Harish Rao: తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై మరో జిల్లా ఉద్యమాన్ని నిర్మిస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు (Harish Rao) స్పష్టం చేశారు. తెలంగాణ హక్కుల సాధన కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతామని వెల్లడించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ‘నదీ జలాలు – కాంగ్రెస్ ద్రోహాలు’ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ అని మండిపడ్డారు. అసెంబ్లీలో ఉత్తమ్ కట్టుకథలు, పిట్ట కథలు చెప్పారని, ఫజల్ అలీ కమిషన్ వద్దన్నా ఆంధ్రాలో కలిపి తెలంగాణకు ద్రోహం చేశారని, పాలమూరుకు మరణశాసనం రాసిందే కాంగ్రెస్ అని మండిపడ్డారు. ఈ ద్రోహాలను కప్పిపుచ్చుకున్నారని, విభజన సమయంలోనూ అన్యాయం చేశారని గుర్తు చేశారు. 11వ షెడ్యూల్‌లో పాలమూరు రంగారెడ్డి పెట్టలేదన్నారు. తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అంటూ ఫైరయ్యారు. కాళేశ్వరంపై కక్షగట్టారని, పాలమూరుపై పగబట్టారని మండిపడ్డారు.
కాళేశ్వరంపై పగ ఎందుకు?
నిపుణుల సహకారంతో పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరానికి కేసీఆర్ రూపకల్పన చేశారని హరీశ్ రావు తెలిపారు. రెండు పిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్వరాన్ని పండబెట్టారని రూ.100 నుంచి రూ.200 కోట్లు ఖర్చు పెడితే 5 నుంచి 6 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చే అవకాశం ఉన్నదన్నారు. రెండేళ్లలో రూ.2 కూడా కాళేశ్వరంపై ఖర్చు పెట్టలేదని ఆరోపించారు. రైతాంగం, ఉత్తర తెలంగాణపై పగబట్టారని మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజ్ లేకపోయినా నదీ ప్రవాహం నుంచి కన్నెపల్లి పంప్‌హౌస్‌ను నడిపి నీళ్లు తెచ్చే అవకాశం ఉన్నదని, రాష్ట్రానికి మేలు కోసం పాలమూరు ప్రాజెక్ట్ కట్టామని వివరించారు. రెండేళ్ల నుంచి ప్యాకేజ్ 3లో బుడ్డ కాల్వ పూర్తి చేస్తే, ఈ ఏడాది 50 టీఎంసీల నీళ్లు నిలుపుకునే అవకాశం ఉండేదన్నారు. పాలమూరుకు నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్, టీడీపీ ద్రోహం చేస్తే, ఆ పరంపర ఇప్పటికీ కొనసాగుతున్నదని ఆరోపించారు.
Also Read : Harish Rao on CM Revanth: మూసి కంపు కంటే.. సీఎం నోటి కంపే ఎక్కువ.. హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్
ఏడాదికి లక్షా 81 వేల 473 ఎకరాల కొత్త ఆయకట్టు తెచ్చాం
2014 నుంచి 2023 వరకు బీఆర్‌ఎస్ సాధించిన ఆయకట్టు 31 లక్షల 51 వేల ఎకరాలు అయితే, 17 లక్షల 24 వేల ఎకరాల కొత్త ఆయకట్టు అని, మొత్తం 48 లక్షల 74 వేల ఎకరాలు అంటూ వివరించారు. అంతకుముందు పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక ఏడాదికి 57 వేల ఎకరాలు వస్తే, బీఆర్‌ఎస్ పాలనలో ఏడాదికి లక్షా 81 వేల 473 ఎకరాల కొత్త ఆయకట్టు తెచ్చామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో చెరువులను పట్టించుకోలేదని, మిషన్ కాకతీయ ద్వారా 25 లక్షల ఎకరాల ఆయకట్టు సాధించామని చెప్పారు. ఎస్సారెస్పీ స్టేజ్ 2 పేరుకే కాల్వలు, తుమ్మలు మొలిశాయి తప్ప నీళ్లు పారలేదని ఆరోపించారు. స్టేజ్ 2కు కాళేశ్వరం నీళ్లు అందించామని పేర్కొన్నారు. అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, శాసనసభను తప్పుదోవ పట్టించారన్నారు.
