TG Road Accidents: తెలంగాణలో రహదారులు రక్తమోడుతూ మృత్యు మార్గాలుగా మారుతున్నాయి. గణాంకాల ప్రకారం తెలంగాణలో రోజుకు సగటున 68 ప్రమాదాలు జరుగుతుండగా, 18 మంది దుర్మరణం పాలవుతున్నారు. మరో 40 మంది గాయపడి, కొందరు అంగవికలురుగా మారి జీవచ్ఛవాల్లా బతుకులీడుస్తున్నారు. 2024తో పోలిస్తే గత ఏడాది రోడ్డు ప్రమాదాలు 5.68 శాతం పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 46 వేల కిలోమీటర్లకు పైగా రహదారులు ఉండగా, అందులో జాతీయ రహదారులు 4,983 కి.మీ., స్టేట్ హైవేలు 1,687 కి.మీ. ఉన్నాయి. అలాగే మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లు 11,536 కి.మీ., ఇతర జిల్లాల రోడ్లు 15,852 కి.మీ. విస్తరించి ఉన్నాయి. అయితే, చాలా రహదారుల్లో ఇంజనీరింగ్ లోపాలు ఉండటం ప్రమాదాలకు ప్రధాన కారణంగా మారుతోంది. జాతీయ రహదారులకు ఇరువైపులా ఉండే గ్రామాలు, పట్టణాల నుంచి వచ్చే వాహనాలు నేరుగా హైవేపైకి రాకుండా 100 మీటర్ల ముందే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. హైవేలకు రెండు వైపులా ఫెన్సింగ్ లేకపోవడంతో పశువులు ఒక్కసారిగా రోడ్లపైకి వస్తున్నాయని, వాటిని తప్పించే క్రమంలో వేగంగా వెళ్లే వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయని విశ్లేషిస్తున్నారు.
అతివేగం.. అజాగ్రత్త
మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వేలాది కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిలిస్తున్నాయి. రోడ్డు భద్రతా నిబంధనలను పాటించకుండా, ముందుకు దూసుకుపోవడమే లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల మరణాల సంఖ్య పెరుగుతోంది. ఎడమ వైపు నుంచి ఓవర్ టేక్ చేయవద్దన్న నిబంధన ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మలుపులు తిరిగేటప్పుడు, ఓవర్ టేక్ చేసేటప్పుడు ఇండికేటర్లు వాడకపోవడంతో వెనుక వచ్చే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. పోలీసుల విశ్లేషణ ప్రకారం.. కేవలం అతివేగం వల్ల 4,717 ప్రమాదాలు, ర్యాష్ డ్రైవింగ్ కారణంగా 3,562 ప్రమాదాలు సంభవించాయి. మరోవైపు మద్యం మత్తులో వాహనాలు నడపడం కూడా మృత్యుఘంటికలు మోగిస్తోంది. జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన ఉన్న హోటళ్లు, దాబాల్లో నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా మద్యం, డ్రగ్స్ విక్రయిస్తున్నారు. వీటిని సేవించి వాహనాలతో రోడ్లపైకి వస్తున్న వారు ప్రమాదాలకు కారణమవుతున్నారు. గతేడాది డ్రంకెన్ డ్రైవింగ్ వల్ల 117 ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. రాంగ్ రూట్ డ్రైవింగ్, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వంటి అజాగ్రత్త పనుల వల్ల కూడా అమాయక ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి.
Also Read: Bandi Sanjay: ఒవైసీ ఆ దమ్ముందా?.. అక్బరుద్దీన్ ఒవైసీకి బండి సంజయ్ సవాల్..!
సీఎం చేతుల మీదుగా..
రాష్ట్రంలో ఏటేటా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు రేవంత్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకున్నది. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా రాష్ట్ర పోలీసు శాఖ ‘అరైవ్.. అలైవ్’ అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని స్వయంగా ప్రారంభించి, రోడ్డు భద్రత పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటుకోనున్నారు. డీజీపీ శివధర్ రెడ్డి పర్యవేక్షణలో 10 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా సాగే ఈ ప్రచారం ద్వారా, కేవలం నగరాలకే పరిమితం కాకుండా గ్రామ స్థాయి నుంచి ప్రతి పౌరుడికి రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించనున్నారు. ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, అన్ని ప్రభుత్వ శాఖలను ఈ మహోద్యమంలో భాగస్వాములను చేయడం ద్వారా తెలంగాణను రోడ్డు భద్రతలో దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. పెరుగుతున్న మరణాల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ సత్వర చర్యలపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Kesamudram Municipality: కేసముద్రం మున్సిపాలిటీ తొలి ఎన్నికల్లో.. మొట్టమొదటి పట్టం ఎవరికో..?

