Industrial Power Bills: పరిశ్రమలకు విద్యుత్ బిల్లుల మోత మోగుతున్నది. గతం కంటే బిల్లు ఎక్కువగా వస్తున్నదని, పరిశ్రమ నడపడం భారంగా మారుతున్నదని కొందరు పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేసినా స్పందన కరువైందని ఆరోపిస్తున్నారు. దీనికి తోడు పరిశ్రమ ఆవరణలోనే విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ లేకుంటే వచ్చే బిల్లుపై మూడు శాతం అదనంగా వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాము పరిశ్రమలు నడపలేని పరిస్థితుల్లో ఉన్నామని పలువురు పేర్కొంటున్నారు.
పరిశ్రమ ఆవరణలోనే ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్ మీటర్
రాష్ట్రవ్యాప్తంగా చిన్నా పెద్ద పరిశ్రమలు మొత్తం 60 వేల వరకు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఏదైనా పరిశ్రమ నడపాలంటే విద్యుత్ తప్పనిసరి. దీనికోసం ముందుగానే ట్రాన్స్‌ఫార్మర్ కోసం అనుమతి తీసుకోవాలి. ఇంతకుముందు పరిశ్రమ ముందు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసేవారు. అప్పుడు కేవలం మీటర్‌లో రీడింగ్ అయిన దానికి బిల్లులు చెల్లించేవారు. అయితే, విద్యుత్ అధికారులు నిబంధనలను మార్పులు చేసి పరిశ్రమ ఆవరణలోనే ట్రాన్స్‌ఫార్మర్ తోపాటు విద్యుత్ మీటర్ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పారిశ్రామికవేత్తలపై అదనపు భారం పడుతున్నది. ట్రాన్స్‌ఫార్మర్ లాస్ ఆయన విద్యుత్‌కు సైతం అదనంగా 3 శాతం ఫైనాల్టీ వేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రూ.50 వేల బిల్లు వస్తే మరో రూ.15 వేలు అదనంగా చెల్లించాల్సి వస్తున్నదని, దీనిని మాఫీ చేయాలని అధికారులకు విజ్ఞప్తులు సైతం చేసినట్లు సమాచారం. కానీ, అటు నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిసింది.
Also Read: HYDRAA: హైడ్రా ఆపరేషన్ సక్సెస్.. మియాపూర్‌లో సర్వే నెంబర్ 44లో కబ్జా బాగోతం..!
కేవీఆర్ఏహెచ్‌తో ఇక్కట్లు
పరిశ్రమలకు కేడబ్ల్యూహెచ్, కేవీఏహెచ్ ద్వారా విద్యుత్ సరఫరా చేస్తారు. కేవీఆర్ఏహెచ్(కిలో వాట్ అంపైర్ రియాక్టివ్ అవర్)ను గతంలో అధికారులు బ్లాక్ చేశారు. అయితే, ఇప్పుడు అన్ బ్లాక్(ఓపెన్ చేయడంతో) పరిశ్రమలకు విద్యుత్ బిల్లుల భారం ఎక్కువైనట్లు పారిశ్రామికవేత్తలు పేర్కొంటున్నారు. కేవీఆర్ఏహెచ్‌తో ఎక్కువ బిల్లులు రాకుండా ఆటోమేటిక్ కంట్రోలర్ పవర్ ప్యాక్ ప్యానెల్ లేకపోవడం, ఎక్కడ లభిస్తుందో కూడా తెలియకపోవడంతో విద్యుత్ బిల్లులు ఎక్కువ వస్తున్నట్లు పేర్కొంటున్నారు. గత నెల పరిశ్రమలకు రూ.500 కోట్లకు పైగా బిల్లులు వచ్చినట్లు సమాచారం. ఈ నెల మరో రూ.250 కోట్లు అదనంగా బిల్లు వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఈఆర్‌సీ చైర్మన్‌కు సైతం విజ్ఞప్తులు చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని సమాచారం. మరోవైపు, ఎంపీడీసీఎల్ చైర్మన్‌కు ఆ పరిధిలోని పారిశ్రామికవేత్తలు విజ్ఞప్తి చేయగా రెండు నెలలు వాయిదా వేశారని ఎస్పీడీసీఎల్ పరిధిలో మాత్రం స్పందన రాలేదని తెలిపారు.
సీఎం, మంత్రిని కలుస్తాం..
పరిశ్రమలు మనుగడ కొనసాగించాలంటే విద్యుత్ బిల్లులు తక్కువ వచ్చేలా చూడాలని పారిశ్రామికవేత్తలు పేర్కొంటున్నారు. కేవీఆర్ఏహెచ్‌ను బ్లాక్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం అందిస్తామంటున్న ప్రభుత్వం, విద్యుత్ బిల్లుల భారం మోపుతున్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ మంత్రి అపాయింట్‌మెంట్ ఇస్తే తమ సమస్యలను వివరిస్తామని పేర్కొంటున్నారు. అంతేకాకుండా పరిశ్రమ బయట ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లకు అదనంగా మూడు శాతం వసూలు చేయడం భారంగా మరిందని, దీన్ని సైతం మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని సైతం కలిసి ఈ అంశంపై వినతిపత్రం అందజేస్తామని పారిశ్రామికవేత్తల అసోసియేషన్ నాయకులు తెలిపారు.
Also Read: Murder Case: భర్త హత్యను కళ్లారా చూసింది.. ఆ కేసుపై విచారణ జరుగుతుండగా ఊహించని ఘోరం

