లేదని అసహనం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన స్పెషల్ ఆఫీసర్ కల్పన కుటుంబం కడు పేదరికంలో ఉందని, ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరారు. ముఖ్యంగా కల్పన పిల్లల చదువులకు ఆటంకం కలగకుండా చూడాలని, మరణించిన ఉద్యోగి కుటుంబానికి కనీసం రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు బాధిత కుటుంబంలో అర్హులైన ఒకరికి కారుణ్య నియామకం కల్పించి ఆదుకోవాలని యూటీఎఫ్ నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Also Read: Noida Tragedy: ‘నాకు చనిపోవాలని లేదు.. ప్లీజ్ రక్షించండి నాన్న’.. టెక్కీ ఆఖరి మాటలు!

