జనసేన తిరుపతి ఇన్ చార్జికి పార్టీ షాక్ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా కిరణ్ రాయల్ (Kiran Royal)వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. దాంతో పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు. కిరణ్ రాయల్ (Kiran Royal) వివాదం మీద క్షుణ్ణమైన విచారణ జరిపించాలని పార్టీ కాన్ ఫ్లిక్ట్ కమిటీకి సూచించారు. నిజ నిజాలు తేలే వరకు ఆయన్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ ఆదేశించారు. ఇదే సమయంలో పార్టీ కార్యకర్తలు, వీర మహిళలకు కూడా పవన్ సూచనలు చేశారు. ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి సారించాలని.. ఇలాంటి అనవసర విషయాల జోలికి వెళ్లొద్దంటూ చెప్పారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని.. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు.
తిరుపతి ఇన్ చార్జి కిరణ్ రాయల్ పై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన వద్ద కిరణ్ రాయల్ కోటి రూపాయలు అప్పుగా తీసుకున్నాడని.. తిరిగి అడిగితే ఇవ్వకుండా బెదిరిస్తున్నాడంటూ ఆమె ఆరోపించింది. తనకు చావే దిక్కని ఏడుస్తూ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపింది. దాని తర్వాత కిరణ్ రాయల్ ఆమెను బెదిరిస్తున్నట్టు ఓ ఆడియో కూడా బయటకు రావడంతో చాలా రోజులుగా ఆయన మీద విమర్శలు వస్తున్నాయి. దీంతో పవన్ కల్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇదే విషయంపై అటు కిరణ్ రాయల్ కూడా మీడియాతో మాట్లాడారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. వైసీపీ తనపై దుష్ప్రచారం చేయిస్తోందంటూ కొట్టి పారేశారు. భూమన అభినయ రెడ్డి తనపై ఇలా కుట్ర చేస్తున్నాడంటూ కిరణ్ రాయల్ ఆరోపించాడు. నిజాలు త్వరలోనే బయటకు వస్తాయంటూ చెప్పుకొచ్చాడు.