తిరుమల, స్వేచ్ఛ : తిరుమల శ్రీవారి లడ్డూ (Tirumala Laddu) ప్రసాదం కల్తీ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సీబీఐ దర్యాప్తు బృందం నలుగురిని అదుపులోనికి తీసుకుంది. భోలే బాబా డెయిరీకి (రూర్కీ, ఉత్తరాఖండ్) నాడు డైరెక్టర్లుగా పనిచేసిన విపిన్ జైన్, పోమిల్ జైన్, వైష్ణవి డెయిరీ (పూనంబాక) సీఈవో అపూర్వ వినయ్ కాంత్ చావ్డా, ఏఆర్ డెయిరీ (దుండిగల్) ఎండి రాజు రాజశేఖరన్‌లను దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది.
క్రైమ్ నెంబర్ 470/24లో భాగంగా అరెస్టు చేసిన అధికారులు తిరుపతి కోర్టులో హాజరు పరిచారు. దర్యాప్తులో అక్రమాలన్నీ బట్టబయలయ్యాయి. నెయ్యి సరఫరా పేరుతో అడుగడుగునా ఉల్లంఘనలు జరిగాయని సీబీఐ గుర్తించింది. ఏఆర్ డెయిరీ పేరుతో నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్న వైష్ణవి డెయిరీ ప్రతినిధులు తెరవెనుక కథ మొత్తం నడిపించారని తేలిపోయింది. ఏఆర్ డెయిరీ పేరు ముందు పెట్టి తప్పుడు డాక్యుమెంట్లు, సీళ్లు ఉపయోగించి టెండర్ కథ నడిపినట్లుగా నిర్ధారణ అయ్యింది.
Also Read : రంగరాజన్ కు అండగా ఉంటా.. నిందితులను రేవంత్ ప్రభుత్వం శిక్షించాలి: పవన్ కల్యాణ్
అంతా డొల్ల!
రూర్కీలోని భోలే బాబా దగ్గర నుంచి నెయ్యి తెప్పించినట్లు వైష్ణవి డెయిరీలో దొంగ రికార్డులు తేలాయి. అయితే భోలే బాబా డెయిరీకి ఇంత మొత్తంలో నెయ్యి సరఫరా సామర్థ్యం లేదని విచారణలో అధికారులు తేల్చారు. సమగ్ర విచారణతో అక్రమాలను దర్యాప్తు బృందం గుర్తించింది. ఈ మూడు డెయిరీలకు చెందిన నలుగురిని పోలీసులు, దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది.
కాగా వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ (Tirumala Laddu)ల తయారీలో జంతువుల అవశేషాలను వినియోగించారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో ప్రచారం జరిగింది. కోట్లాది శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించిన ఈ ఘటనను కూటమి సర్కార్ సీరియస్‌గా తీసుకున్నది. సుప్రీంకోర్టు సీబీఐ అధికారితో కూడిన సిట్ బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో సీబీఐ అధికారి ఆధ్వర్యంలో సిట్‌ను ఏర్పాటు చేయగా, సుదీర్ఘ విచారణ చేసిన అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టడమే కాకుండా నలుగురిని అరెస్ట్ చేశారు.