District Reorganization: జిల్లాలను రద్దు చేయడమే ఈ ప్రభుత్వానికి పనా?
మంత్రులకు దమ్ముంటే అశోక్ నగర్ లైబ్రరీకి రావాలి
పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తెచ్చి మాట్లాడండి
శిలాఫలకాలు వేయడం తప్ప ఈ ప్రభుత్వానికి ఏమీ చేతకాదు: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపణలు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: జిల్లాలను రద్దు చేయడమే (District Reorganization) ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పనా? అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో (Telangana Bhavan) ఆదివారం నాడు మాజీ మంత్రి లక్ష్మారెడ్డితో (Laxma Reddy) కలిసి మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు వచ్చినప్పుడే సీఎంకు పథకాలు గుర్తుకొస్తాయని ఆరోపించారు. మునిసిపల్ ఎన్నికల్లో మళ్లీ చీరల పంపిణీ గురించి సీఎం మాట్లాడుతున్నారని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు అనుకూలంగా రాకపోయేసరికి బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, బీజేపీ ఒక్కటి అవుతున్నాయని ఆరోపించారు. కేసీఆర్ పాలనలోనే పాలమూరులో పరిస్థితి మారిందని నీళ్లు కరెంటు వచ్చిందన్నారు. ఈ ప్రభుత్వానికి శిలాఫలకాలు వేయడం తప్ప ఏమీ చేతకాదని ఆరోపించారు.
Read Also- CM Revanth Politics: ఎన్టీఆర్, చంద్రబాబు ఫ్యాన్స్‌కు సీఎం రేవంత్ అనూహ్య పిలుపు.. ఇక తిరుగుండదా?
కల్వకుర్తి నెట్టెంపాడు బీమా కింద 6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది కేసీఆర్ కాదా? అని శ్రీనివాస గౌడ్ ప్రశ్నించారు. కేసీఆర్ తెచ్చిన పంపులు కట్టిన కాలువలు కనిపించడం లేదా అని నిలదీశారు. మహబూబ్‌నగర్‌కు మెడికల్ కాలేజీ ఇచ్చింది కేసీఆర్ అని పేర్కొన్నారు. హరీష్ రావు, కేటీఆర్‌లను విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. ‘‘మేము ప్రశ్నిస్తుండడంతోనే పాలమూరు రంగారెడ్డికి జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్స్‌కు మారింది. జూరాలలో నీళ్లు ఉంటే క్రాప్ హాలిడే ఎందుకు ప్రకటించారో చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా గురించి మాట్లాడారని, మరి పదేళ్లలో ఎందుకు సాధించలేదని నిలదీశారు. ఇప్పటికైనా జాతీయ హోదా తెచ్చి అప్పుడు మాట్లాడాలని బీజేపీ నేతలకు సూచించారు. మంత్రులకు దమ్ముంటే అశోక్ నగర్ లైబ్రరిని సందర్శించగలరా? అని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ప్రపంచంలోనే పెద్దవైన మోటర్లు తెచ్చిందే కేసీఆర్ కాదా అన్నారు. కెసిఆర్ తెచ్చిన ప్రాజెక్టులను పక్కన పెట్టడమే కాంగ్రెస్ నేతల పనా?.. అని నిలదీశారు. మున్సిపల్ ఎన్నికల్లో వీఆర్‌ఎస్‌ను గెలిపించుకుంటేనే ఈ ప్రభుత్వానికి నిజాలు అర్థమవుతాయని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

