Human Rights Commission: నిషేధం ఉన్నా విచ్చలవిడిగా జరుగుతున్న చైనా మాంజా అమ్మకాలపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. ఫిబ్రవరి 26వ తేదీలోపు దీనిపై సమగ్ర నివేదికను అంద చేయాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్ కు ఆదేశాలు జారీ చేసింది. సంక్రాంతి పండుగ సమీపించిన నేపథ్యంలో వేలాది మంది హుషారుగా గాలిపటాలు ఎగుర వేస్తున్న విషయం తెలిసిందే. అయితే, వీరిలో చాలామంది నిషేధంలో ఉన్న చైనా మాంజాను వాడుతున్నారు.
పాదచారులు తీవ్ర గాయాలు
ఇది దారిన వెళుతున్నవారి గొంతులకు చుట్టుకు పోతుండటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర గాయాల పాలవుతున్నారు. దీనిపై న్యాయవాది ఇమ్మనేని రామారావు హక్కుల కమిషన్ లో పిటిషన్ వేశారు. నైలాన్ దారంతో గాజుపొడి, మెటల్ కోటింగ్ తో ఈ మాంజాను తయారు చేస్తున్నట్టు తెలిపారు. దీంతో పలువురు చైనా మాంజా బారిన పడి తీవ్రంగా గాయపడుతున్నట్టు పేర్కొన్నారు. కీసరలో జస్వంత్ రెడ్డి అనే బాలుడు, షంషీర్ గంజ్ లో జమీల్ అనే వ్యక్తి చైనా మాంజా మెడకు చుట్టుకు పోవటంతో తీవ్ర గాయాల పాలయ్యారన్నారు. జమీల్ కు గొంతుపై 22 కుట్లు వేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ ఇద్దరే కాక మరింత మంది చైనా మాంజా బాధితులు ఉన్నట్టు పేర్కొన్నారు. చైనా మాంజాపై పూర్తి స్థాయిలో నిషేధం అమలయ్యేలా చూడాలని కోరారు.
Also Read: Sandhya Theatre Stampede: సంధ్య థియేటర్ పై మానవ హక్కుల కమిషన్ సీరియస్
సమగ్ర నివేదిక ఇవ్వాలి
ఈ కామర్స్ వెబ్ సైట్ల ద్వారా దీని క్రయవిక్రయాలను నిరోధించేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన మానవ హక్కుల కమిషన్ నిషేధం ఉన్నా చైనా మాంజా అమ్మకాలు జరుగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కమిషనర్ సజ్జనార్ కు ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఇటీవల పోలీసులు వేర్వేరు చోట్ల విస్తృతస్థాయిలో దాడులు నిర్వహించి కోటిన్నర రూపాయలకు పైగా విలువ చేసే చైనా మాంజాను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాదాపు 150మందిపై కేసులు కూడా నమోదు చేశారు.
Also Read: Khammam District: ఖమ్మం జిల్లా సర్వేకి మానవ హక్కుల కమిషన్ నోటీసులు