ఒక్క డీపీఆర్ అయినా ఆమోదం పొందిందా?
గోదావరి నదిలో నిజాం కాలంలో మనకు దక్కింది 252 టీఎంసీలు అని హరీశ్ రావు తెలిపారు. 60 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో గోదావరి నదిపై ప్రాజెక్టులకు సాధించిన హక్కులు 265 టీఎంసీలే అని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం గోదావరి నదిపై 383 టీఎంసీలకు హక్కులు సాధించిందన్నారు. గోదావరి జలాల్లో నీటి కేటాయింపులు సాధించడంలో ఏడాదికి 40 టీఎంసీలు కేసీఆర్ సాధించారన్నారు. ఏడాదికి కాంగ్రెస్, టీడీపీలు కలిపి 4.43 టీఎంసీలు మాత్రమే సాధించాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 490 టీఎంసీల ప్రాజెక్టులకు అనుమతులు వచ్చాయని పచ్చి అబద్ధం చెప్పారన్నారు. మొదటి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లోనే కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటుపై ప్రశ్నించామని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక 11 ప్రాజెక్టులకు డీపీఆర్‌లు పంపామని, 7 ప్రాజెక్టులకు అనుమతులు సాధించామని వివరించారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ ఒకటి పెండింగ్‌లో ఉన్నదన్నారు. కాంగ్రెస్ వచ్చాక పాలమూరు రంగారెడ్డి వాపస్ వచ్చిందని, అంబేద్కర్ వార్దా ప్రాణహిత చేవెళ్ల డీపీఆర్ వాపస్ వచ్చిందని ఆరోపించారు. కాళేశ్వరం అడిషనల్ టీఎంసీ వాపస్ వచ్చిందని, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క డీపీఆర్‌కు క్లియరెన్స్ తేలేదన్నారు.
మొదటి నుంచి తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్
నీళ్ల విషయంలో చంద్రబాబు, జగన్‌ను కేసీఆర్ నిలదీశారని హరీశ్ రావు గుర్తు చేశారు. పోతిరెడ్డిపాడు ఆపకపోతే ఆలంపూర్ దగ్గర ప్రాజెక్ట్ కడతామని హెచ్చరించారని అన్నారు. సభలో అబద్ధాలు చెప్పినందుకు కాంగ్రెస్ నేతలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘‘నేను ఇలా మాట్లాడుతున్నందుకు దాడి చేయించొచ్చు. అవసరమైతే హత్యాయత్నం కూడా చేయించవచ్చు’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, టీడీపీ ద్రోహం వల్లనే కృష్ణాలో 299 టీఎంసీలు వచ్చాయని ఆరోపించారు.
లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం
కానీ, గోదావరిలో 933 టీఎంసీలకు మనం అనుమతులు సాధించామని వివరించారు. కృష్ణాలో పెండింగ్ ప్రాజెక్టులను తాు రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక 42 రోజుల్లోనే కృష్ణాలో 69 శాతం నీళ్లు రావాలని కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారని గుర్తు చేశారు. సెక్షన్ 3 కోసం 32 లేఖలు కేంద్రానికి రాసినట్టు పేర్కొన్నారు. నేరం చేసేది కాంగ్రెస్ నెపం నెట్టేది బీఆర్‌ఎస్ మీదా అంటూ ప్రశ్నించారు. కృష్ణా నదీ జలాల విషయంలో కాంగ్రెస్ అన్యాయంపై ప్రశ్నిస్తామని, ప్రజా క్షేత్రంలో ఎండగడుతామని స్పష్టం చేశారు. ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని, అవసరమైతే మరో జల పోరాటం చేస్తామన్నారు. తమకు అధికారం ముఖ్యం కాదని, తెలంగాణ ప్రజల హక్కులు ముఖ్యమని హరీశ్ రావు స్పష్టం చేశారు.
Also Read : Harish Rao on CM Revanth: మూసి కంపు కంటే.. సీఎం నోటి కంపే ఎక్కువ.. హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్

