CM Revanth Reddy: యువతను ప్రపంచంతో పోటీ పడేల
CM Revanth Reddy ( image credit: twitter)
Telangana News

CM Revanth Reddy: యువతను ప్రపంచంతో పోటీ పడేల తీర్చి దిద్దుతాం.. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి!

CM Revanth Reddy: రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా ప్రపంచంతో పోటీ పడే విధంగా యువతను తీర్చిదిద్దే కార్యక్రమాలను చేపడుతామని వెల్లడించారు. కొలువుల పండుగలో భాగంగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 25 శాఖలకు సంబంధించిన గ్రూప్ 3లో ఎంపికైన 1,370 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను లాంఛనంగా అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కొత్తగా ఎంపికైన ఉద్యోగులు రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. “పరిపాలనలో ప్రక్షాళన జరగాలంటే సంపూర్ణంగా సహకరించాలి. కొత్తగా చేరిన వారంతా చిత్తశుద్ధితో పని చేయాలి. దేశంలోనే అత్యధికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎదగాలంటే మీరంతా కష్టపడాలి. తలవంచకుండా, 30 నుంచి 35 సంవత్సరాల పాటు తెలంగాణ కోసం తల ఎత్తుకుని పని చేశానని గర్వంగా చెప్పుకునేలా పని చేయాలి” అని చెప్పారు.

యజ్ఞంలా గ్రూప్ 1, 2, 3, 4 నియామకాలు

ఉద్యోగం ఒక భావోద్వేగమని, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తుందన్నారు. తద్వారా తెలంగాణను ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దగలమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఉద్యోగ నియామకాలు జరుగుతాయని ప్రజలు భావించారన్నారు. అయితే, 2014 నుంచి 2024 వరకు ఉద్యోగ నియామకాలు జరగలేదన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో 14 సంవత్సరాల పాటు గ్రూప్ 1 నియామకాలు కూడా చేపట్టలేదన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసి దేశంలోనే గొప్ప ఘనత సాధించామని, గడిచిన రెండేళ్లలో 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేశామన్నారు. గ్రూప్ 1, 2, 3, 4 నియామకాలను ఒక యజ్ఞంలా భావించి చేపట్టామని వివరించారు.

 Also Read: CM Revanth Reddy: అభివృద్ధి బాటలో ముఖ్యమంత్రి.. వరుస పర్యటనలతో బిజీ బిజీ!

పేదలకు నాణ్యమైన విద్య అందాలి

ప్రస్తుత పరిస్థితుల్లో విద్య అన్ని ప్రాంతాలకు వ్యాపించినప్పటికీ నాణ్యమైన విద్య అందడం లేదని సీఎం అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 16.5 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే, 11 వేల ప్రైవేట్ పాఠశాలల్లో 33 లక్షల మంది విద్యను అభ్యసిస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1.20 లక్షల మంది అర్హత కలిగిన ఉపాధ్యాయులు పని చేస్తున్నప్పటికీ ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందో అందరూ ఆలోచించాలని చెప్పారు. కారణాలను మనమే విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన విద్యను అందించాల్సిన గురుతరమైన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉన్నదని తెలిపారు. నాణ్యమైన విద్య, అవసరమైన నైపుణ్యాలు లేకపోవడం వల్ల అంతర్జాతీయ అవకాశాలు ఉన్నప్పటికీ వాటిని అందిపుచ్చుకోలేని పరిస్థితి ఏర్పడుతున్నదన్నారు. గతంలో మాదిరిగా పేదలకు ఇవ్వడానికి ప్రభుత్వానికి భూములు లేవన్నారు. నాణ్యమైన విద్యను అందించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.

విద్యతోనే మార్పు

జీవితంలో మార్పు తీసుకొచ్చేది విద్య ఒక్కటేనని, జీవితానికి గౌరవాన్ని తీసుకొస్తుందని సీఎం అన్నారు. స్వాతంత్య్రం సాధించిన వందేళ్ల నాటికి భారత్ ప్రపంచంలోనే అతి బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, తెలంగాణ 2034 నాటికి ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తున్నదని వివరించారు. ఇప్పుడు కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న వారంతా 2047 నాటికీ ప్రభుత్వ సేవల్లో కొనసాగుతారన్నారు. పేదవారు అధికారుల వద్దకు వచ్చినప్పుడు, మీ సొంత తల్లిదండ్రులు వచ్చినట్లే స్పందించాలని సూచించారు. తల్లిదండ్రులను గౌరవంగా చూసుకోని వారు ఎవరైనా ఉంటే, వారి జీతంలో 10 నుంచి 15 శాతం కోత విధించి ఆ మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మహమ్మద్ అలీ షబ్బీర్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Also Read: CM Revanth Reddy: ఆదిలాబాద్‌లో యూనివర్సిటీ, ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేస్తాం.. నిర్మల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు!

Just In

01

GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికలు ఒకే కార్పొరేషన్ కింద నిర్వహిస్తారా? లేక మూడు ముక్కలు చేసి జరుపుతారా?

Land Scam: ధరణి – భూ భారతి స్కాం.. 3.90 కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్లు!

Telangana tourism: గోల్కొండలో ప్రారంభమైన హార్ట్ హెయిర్ బెలూన్ ఫెస్టివల్.. డెస్టినేషన్ తెలంగాణ బ్రాండ్ బలోపేతమే లక్ష్యం!

Ap-TG Water Disputes: 30న నీటి పంపకాలపై కీలక భేటీ.. వాదనలు వినిపిస్తారా.. చేతులెత్తేస్తారా?

CPI And CPM alliance: పురపోరులో కామ్రేడ్లు కలుస్తారా? ఒంటరిగానే పోటీ చేస్తారా? పొత్తుపై క్లారిటీ వచ్చేనా?