Jagga Reddy: అదృష్టం కలిసి రాలేదు, కానీ, ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే కచ్చితంగా మంత్రి అయ్యి ఉండేవారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి (Jagga Reddy). సంగారెడ్డి రాజకీయాల్లో (Sangareddy Politics) తలపండిన ఆయన గత ఎన్నికల్లో ఓటమిని ఆయన ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. సొంత నియోజకవర్గంలో పరాజయం పాలవ్వడంపై తన బాధను దాదాపు అన్ని వేదికలపైనా వెళ్లబోసుకుంటున్నారు. ఇదే కోవలో తాజాగా మరో షాకింగ్ ప్రకటన చేశారు. ‘స్వయానా రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసినా నన్ను గెలిపించలేదు.. ఇకపై సంగారెడ్డి నుంచి నేను పోటీ చేయను’’ అంటూ ఆయన భావోద్వేగపూరిత శపథం చేశారు. తన భార్య పోటీ చేసినా నియోజకవర్గంలో పోటీ చేయబోనని అంటున్నారు. జీవితంలో ఈ ఓటమి మరిచిపోలేనిదని, ఓటమికి కారణం పేద ప్రజలు కాదన్నారు. సంగారెడ్డిలోని మేధావులు, పెద్దలే ఇందుకు కారణమని తప్పుబట్టారు. అయితే, అసలు పోటీ చేయబోనంటూ శపథం చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Read Also- AR Rahman: ముస్లిం అయిన మీరు ‘రామాయణ’కు ఎందుకు వర్క్ చేస్తున్నారని అడిగితే..
వారసత్వ రాజకీయానికి సంకేతం?
తాను పోటీ చేయబోనంటూ జగ్గారెడ్డి శపథం చేశారు. కానీ, తన భార్య నిర్మలా రెడ్డి పోటీ చేసినా ప్రచారం చేయబోనని అన్నారు. అంతేకానీ, ఆ నియోజకవర్గాన్ని తన కుటుంబం వదిలేస్తుందని మాత్రం ఆయన చెప్పడం లేదు. దీంతో, తాను ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండి, తన కుటుంబ సభ్యులను రంగంలోకి దించి, తద్వారా నియోజకవర్గంపై పట్టు కోల్పోకుండా చూసుకోవాలని వ్యూహం పన్నుతున్నారా? అని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. భార్యను అసెంబ్లీ నియోజకవర్గానికి పరిమితం చేసి, ఎంపీగా ఏమైనా పోటీ చేస్తారా?, లేక, తన పలుకుబడి ఉపయోగించి రాష్ట్రంలోని మరే నియోజకవర్గం నుంచైనా రంగంలోకి దిగుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.
సంగారెడ్డితో ప్రజలతో అనుబంధం
జగ్గారెడ్డి తనను తాను కేవలం ఒక నాయకుడిగా కంటే సంగారెడ్డి బిడ్డనని చెప్పుకుంటుంటారు. ఇలా చెప్పుకోవడం రాజకీయ ఎత్తుగడే కావచ్చు. కానీ, సుదీర్ఘంగా అక్కడి రాజకీయాల్లో ఉండడంతో అక్కడి ప్రజలతో ఆయనకు అనుబంధం ఉంది. అలాంటి తనను రాహుల్ గాంధీ వచ్చి విజ్ఞప్తి చేసినా ప్రజలు గెలిపించలేదనేది ఆయన ఆవేదనగా కనిపిస్తోంది. అయితే, వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనాలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా?, లేక, నిజంగా సంగారెడ్డి ప్రజలకు దూరమవుతారా? అనేది తదుపరి అసెంబ్లీల్లోనే క్లారిటీ రానుంది.

