Water Sharing Issue: పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్‌పై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్ వెనక్కి తీసుకోవడంతో కేసును డిస్పోజ్ ఆఫ్ చేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. అంతర్రాష్ట్ర జల వివాదాలకు రెడ్ ఫిజికల్ సరైన మార్గం కాదని పేర్కొంటూ ప్రాజెక్టుకు సంబంధించి తమ వాదనలు, అభ్యంతరాలను వినిపించాలంటే ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ దాఖలు చేయాలని సూచించింది. అయితే, ఈ సివిల్ సూట్ వేస్తే ఇక ప్రాజెక్టుపై వాదనలు ఏళ్ల తరబడి కొనసాగే అవకాశం ఉంటుంది. దానివల్ల నీటి జలాల వాటాలపై సమస్యలు పరిష్కారం కావు.
ఏళ్ల తరబడి విచారణ జరిగే అవకాశం
గోదావరి జలాలపై ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఒకటే సుప్రీంకోర్టుకు వెళ్లింది. నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుతో ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుపోయేందుకు చూస్తున్నదని, దీనిని ఆపాలని కోరింది. అయితే, సివిల్ సూట్ వేయాలని కోర్టు సూచించడంతో కర్ణాటక, మహారాష్ట్రతోపాటు ఏపీని కూడా ఈ కేసులో ఇంప్లీడ్ చేయనున్నారు. దీంతో ఈ జల వివాదం అంతర్రాష్ట్ర వివాదంగా మారనున్నది. నాలుగు రాష్ట్రాల అభ్యంతరాలను నీటి వాటాలపై సైతం కోర్టు వాదనలు విననున్నది. ఒక్కో రాష్ట్రం అభ్యంతరాలు తీసుకొని పరిశీలించేసరికి ఏళ్ల తరబడి అవుతుందని సమస్య పరిష్కారం కాదని, ఈ లోగా ఏపీ నిర్మించ తలపెట్టిన నల్లమల ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని నీటిపారుదల రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ ప్రాజెక్టుని నిలవరించాలంటే తెలంగాణలోని ప్రాజెక్టులను పూర్తి చేయడమే ఉత్తమమని పలువురు పేర్కొంటున్నారు.
ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబు దూకుడు
ఇప్పటికే ఏపీ ప్రభుత్వం గోదావరి జలాలపై భిన్న వాదనలు వినిపిస్తున్నది. తాము సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటామని తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డు చెప్పబోమని అక్కడి సీఎం చంద్రబాబు పలు సమావేశాల్లో పేర్కొంటున్నారు. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని అంటూనే, పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ పూర్తికి త్వరితగతిన చర్యలు చేపడుతున్నారు. నిత్యం సమీక్షలతో పాటు కేంద్ర మంత్రులను కలిసి ప్రాజెక్టులు ముందుకు పోయేలా ప్రణాళికతో సాగుతున్నారు. అంతేకాదు, తెలంగాణ వాదనలు తప్పని తమ ప్రాజెక్టులకు అడ్డు పడవద్దని, ఇరు రాష్ట్ర ప్రజలు బాగుండాలని తాము కోరుకుంటున్నామని ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు ద్వంద్వ వైఖరితో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణకు కృష్ణ, గోదావరి జలాల్లో రావలసిన వాటాను సాధించే వరకు విశ్రమించబోమని, ప్రతి నీటి చుక్క సాధిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంటున్నది. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని, క్రిమినల్‌లో కొట్లాడుతామని స్పష్టం చేస్తున్నది. రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నంత మాత్రాన ఏపీ ప్రభుత్వానికి మేలు చేసినట్లు కాదని, సివిల్ సూట్‌తో నల్లమల సాగర్ ప్రాజెక్టును అడ్డుకుంటామని అంటున్నది. పోలవరం ప్రాజెక్ట్ డీపీఆర్ ప్రకారమే పనులు చేయకపోతే దానిపై సైతం న్యాయపోరాటం చేస్తామని పేర్కొంది.
Also Read: Huzurabad: విద్యార్థులు స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకోవాలి : ఏబీవీపీ నేత గోస్కుల అజయ్!
రిట్ పిటిషన్ ఉపసంహరణపై మాటల తూటాలు
సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఉపసంహరణపై అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గులాబీ నేతలు ఏపీ ప్రభుత్వానికి సహకరించేందుకే రెడ్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేసిందని, చంద్రబాబు ఒత్తిడి మేరకే తిరిగి ఉపసంహరించుకున్నారని, తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శలు ఎక్కు పెట్టారు. ఇప్పటికే కృష్ణా జలాల్లో సైతం నీటి వాటా రాబట్టడంలో విఫలమయ్యారని, అతి తక్కువగా నీటిని వినియోగించుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడుతున్నారు. గోదావరి జలాల పైన ఇప్పుడు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆది నుంచి కాంగ్రెస్ తెలంగాణ వ్యతిరేకి అని, ప్రాజెక్టులకు గురించి తెలియని వారు ఏం న్యాయం చేస్తారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. దీనికి కాంగ్రెస్ నేతలు సైతం అదే స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్ ఒప్పందంతోనే తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు కృష్ణా జలాలు వెళ్తున్నాయని, సంతకాలు చేసింది కేసీఆర్, హరీశ్ రావు అని ఆరోపిస్తున్నారు. ఏపీ నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకున్నామని, ఇప్పుడు నల్లమల ప్రాజెక్ట్‌ను సైతం అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు.
నీళ్లపై సమిష్టి పోరు కరువు
ఏ రాష్ట్రంలో అయినా ఆ రాష్ట్రానికి రావలసిన హక్కులు, నీటి వాటాలకు ప్రమాదం ఏర్పడితే అన్ని పార్టీలు కలిసి కేంద్రంపై పోరాటం కొనసాగిస్తాయి. కానీ, తెలంగాణలో మాత్రం భిన్నంగా ఉన్నది. ఒకరిపై ఒకరు విమర్శలు తప్ప కలిసిపోవడం లేదు. ఉమ్మడిగా పోదామని అసెంబ్లీ వేదికగా, మీడియా వేదికగా సవాల్ ప్రతి సవాల్ చేసుకుంటారు తప్ప కలిసిపోయిన దాఖలాలు లేవు. ఒకరిపై ఒకరు విమర్శలు తప్ప, వారు చెప్పిన మాటలకు చేతలకు పొంతన ఉండదు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాల్సి ఉన్నప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి మళ్లీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఆరోపణలు ప్రతి ఆరోపణలు, రాజకీయాలు తప్ప ప్రజా సమస్యలు పట్టడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వానికి సహకరించాల్సిన ప్రధాన ప్రతిపక్షం కేవలం తమ ఉనికి కోసమే పాకులాడుతుంది తప్ప ఏనాడూ గళం వినిపించిన దాఖలాలు లేవని ప్రచారం జరుగుతున్నది. గులాబీ పార్టీకి రాజ్యసభలో ఎంపీలు ఉన్న వారు సైతం రాష్ట్రానికి రావలసిన హక్కులపై గొంతు ఎత్తడం లేదని, పైగా కాంగ్రెస్‌పై విమర్శలకే పరిమితం అవుతున్నదని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్రంలోని అన్ని పార్టీలు నీటి వాటాలపై, కేంద్ర నుంచి రావలసిన నిధులు ఇతర విషయాలపై కలిసి పోరాటం చేయాలని మేధావులు సూచిస్తున్నారు.
Also Read: Kodanda Reddy: నకిలీ విత్తనాలు అరికట్టడంలో.. గత ప్రభుత్వం విఫలమైంది.. కోదండ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

