Ramchander Rao: రాష్ట్రంలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తప్పదని, కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేషన్ బియ్యం బ్యాగ్‌పై ప్రధాని మోదీ బొమ్మ ఎందుకు వేయలేదని ఆయన ప్రశ్నించారు. రేషన్ కార్డుపై కూడా మోదీ బొమ్మ వేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ బొమ్మతో పాటు మోదీ ఫొటో కూడా ఉండాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.
జీ రామ్ జీ పథకంపై తప్పుడు ప్రచారం
ఇకపోతే నీటి వివాదాలపై రెండు రాష్ట్రాలు కలిసి చర్చించుకోవాలని సూచించారు. కేంద్రం మొదటి నుంచి అదే విషయాన్ని చెబుతూ వచ్చిందని రాంచందర్ గుర్తుచేశారు. కేంద్రానికి రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కటేనన్నారు. జల వివాదాలపై రెండు రాష్ట్రాలు కూర్చుని చర్చింకుంటేనే పరిష్కారమవుతాయని వివరించారు. ఇదిలా ఉండగా సోమనాథ్ దేవాలయం నిర్మాణం జరిగి వెయ్యి సంవత్సరాలు పూర్తి చేసుకున్నదని, ఆ ఆలయాన్ని మహమ్మద్ గజినీ అనేక సార్లు ధ్వంసం చేశారని మండిపడ్డారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయం సోమనాథ్ దేవాలయమని, అలాంటి ఆలయాన్ని కూలగొడితే పునర్నిర్మాణం చేసినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా జీ రామ్ జీ పథకంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాంచందర్ రావు విమర్శించారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న వారికి ఇది ఎంతో ఆసరాగా ఉంటుందన్నారు. దీన్ని కేంద్రం.. గతంలో కంటే ఉత్తమమైన పథకంగా తీర్చిదిద్దిందని వివరించారు. అనంతరం పార్టీ డైరీని రాంచందర్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ చీఫ్ స్పోక్స్ పర్సన్ ఎన్వీ సుభాష్, పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లీగల్‌గా ఇబ్బందులు తలెత్తకూడదు
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్ అధ్యక్షతన లీగల్ సెల్ మీటింగ్ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లీగల్ సెల్ న్యాయవాదులతో సమావేశమైన అనంతరం రాంచందర్ రావు మాట్లాడుతూ, రాబోయే మున్సిపల్ ఎన్నికలపై న్యాయవాదులకు పలు సూచనలు చేశారు. అభ్యర్థులకు కావాల్సిన పూర్తి సమాచారంతో పాటు లీగల్‌గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వారికి సూచించారు. కాంగ్రెస్ న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషన్‌పై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నదని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ అని వివరించారు. కాంగ్రెస్.. ఎన్నికల కమిషన్‌ను అవమానించేలా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం హిల్ట్, ఫ్యూచర్ సిటీ, ఉర్దూ యూనివర్సిటీ ఇలా అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నదని మండిపడ్డారు. విద్యావ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నడుస్తున్నాయన్నారు. రోహింగ్యాలకు ఎంఐఎం మద్దతుగా నిలుస్తున్నదని విమర్శించారు.
Also Read: Vidyut Jammwal: నగ్నంగా చెట్టు ఎక్కిన బాలీవుడ్ హీరో.. వీడియో వైరల్.. నెటిజన్లు ఏం చేశారంటే?

