Minister Ponguleti: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖను పూర్తిగా పారదర్శకంగా, అవినీతి రహితంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కీలక సంస్కరణలు అమలు చేస్తున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కూకట్‌పల్లి మండలంలో ఎస్‌ఎస్ఆర్ బిల్డర్స్ నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజలకు సౌకర్యం, పరిపాలనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యాధునిక సౌకర్యాలతో, కార్పొరేట్ స్థాయి ప్రమాణాలతో సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా నిర్మిస్తున్నామని తెలిపారు. మొదటి విడుతలో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో రెండో విడుతలో జిల్లా కేంద్రాల్లో మూడో విడుతలో నియోజకవర్గ కేంద్రాల్లో సమీకృత భవనాలు నిర్మిస్తామని వెల్లడించారు. మొదటి దశలో ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి – నాలుగు జిల్లాల్లోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను12 క్లస్టర్లుగా విభజించి భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు.
ఆదాయ వనరుగా కాకుండా.. సేవా కేంద్రంగా..
ఇప్పటికే గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ (తాలిమ్) భవనంలో సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగిందని, జూన్ నాటికి ఈ భవనాన్ని ప్రారంభించుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా బిల్డర్స్‌తోనే ఈ 12 సమీకృత భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. అంతేగాక సమీకృత భవనాలను నిర్మించే సంస్థలే కనీసం ఐదేళ్ల పాటు వాటిని నిర్వహించాలన్న నిబంధన కూడా పొందుపరిచామని తెలిపారు. ఇక కొత్తగా పెళ్లై రిజిస్ట్రేషన్‌కు వచ్చే జంటలు, చిన్న పిల్లలతో వచ్చే తల్లులు, పేదలకు సకల సౌకర్యాలు ఉంటాయన్నారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ఆదాయ వనరుగా కాకుండా – సేవా కేంద్రంగా చూస్తున్నదని స్పష్టం చేశారు.
ఆక్రమణలను అణచివేస్తాం
గత రెండేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా కేవలం రాష్ట్ర ఖజానాకు డబ్బు చేకూర్చాలనే ఆలోచన కాకుండా పేదవారిని దృష్టిలో పెట్టుకొని వివిధ సంస్కరణలు తెచ్చామని మంత్రి తెలిపారు. పేదలకు గతంలో ఇచ్చిన భూములతోపాటు ప్రభుత్వ భూములను పరిరక్షిస్తామని, ఈ విషయంలో ఉక్కుపాదంతో ఆక్రమణలను అణచివేస్తామని వెల్లడించారు. ప్రతిపక్షాలతో విమర్శించుకునే పరిస్థితి రాకుండా పేదల పక్షాన ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఒకప్పుడు పేదలకు పంపిణీ చేసిన భూములను, అసైన్డ్ భూములను ఒక వేళ ప్రభుత్వం తీసుకోవాలనుకున్నా వారికి తగిన పరిహారం తప్పనిసరిగా అందిస్తామన్నారు.
Also Read: BJP Telangana: మున్సిపల్ ఎన్నికల పోరుకు బీజేపీ ఒంటరి పోరు.. ఎందుకంటే..?

