GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికలపై అధికారులు ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, మరో ఆరు కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఎలక్షన్ కమిషనర్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 16న ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించిన ఓటర్ల తుది జాబితాలు విడుదల కానున్నాయి. ఆ తర్వాత 45 రోజుల్లో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనున్నది. ఆ తర్వాత జీహెచ్ఎంసీకి ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీలో ప్రస్తుత పాలక మండలి అధికార గడువు వచ్చే నెల10వ తేదీన పూర్తి కానున్నందున, ఆ తర్వాతే జీహెచ్ఎంసీలో స్పెషల్ ఆఫీసర్ పాలనతో పాటు ప్రస్తుత జీహెచ్ఎంసీ పరిధిని మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై సర్కార్ నుంచి క్లారిటీ రానుంది.
కేంద్ర ప్రభుత్వ నిధులు
పెరిగిన విస్తరణతో జీహెచ్ఎంసీని సింగిల్ కార్పొరేషన్‌గా కొనసాగించేందుకు సర్కార్ విముఖంగా ఉన్నట్లు తెలిసింది. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో నిధులను సమకూర్చేందుకు కార్పొరేషన్‌కు సింగిల్‌గా గానీ, మూడు కార్పొరేషన్లుగా ఎన్నికలు నిర్వహించిన పాలక మండలిని అందుబాటులోకి తెస్తేనే జీహెచ్ఎంసీకి కేంద్ర ప్రభుత్వ నిధులు వచ్చే అవకాశం ఉన్నందున సర్కార్ ఈ దిశగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. మూడు కార్పొరేషన్లుగా చేసి, జోన్లకు పూర్తి స్థాయి అధికారాలను కట్టబెడితే విలీన ప్రాంతాల అభివృద్ది కూడా సులువు అవుతుందని సర్కార్ భావించి, ఎన్నికలకు కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Also Read: Manchu Manoj: రాకింగ్ స్టార్ ప్రారంభించిన సంక్రాంతి పండుగ సంబరాల క్యాంపెయిన్ వివరాలివే..
ఎన్నికలకు అంతర్గతంగా ఏర్పాట్లు
పెరిగిన జీహెచ్ఎంసీ పరిధిని మూడు కార్పొరేషన్లుగా విభజించి ఎన్నికలు నిర్వహించాలా? లేక 300 వార్డులతో ఒకే కార్పొరేషన్‌గా ఎన్నికలు నిర్వహించాలా? అన్న విషయంపై వచ్చే నెల 10వ తేదీ తర్వాత సర్కార్ నుంచి క్లారిటీ రానున్నది. అయితే అధికారులు మాత్రం సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకున్న ఎన్నికల నిర్వహణకు అంతర్గతంగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే పెరిగిన జీహెచ్ఎంసీ పరిధి, వార్డులు, జోన్లు, సర్కిళ్ల ప్రాతిపదికన మూడు కార్పొరేషన్లుగా విభజించే ప్రక్రియలో భాగంగా జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాల నుంచి సమాచారం తెప్పించుకుని, దాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించి, సిద్దం చేసినట్లు సమాచారం. గత నెల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కావల్సిన ఏర్పాట్ల తరహాలో అంతర్గతంగా జీహెచ్ఎంసీ అధికారులు వార్డుల రిజర్వేషన్లను కూడా ఖరారు చేసి ముసాయిదాను సిద్దం చేసుకున్నట్లు తెలిసింది.
మే మాసం చివరి కల్లా..
మూడు కార్పొరేషన్ల వారీగా మొత్తం 300 వార్డుల రిజర్వేషన్ల ముసాయిదాను సిద్దం చేసినట్లు తెలిసింది. ఫిబ్రవరి 10వ తేదీన ప్రస్తుత పాలక మండలి గడువు ముగిసిన వెంటనే ఆరు నెలల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న నిబంధన ఉండటంతో సర్కారు జీహెచ్ఎంసీ(GHMC) ఎన్నికలను నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. వచ్చే మే మాసం చివరి కల్లా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి గడువు కూడా ముగియనున్నందున, జీహెచ్ఎంసీ, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకు కలిపి ఒకే సారి ఎన్నికలు నిర్వహిస్తారా? లేక అంతకు ముందే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తారా? అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏదిఏమైనా జీహెచ్ఎంసీ పునర్ వ్యవస్థీకరణ, మూడు కార్పొరేషన్ల విభజన, ఎన్నికల నిర్వహణ అంశాలకు సంబంధించి వచ్చే నెల 10వ తేదీ తర్వాత సర్కార్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
Also Read: Nenu Ready Teaser: 30 వేల జీతానికి ఇలాంటి దరిద్రపుగొట్టు జాబ్ ఎవడైనా చేస్తాడా?

