CM Revanth Reddy: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతం కట్!
CM Revanth Reddy (imagecredit:twitter)
Telangana News, హైదరాబాద్

CM Revanth Reddy: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే.. పది శాతం జీతం కట్: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారు ఎవరైనా తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే, ఫిర్యాదు అందితే ఉద్యోగస్తుల జీతాల్లోంచి 10 నుంచి 15 శాతం మేరకు కోత విధించి ఆ మొత్తాన్ని తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసే విధంగా చట్టంలో మార్పులు తీసుకువస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు. అనంతరం బాల భరోసా, ప్రణామ్ పేరుతో వయోవృద్ధుల కోసం డే కేర్ సెంటర్లను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, ధనసరి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, సమాజంలో దివ్యాంగులు ఆత్మగౌరవంతో నిలబడే విధంగా సహాయ సహకారాలు అందించడంలో ప్రభుత్వం మానవీయ కోణంలో పని చేస్తున్నదన్నారు. కుటుంబానికి దివ్యాంగులు భారమవుతున్నామని ఆత్మన్యూనతతో ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని భరోసా ఇచ్చారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించి అవసరమైన ఉపకరణాలను అందించి దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం కల్పించడానికి ప్రయత్నిస్తున్నదని చెప్పారు. పోటీ ప్రపంచంలో తాము వెనకబడ్డామనే ఆలోచన రాకుండా అన్ని రంగాల్లో అవకాశం కల్పిస్తున్నామన్నారు. విద్య, ఉద్యోగాల్లో అవసరమైన రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా దివ్యాంగులు దివ్యాంగులను పెళ్లి చేసుకుంటే వారికి ఆర్థికంగా 2 లక్షల రూపాయల సహాయం అందించాలని నిర్ణయించామన్నారు.

జైపాల్ రెడ్డిని స్పూర్తిగా తీసుకోవాలి.. కో ఆప్షన్ సభ్యులుగా ఛాన్స్

దివ్యాంగులు క్రీడల్లో రాణించే విధంగా అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తున్నామని సీఎం అన్నారు. ప్యారా ఒలింపిక్స్‌లో రాణించిన అమ్మాయికి ఉద్యోగం ఇచ్చామన్నారు. దివ్యాంగులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను అందిపుచ్చుకోవాలన్నారు. సూదిని జైపాల్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు. ఆయన ఏ రోజూ వైకల్యం అనే ఆలోచన కూడా రానివ్వలేదన్నారు. దేశంలోనే ఒక మేధావిగా, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎదిగిన గొప్ప నాయకుడని గుర్తు చేశారు. ఇక, ట్రాన్స్‌జెండర్ల విషయంలో కూడా సమాజం వివక్ష చూపించడం, కుటుంబ నిర్లక్ష్యానికి గురయ్యే వారికి వివిధ శాఖల్లో ప్రభుత్వం ఉద్యోగం కల్పించడమే కాకుండా ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తున్నదన్నారు. వారికి సమాజంలో సముచిత గౌరవం ఇవ్వడానికి, వారి హక్కుల గురించి వారే మాట్లాడే విధంగా మున్సిపల్ కార్పొరేషన్లలో కో ఆప్షన్ సభ్యులుగా ఒక ట్రాన్స్‌జెండర్‌ను నామినేట్ చేయాలని సూచన చేశారు. మైనారిటీలకు వివిధ జిల్లా పరిషత్‌లలో మున్సిపాలిటీల్లో కో ఆప్షన్ తీసుకున్నట్టే ట్రాన్స్‌జెండర్లకు కూడా ప్రాతినిథ్యం ఇవ్వగలిగితే ప్రభుత్వం తమ పట్ల మానవత్వంతో చూస్తుందని, అండగా నిలుస్తుందనే విశ్వాసం వారికి కలుగుతుందని, కో ఆప్షన్ సభ్యులుగా నామినేట్ చేసే అంశంపై మంత్రివర్గ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక, వృద్ధ తల్లిదండ్రులు వారి రక్తాన్ని చమటగా మార్చి పిల్లలకు ఆస్తులు, విద్యను అందిస్తే, వయసు మీద పడినప్పుడు వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వమే ఒక కుటుంబ పెద్దగా మారి ప్రణామ్ పేరుతో డే కేర్ సెంటర్లను ప్రారంభిస్తున్నదని వివరించారు.

Also Read: Chiranjeevi Comeback: మెగాస్టార్ సినిమా చూసి ఎమోషనల్ అవుతున్న సీనియర్ ఫ్యాన్స్.. ఏం చేశారంటే?

హెల్త్ పాలసీ

తెలంగాణలో పేదలకు వంద శాతం వైద్య సహాయం అందించాల్సిన అవసరం ఉన్నదని సీఎం తెలిపారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో సమగ్రమైన హెల్త్ పాలసీ తీసుకొస్తామన్నారు. తెలంగాణ సమాజం సామాజిక న్యాయం, సమాన అవకాశాలను కోరుకుంటున్నదన్నారు. అందులో భాగంగానే వందేళ్లుగా జరగని కుల గణనను విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణను పూర్తి చేశామన్నారు. దేశంలో 2026లో చేపడుతున్న జనాభా లెక్కల్లో తెలంగాణ మాడల్‌ను ప్రమాణికంగా తీసుకుని కులగణన చేపడుతున్నారని, ఇది తెలంగాణ గర్వంగా చెప్పుకోగలిగినదని నొక్కి చెప్పారు. రెండేళ్లలో సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని చెప్పను కానీ ఉన్న వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నదన్నారు. ఇంకా చేయాల్సింది చాలా ఉన్నదని, ప్రణాళికా బద్ధంగా తెలంగాణ ఆర్థికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, పేద ప్రజలకు అండగా నిలిచే తొలి రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే తమ సంకల్పమని సీఎం వివరించారు.

Also Read: BRS Protest: ఘనపూర్ ప్రాజక్టుకుసాగు నీటిని వదలాలి.. మెదక్ కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ నేతల ధర్నా!

Just In

01

Yellampet Municipality: ఎల్లంపేట మున్సిపాలిటీలో ఉడుకుతున్న రాజకీయం.. కనిపించని కమలనాథులు..?

Kite Festival: నేడు పరేడ్ గ్రౌండ్స్‌లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్.. నోరూరించే మిఠాయిలతో పాటు..!

DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ సంక్రాంతి కానుక.. 3.64 డీఏ శాతం పెంపు

Water Sharing Issue: ఏళ్లపాటు ప్రాజెక్టుపై కొనసాగుతున్న విచారణలు.. ఇప్పుడు ఏం చేద్దాం..?

Minister Ponguleti: రాష్ట్రంలో అక్రమార్కుల భరతం పడతాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి