Excise Scandal: రక్షకభట నిలయం అంటే ప్రజల ఆస్తులను రక్షించాలి.. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది! దొంగలను పట్టుకోవాల్సిన అధికారులే చేతివాటం ప్రదర్శిస్తే.. కంచే చేను మేసినట్లవుతుంది! శంషాబాద్ జిల్లా ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పరిధిలో జరిగిన తాజా ఘటన శాఖా పరంగా పెను దుమారం రేపుతోంది. విదేశీ మద్యం పేరిట కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్న గ్యాంగును అరెస్ట్ చేసే క్రమంలో, కొందరు సిబ్బంది తమ వృత్తి ధర్మాన్ని మరిచి ‘కాసుల’ వేటలో పడ్డారనే ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. కల్తీ మద్యం కేసులో నిందితుడి ఇంట్లో తనిఖీలు నిర్వహించిన ఎక్సైజ్ సిబ్బంది, అక్కడ లభించిన కల్తీ లిక్కర్ బాటిళ్లను సీజ్ చేయడంతో పాటు తమ చేతివాటాన్ని ప్రదర్శించినట్లు తెలుస్తోంది.
మొత్తం మహంతీనే..
గచ్చిబౌలి ఫ్లై ఓవర్ సమీపంలోని ఇందిరానగర్‌లో రూట్ వాచ్ జరిపిన అధికారులు, స్కూటీపై అనుమానాస్పదంగా వెళ్తున్న ప్రకాష్ గౌడ్(Prakash Goud), గద్వాల భరత్‌లను అదుపులోకి తీసుకోవడంతో ఈ గ్యాంగ్ భాగోతం బయటపడింది. వారి వద్ద ఉన్న 15 గ్లెన్ ఫ్లెడ్ విచ్ విస్కీ బాటిళ్లను పరీక్షించగా, అవి విదేశీ మద్యం కాదని, కల్తీవని తేలింది. వీరిని విచారించగా వచ్చిన సమాచారంతో ప్రకాష్ గౌడ్ తమ్ముడు అరవింద్ ఇంటిపై దాడి చేసి మరో 46 బాటిళ్లను సీజ్ చేశారు. ఈ కల్తీ దందాకు అసలు సూత్రధారి ఒడిషా రాష్ట్రానికి చెందిన బుచ్చిదేవ్ మహంతి అని, అతను విదేశీ బాటిళ్లలో మద్యాన్ని మిక్సింగ్ చేసి సరఫరా చేస్తున్నాడని నిందితులు ఒప్పుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మహంతి ఇంటిపై దాడి చేసి 54 బాటిళ్లను, ఆపై విక్రమ్ అనే వ్యక్తి ఇంట్లో సోదాలు చేసి మరో 24 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Municipal Elections: మున్సిపల్ పోరుకు ఆశావహులు వ్యూహాలు.. ఉత్కంఠగా మారిన రిజర్వేషన్ల అంశం
నోరు విప్పరేం!
కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయిన నిందితుడి ఇంట్లో తనిఖీలు జరిపిన సమయంలో, ఎక్సైజ్ సిబ్బంది తమ చేతివాటాన్ని ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఉన్న 2 తులాల బంగారు నగలు, కొంత నగదును కొందరు సిబ్బంది చాకచక్యంగా జేబులో వేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సదరు నిందితుడే నేరుగా ఎక్సైజ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో కలకలం మొదలైంది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు అత్యంత రహస్యంగా అంతర్గత విచారణ జరిపిస్తున్నారు. ఆ సమయంలో నిందితుడి ఇంట్లో సోదాలు చేసిన సిబ్బంది ఎవరనే వివరాలు సేకరించి, ఒక్కొక్కరిని విడివిడిగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు మాత్రం ప్రస్తుతం పెదవి విప్పడం లేదు.
Also Read: Akhanda 2: ‘అఖండ 2’కు చినజీయర్ స్వామి ప్రశంసలు.. ధర్మాన్ని రక్షించే సినిమా

