MLA Yennam Srinivas Reddy: మహబూబ్‌నగర్‌లో నిన్న జరిగిన కేటీఆర్ (KTR) మీటింగ్ అభివృద్ధిపై చర్చించేందుకు కాదు, పాలమూరు ప్రజల జ్ఞాపకశక్తిని తక్కువ చేసి మాట్లాడేందుకు, వారి సహనాన్ని పరీక్షించేందుకు జరిగిన సభగా మారిందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహబూబ్‌నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలిసి కొన్ని, తెలియక కొన్ని, రాసిచ్చినవి కొన్ని కేటిఆర్ మాట్లాడి వెళ్లడమే కాదు, ప్రజలను మళ్లీ మభ్యపెట్టే ప్రయత్నం బహిరంగంగానే జరిగిందని ఆయన ఆరోపించారు. మహబూబ్‌నగర్ ప్రజలు కేసీఆర్, కేటీఆర్‌లను మాత్రమే కాదు, మొత్తం కల్వకుంట్ల కుటుంబాన్ని పాలమూరు ద్రోహులుగానే చూస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. మీ పదేళ్ల పాలన పై విసుగు చెంది ప్రజలు ప్రజా ప్రభుత్వానికి పట్టంకట్టారని అన్నారు.
కేసీఆర్ మళ్లీ ఉపన్యాసాలు ఇవ్వడం సిగ్గుచేటు
మహబూబ్‌నగర్ అంటే ఓటు బ్యాంక్ మాత్రమే, అవసరం తీరిన తర్వాత విస్మరించాల్సిన ప్రాంతం అన్న భావనతోనే బీఆర్ఎస్ నాయకులు పాలన చేశారని తీవ్రంగా విమర్శించారు. పాలమూరు ప్రాంతం వలసలకు చిరునామాగా మారిందని, పేదరికం, నిరుద్యోగం, విద్యలో వెనుకబాటుతనం ఈ ప్రాంతాన్ని పట్టిపీడించాయని “పాలమూరు” పేరును పదే పదే వందలసార్లు నోట్లో నానబెట్టి, చివరకు ఆ పేరునే ముంచేశారని మండిపడ్డారు. ఇది నిర్లక్ష్యం కాదు, అనుకోని తప్పు కాదు – పూర్తిగా తెలిసే చేసిన తీరని ద్రోహమని స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ లో 2009లో టీఆర్ఎస్ పార్టీకి 10 శాతం కూడా ఓటింగ్ లేని పరిస్థితిలో తెలంగాణ ఉద్యమం నిలబడాలనే ఏకైక ఉద్దేశంతో కేసీఆర్‌ను మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా గెలిపించామని గుర్తు చేశారు. కానీ అదే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మహబూబ్‌నగర్‌ను పూర్తిగా పక్కన పెట్టి, నిధులు ఇవ్వకుండా, అభివృద్ధి అంచులకు కూడా రానివ్వకుండా రాజకీయంగా శిక్షించారని ఆరోపించారు. రాజకీయ బిక్ష పెట్టిన మహబూబ్‌నగర్‌ను అభివృద్ధికి ఆమడదూరంలో ఉంచి, ఈరోజు మళ్లీ ఉపన్యాసాలు ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు.
ఒక్క రోజైనా కేసిఆర్ తో మాట్లాడినారా?
