MP Etela Rajender: ఏకశిలానగర్‌లో రియల్ ఎస్టేట్ గూండా వెంకటేష్‌కు సహకరిస్తున్నది పోలీసులా, ప్రభుత్వ పెద్దలా అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(MP Etela Rajender) ప్రశ్నించారు. మేడ్చల్ మల్కాజిరిగి జిల్లా పోచారం మున్సిపాలిటీలోని ఏకశిలా నగర్‌ను ఆదివారం సందర్శించారు. ఇటీవల పలువురు గూండాల దాడిలో గాయపడిన ప్లాట్ ఓనర్లు, బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాంత ఎంపీగా ఉన్న తానే స్వయంగా హెచ్చరించిన తర్వాత కూడా గూండాలు బరితెగిస్తున్నారంటే ఎవరి అండ చూసుకుని అని ప్రశ్నించారు. కత్తులు, రాడ్లతో దాడి చేసి చంపే ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ల వెనుక ఉన్నది ఎవరని నిలదీశారు. ప్రజల ప్రాణాలు పోతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఫైరయ్యారు.
కొర్రేముల గ్రామంలో..
పోలీసులు, లా అండ్ ఆర్డర్ ఏమైనట్టని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకో దగ్గర ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం ఏం చేస్తున్నదని అడిగారు. ప్రజల రక్తం కళ్ల చూస్తున్నా కళ్లు తెరవని ప్రభుత్వమంటూ ధ్వజమెత్తారు. ముడుపుల కోసం నోరు మూసుకుంటే ప్రాణాలు పోతున్నా పట్టించుకోకపోతే ప్రజలు క్షమించరని పేర్కొన్నారు. ప్రజలకు అండగా తామున్నామని ఈటల రాజేందర్ భరోసానిచ్చారు. కొర్రేముల గ్రామంలో 1985లో 146 ఎకరాల్లో 2,086 ప్లాట్లు చేస్తే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవారు వందల మంది ఇక్కడ జాగాలు కొనుక్కున్నారని, కానీ ఇక్కడ ల్యాండ్ మాఫియా గ్యాంగ్ లీడర్ వెంకటేష్(Venkatesh) ఆ జాగాలను రికార్డుల్లో ఉండే లొసుగులు ఆసరా చేసుకుని రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఉండే దొంగలను పట్టుకుని 47 ఎకరాల భూమిని పట్టా చేసుకున్నాడని వివరించారు. అప్పటినుంచి ఏకశిలానగర్ వాసులకు కష్టాలు మొదలయ్యాయన్నారు. డబ్బులకు ఆశపడి ఆనాటి రెవెన్యూ అధికారులు, పోలీసులు గూండాలకు మద్దతిచ్చారన్నారు. చెట్టుకొకరు పుట్టకొకరు ఐక్యత లేకుండా ప్రజలు ఉన్నారు కాబట్టే చంపుతామంటూ బెదిరిస్తున్నారన్నారు.
Also Read: Akhanda 2: ‘అఖండ 2’కు చినజీయర్ స్వామి ప్రశంసలు.. ధర్మాన్ని రక్షించే సినిమా
వెంకటేష్‌పై హత్యా నేరం
గతంలో తాను వచ్చి వారి భారతం పట్టానని, ఆనాడు డీజీపీ, కలెక్టర్ ఉన్నతాధికారులతో మాట్లాడానని, ఈ సమస్య పరిష్కారమైందని భావించినట్లు ఈటల చెప్పారు. ఆ సమయంలోనే 2026 మందికి చెందిన ప్లాట్లు తప్ప వ్యవసాయ భూమి లేదని చెప్పినా మళ్లీ అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే చేయడానికి వచ్చినట్లు తెలిసిందని, ఆయనకు కళ్లు పోయాయా అంటూ మండిపడ్డారు. తాను ప్రెస్ మీట్ పెట్టడానికి రాలేదని, వెంకటేష్ భరతం పట్టేందుకు వచ్చినట్లు ఈటల హెచ్చరించారు. అతనికి మద్దతు పలుకుతున్న రెవెన్యూ, పోలీస్ అధికారుల వెంట కూడా పడతామని అన్నారు. వెంకటేష్‌పై హత్యా నేరం మోపి 24 గంటల్లో జైల్లో పెట్టాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కురుమ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో నూతన సర్పంచ్, ఉప సర్పంచుల సన్మాన కార్యక్రమం, 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఈటల పాల్గొన్నారు. ఆయన వెంట హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ, సరిత తదితరులు పాల్గొన్నారు.
Also Read: Excise Scandal: కల్తీ మద్యం కేసులో.. ఎక్సైజ్ చేతివాటంపై కలకలం

