Macha Bollaram: మచ్చ బొల్లారంలో రైల్వే అండర్ బ్రిడ్జ్(Railway underbridge) పనుల శంకుస్థాపన కార్యక్రమం ఉద్రిక్తతగా మారింది. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్(MP Etela Rajender), మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Marri Rajasekhar Reddy)ల మధ్య స్టేజ్‌పైనే ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘటనతో అక్కడున్న బీజేపీ(BJP), బీఆర్‌ఎస్(BRS) నాయకులు ఒక్కసారిగా రెండు వర్గాలుగా విడిపోయి వాగ్వాదాలకు దిగారు.
పరస్పరం ఆరోపణలు
రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులకు సంబంధించిన నిధులను తామే తీసుకువచ్చామని ఇరు పార్టీల నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలో నినాదాలు, తోపులాట చోటుచేసుకోవడంతో కార్యక్రమ ప్రాంగణం ఒక్కసారిగా గందరగోళంగా మారింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను తమ కృషిగా ప్రచారం చేస్తూ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Marri Rajasekhar Reddy) పేరు మీద బ్యానర్లు ఏర్పాటు చేయడం వల్లే వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. పరిస్థితి చేయి దాటుతుండటంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాల నాయకులను చెదరగొట్టి ఘర్షణను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనతో శంకుస్థాపన కార్యక్రమం కొద్దిసేపు నిలిచిపోయింది.