మహబూబ్‌నగర్ గురించి మాట్లాడే నైతిక అర్హత కేసీఆర్‌కు, కేటీఆర్‌కు లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. జూరాల పై నుంచి వచ్చే నీటిని తన కాలు అడ్డం పెట్టి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ను సస్యశ్యామలం చేస్తానని మాయమాటలు చెప్పి, వాస్తవంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును శ్రీశైలానికి తరలించింది ఎవరో చెప్పాలని ప్రశ్నించారు. కృష్ణా జలాలను జగన్ మోహన్ రెడ్డికి కట్టబెట్టిన అంశాన్ని అసెంబ్లీలో ప్రశ్నిస్తే, సమాధానం చెప్పేందుకు ఒక్కరైనా ముందుకు రాకపోవడం వాళ్ల పాలనకు తుది సర్టిఫికెట్ అని అన్నారు. జూరాల దగ్గర ఉన్న పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఎందుకు శ్రీశైలానికి తీసుకుపోతున్నావని అడిగిన దాఖలాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. అది అంతర్ రాష్ట్ర ట్రిబ్యునల్ పరిధిలోకి పోతుంది, జలవివాదాలకు దారితీస్తుంది, పర్యావరణ అనుమతులు రావు అని చెప్ఫి ఒక్క రోజైనా కేసిఆర్ తో మాట్లాడినారా? ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక్కరైనా కేసీఆర్‌ను ప్రశ్నించారా అని ఎదురు ప్రశ్నించారు. ప్రశ్నించే దైర్యం లేక, పదవుల కోసం మౌనంగా ఉండిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్‌ను ప్రశ్నించే ధైర్యం చేయలేదు
నాడు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తాను కేటీఆర్‌ను మహబూబ్‌నగర్‌కు తీసుకొచ్చి, ఇక్కడి ప్రజల సమస్యలు, బాధలు, వాస్తవ పరిస్థితులు కళ్లకు కట్టినట్లు వివరించినదీ తానేనని చెప్పారు. జూరాల నీటిని ఒడిసి పట్టుకునే చిత్తశుద్ధి అప్పుడే ఉండి ఉంటే, వర్షాకాలంలో వృథాగా పోయే నీటితో ఉమ్మడి మహబూబ్‌నగర్ అంతా సస్యశ్యామలంగా మారేదని అన్నారు. కనీసం 70 టీఎంసీల నీరు రైతాంగానికి దక్కేదని, కానీ అప్పట్లో ఒక్క జిల్లా నాయకుడు కూడా కేసీఆర్‌ను ప్రశ్నించే ధైర్యం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లు ఎంపీగా ఉండి మహబూబ్‌నగర్‌కు ఐదు సార్లు కూడా రాని వారిని ప్రజలు లెక్కల్లో పెట్టడం లేదని ఎద్దేవా చేశారు. సిరిసిల్ల, మెదక్, గజ్వేల్‌లను తమ సొంత జిల్లాల్లా చూసి, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ను మాత్రం కావాలని మోసం చేశారని ఘాటుగా ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నారాయణపేట, మక్తల్, కొడంగల్ ఎత్తిపోతల పథకాలకు అనుమతులు మంజూరు చేసి రైతుల పట్ల ముఖ్యమంత్రి గారికి ఉన్న నిజమైన మమకారాన్ని చేతల ద్వారా చూపించామని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి కేవలం 5571 ఓట్లు వచ్చాయి
మాటలు కాదు – పనులే మా సమాధానం అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వెళ్లిన తర్వాత కేసీఆర్ రెండు సంవత్సరాల్లో అసెంబ్లీకి రెండుసార్లు మాత్రమే వచ్చారని,అప్పుడు కూడా 20 నిమిషాలు కూడా సభలో కూర్చోలేకపోయారని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యంపై వాళ్లకు ఉన్న గౌరవం ఎంత ఉందో స్పష్టంగా చూపుతోందని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా రూపురేఖలు ఇక తప్పకుండా మారబోతున్నాయని స్పష్టం చేస్తూ, పాలమూరు యూనివర్సిటీ లో లా కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల తో పాటు, ట్రిపుల్ ఐటీ వంటి కీలక విద్యాసంస్థలు ఇప్పటికే మహబూబ్‌నగర్ కు తీసుకువచ్చామని, ఇంకా మరిన్ని రాబోతున్నాయని తెలిపారు. గతంలో చేపల మార్కెట్, కూరగాయల మార్కెట్ పెట్టాలనుకున్న నగరం నడిబొడ్డున, ఇప్పుడు యువతకు ఉపాధి, భవిష్యత్తు ఇచ్చే స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు, విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్ నగర్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీకి కేవలం 5571 ఓట్లు వచ్చాయంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని ఆయన చెప్పారు.
మహబూబ్‌నగర్‌ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలు వచ్చాయని, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 50 స్థానాలకు పైగా కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడం ఖాయమని, బీఆర్ఎస్ ఐదు స్థానాలకే పరిమితం కావడం తప్పదని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు రెండు సంవత్సరాలలో రూ.2000 కోట్లతో మహబూబ్‌నగర్ అభివృద్ధి కి చేయూత ఇచ్చారని, మహబూబ్‌నగర్ ను తెలంగాణలోనే మోడల్ జిల్లాగా మార్చే డ్రీమ్ ప్రాజెక్ట్‌ను చేపడుతున్నారని, హైదరాబాద్, వరంగల్ తర్వాత అంతగొప్ప మహానగరంగా మహబూబ్‌నగర్‌ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మహబూబ్‌నగర్ ప్రజలు ఇక మాటలు నమ్మరని, చేస్తున్న అభివృద్ధినే నమ్ముతారని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారే పల్లి సురేందర్ రెడ్డి, సిజే బెనహార్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
Also Read: MLA Yennam Srinivas Reddy: కవితపై ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

