Maternity Kit: రాష్ట్రంలో గర్భిణీ స్త్రీలకు మళ్లీ కిట్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మేరకు కిట్ల పంపిణీపై స్టడీ చేసి ప్రత్యేక రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వం వైద్యారోగ్యశాఖను కోరినట్లు తెలిసింది. కొంత మంది ఎమ్మెల్యేల రిక్వెస్ట్‌ల మేరకు ప్రభుత్వం కిట్ల పంపిణీని పునఃప్రారంభించాలని ఆలోచిస్తున్నది. దీని వలన ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో మంచి మైలేజ్ వస్తుందని ఎమ్మెల్యేలు వివరిస్తున్నారు. వాస్తవానికి తెలంగాణలో మాతా శిశు సంరక్షణే ధ్యేయంగా గత ప్రభుత్వంలోనే కిట్ల పంపిణీ జరిగింది. ఈ కిట్ల పంపిణీలో కొన్ని అవకతవకలు జరిగాయనే అనుమానంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఈ కిట్ల పంపిణీని నిలిపివేసింది. కొంత కాలం వరకు కిట్ల పంపిణీపై ప్రజల నుంచి ఎలాంటి ఒత్తిడి రాకపోయినా.. ఇప్పుడు ఎమ్మెల్యేల ప్రతిపాదనలతో మళ్లీ ఊపందుకుంటున్నది. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల నుంచి వస్తున్న విజ్ఞప్తులు, ప్రజల్లో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, కొత్త పేరుతో ఈ పథకాన్ని పునరుద్ధరించేందుకు సర్కార్ తర్జనభర్జన పడుతున్నది. గతంలో ఈ కిట్లను కేసీఆర్ పేరుతో పంపిణీ చేశారు. ఈ ప్రభుత్వంలో ఆ పేరును ఇప్పటికే తొలగించారు.
6.50 లక్షల మందికి…?
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 6.5 లక్షల నుంచి 6.8 లక్షల మంది మహిళలకు డెలివరీలు జరుగుతున్నాయి. వీరిలో ఈ కిట్లు పంపిణీ చేయక ముందు ప్రభుత్వాసుపత్రుల్లో కేవలం 30 శాతం మంది మాత్రమే డెలివరీలు చేయించుకున్నారు. కానీ, కిట్ల పంపిణీ తర్వాత ఏకంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు సంఖ్య 60 నుంచి 65 శాతానికి పెరిగాయి. అంటే సుమారు రెండున్నర నుంచి మూడు లక్షల మంది గర్భిణీలు ప్రభుత్వాసుపత్రుల్లో డెలివరీలు చేయించుకున్నారు. వీరందరికీ ప్రభుత్వం కిట్లను అందచేసింది. ఇవి గర్భిణీలకు ఉపయోగకరంగా మారడంతో పాటు ప్రభుత్వంపై ప్రజల్లోనూ మంచి మైలేజ్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే మళ్లీ కిట్లు అందచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రాథమికంగా చర్చ జరిగినట్లు తెలిసింది.
Also Read: Chaitanya Sobhita: సిబ్బందితో కలిసి సంక్రాంతి చేసుకున్న నాగచైతన్య దంపతులు.. ఫోటోలు వైరల్..
2017లో తెరమీదకు కిట్..
రాష్ట్రంలో గర్భిణీలకు కిట్లు ఇచ్చే విధానం 2017లో ప్రారంభమైంది. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి పేరుతో ఈ కిట్లను అందజేశారు. దీంతో ఈ ప్రభుత్వ కూడా తమ పార్టీకి చెందిన ముఖ్య లీడర్ ఒకరి పేరును కలిపి పంపిణీ చేయాలనే ప్రతిపాదనలు ఎమ్మెల్యేల నుంచి వచ్చింది. డెలివరీ తర్వాత ఇచ్చే ఈ కిట్‌లో శిశువుకు అవసరమైన సబ్బులు, నూనె, పౌడర్, మస్కిటో నెట్, దుస్తులతో పాటు చేతి బ్యాగు వంటి 16 రకాల వస్తువులు ఉండేవి. ఇక కిట్‌తో పాటు మగబిడ్డ పుడితే రూ.12 వేలు, ఆడబిడ్డ పుడితే రూ.13 వేలను డీబీటీ రూపంలో నగదును అందించారు. దీనివల్ల ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెరగడమే కాకుండా, శిశు మరణాల రేటు, మాతృ మరణాల రేటు గణనీయంగా తగ్గాయని కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు గతంలోనే స్పష్టం చేశాయి. ఈ కిట్‌కు అదనంగా గత ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్లనూ అందజేసింది. ఈ కిట్‌లో ఖర్జూరం, నెయ్యి, ఐరస్ సిరప్‌తో పాటు గర్భిణీ స్త్రీ ఇమ్యూనిటీ పెరిగేందుకు అవసరమైన ఆహార పదార్ధాలు ఇచ్చారు. ఈ న్యూట్రిషన్ కిట్‌పై ప్రస్తుతానికి ప్రభుత్వం చర్చ జరగక పోయినప్పటికీ, దీన్ని కూడా ఇస్తే బాగుంటుందనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్నది.
Also Read: BJP Telangana: మున్సిపల్ ఎన్నికల పోరుకు బీజేపీ ఒంటరి పోరు.. ఎందుకంటే..?

