Sankranti Exodus: సంక్రాంతి పర్వదినాన్ని తమ సొంత ఊళ్లలో జరుపుకునేందుకు పెద్ద ఎత్తున హైదరాబాద్ మహానగరవాసులు తరలి వెళ్లారు. దక్షిణ మధ్య రైల్వే, టీజీఆర్టీసీ ప్రత్యేకంగా రైళ్లు, బస్సులను అందుబాటులో ఉంచినా, అవి సరిపోని స్థాయిలో నగరవాసులు తమ స్వస్థలాలకు వెళ్లారు. ముఖ్యంగా నగరవాసులు పండుగ ప్రయాణాన్ని ఆసరాగా చేసుకున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు టికెట్ రేటర్లను రెండింతలకు పెంచి విక్రయించినట్లు పలువురు ప్రయాణికులు వాపోయారు. చాలా మంది నగరవాసులకు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, విజయనగరం, రాజమండ్రి, భీమవరం, నెల్లూరు, కాకినాడ, విజయవాడ, కర్నూలు తదితర ప్రాంతాలకు రైలు, బస్సు టికెట్లు అందుబాటులో లేకపోయేసరికి చివరి నిమిషంలో క్యాబ్ లను ఎంగేజ్ చేసుకుని వెళ్లాల్సి వచ్చిందని పలువురు ప్రయాణికులు వెల్లడించారు. ముఖ్యంగా గత శనివారం రెండో శనివారం సెలవు రావటంతో చాలా మంది ప్రభుత్వ, ప్రైవేటు, ఐటీ ఉద్యోగులు శుక్రవారం రాత్రే తమ స్వస్థలాలకు బయల్దేరి వెళ్లారు. ఫలితంగా టోల్ గేట్ల వద్ద వందల సంఖ్యలో వాహానాలు క్యూ కట్టి దర్శనమిచ్చాయి.
సిగ్నల్స్ వద్ద వాహానాలు
ఆదివారం నుంచి మంగళవారం రాత్రి వరకు కూడా సిటీ చుట్టున్న టోల్ గేట్ల వద్ద ఇదే పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ను అదుపు చేసేందుకు ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసులను కూడా నిమియంచారు. హైదరాబాద్(Hyderabad) మహానగరంలో విద్య, ఉద్యోగ, వ్యాపార తదితర రంగాల్లో సెటిల్ అయిన వాళ్లు ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక(Karnataka) రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలత రాష్ట్రంలోని వరంగల్(Warangal), ఖమ్మం(Khammam), మెదక్(Medak), కరీంనగర్(Karimnagr), అదిలాబాద్(Adhilabad) తదితర జిల్లాల్లకు పండుగ జరుపుకునేందుకు తరలి వెళ్లటంతో మామూలు రోజుల్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు వాహానాల రద్దీ, ట్రాఫిక్ రణగోణ ధ్వనులతో కన్పించే మెయిన్ రోడ్లన్నీ ప్రస్తుతం నిర్మానుష్యంగా మారాయి. రోడ్లు ఖాళీ గా ఉండటంతో సిగ్నల్స్ వద్ద వాహానాలు వేగంగా దూసుకెళ్తున్నాయి.
Also Read; Chiranjeevi MSG Party: వెంకీమామ ఎక్కడున్నా అదే సందడి.. చిరు పార్టీ వీడియో వైరల్!
దాదాపు కోటి 34 లక్షల జనాబా..
ముఖ్యంగా పంజాగుట్ట, లక్డీకాపూల్, కూకట్ పల్లి, దిల్ సుఖ్ నగర్, సికిందరాబాద్, కాచిగూడ, కోఠి, ఆబిడ్స్, చార్మినార్, మలక్ పేట ప్రాంతాల్లో మామూలు రోజుల్లో సిగ్నల్స్ వద్ద వాహానాలు క్యూ కట్టి కన్పించేవి. కానీ సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు సగం సిటీ ఖాళీ కావటంతో మెయిన్ రోడ్లతో పాటు సబ్ రోడ్లపై కూడా వాహానాల రాకపోకలు పలుచబడ్డాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఇటీవలే సంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి సేకరించిన లెక్కల ప్రకారం విలీన పట్టణ స్థానిక సంస్థలతో కలుపుకుని దాదాపు కోటి 34 లక్షల జనాభా ఉంది. సంక్రాంతి పండుకు ఈ జనాభాలో దాదాపు ముప్పై శాతం తమ సొంత ఊళ్లకు తరలి వెళ్లినట్లు సమాచారం. ముఖ్యంగా సొంత ఊళ్లలో గ్రామీణ వాతావరణంలో పండుగ జరుపుకునేందుకు వెళ్లగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి వంటి ప్రాంతాలకు చాలా మంది సంక్రాంతి పండుగ సందర్భంగా మరో సెంటిమెంట్ తో వెళ్లాల్సి వచ్చిందని చెబుతున్నారు.
పర్యాటకుల్లేక వెలవెల
ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పెద్దలకు బియ్యం ఇచ్చే సాంప్రదాయం ఉండటంతో చాలా మంది రాజమండ్రి వాసులు తమ స్వస్థలాలకు చేరుకున్నారు. బుధవారం భోగీ, గురువారం మకర సంక్రాంతి, శుక్రవారం కనుమ పండుగలను జరుపుకోనున్నారు. శనివారం కూడా చాలా మంది స్వస్థలాల్లోనే గడిపి, ఆదివారం సాయంత్రం బయల్దేరి సిటీకి వచ్చేలా పండుగ టూర్ ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య బాగా తగ్గటంతో మెయిన్ రోడ్లకిరువైపులా ఉన్న ప్రాంతాలు సైతం వెలవెలబోయాయి. ముఖ్యంగా గోల్కొండ, చార్మినార్, సెవెన్ టూంబ్స్ వంటి చారిత్రక కట్టడాలతో పాటు ఎక్కువగా పర్యాటకులు వచ్చే బిర్లా మందిర్, ట్యాంక్ బండ్ ప్రాంతాలు కూడా పర్యాటకుల్లేక వెలవెలబోతున్నాయి. వాహానాల సంఖ్య తగ్గటంతో కాలుష్యం కూడా తగ్గుముఖం పడుతుందని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

