Urea Supply: రాజకీయ లబ్ధి కోసం యూరియా కొరత అంటూ ప్రచారం
రాజకీయంగా వాడుకోవాలనుకుంటే రైతులు క్షమించరు
కపాస్ కిసాన్ యాప్ రాష్ట్రంలో అమలు
యాప్‌పై లేనిపోని అపోహలు సృష్టించే ప్రయత్నం
రాష్ట్రంలో సమృద్ధిగా యూరియా నిల్వలు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: రాష్ట్రంలో ఉన్న 12 వేల సెంటర్లలో, ఎక్కడో రెండు మూడు సెంటర్లలో ఉన్న వరుసలను చూపి, యూరిత కొరత అంటూ రాజకీయ పబ్బం గడపాలని అనుకుంటున్నారని విపక్షాలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మండిపడ్డారు. ఆతృతతో రైతులు అక్కడక్కడ షాప్‌ల ముందూ నిల్చున్న సందర్భాలను చూపి యూరియా కొరత అని ప్రచారం చేసి, రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని అనుకుంటే రైతులు క్షమించబోరని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. శాసన మండలిలో శుక్రవారం యూరియా కొరతపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.
Read Also- GHMC Payments: అక్రమాలకు చెక్.. బల్దియాలో నగదు చెల్లింపులు బంద్.. కమిషనర్ సంచలన ఆదేశాలు
2025 డిసెంబర్ 31 నాటికే 4.04 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా రైతులకు సరఫరా చేశామని మంత్రి తుమ్మల వెల్లడించారు. యాసంగి సీజన్‌లో 2018–19 సంవత్సరంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మొత్తం 2.57 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరిగాయని తెలిపారు. 2019–20 సంవత్సరంలో అక్టోబర్-డిసెంబర్ కాలంలో మొత్తం 2.42 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు నమోదయ్యాయని వివరించారు. ‘‘2020–21 సంవత్సరంలో యాసంగిలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కేవలం 1.22 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు మాత్రమే జరిగాయి. 2021–22 సంవత్సరంలో యాసంగి సీజన్‌లో డిసెంబర్ నాటికి 1.75 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరిగాయి. 2022–23 సంవత్సరంలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో కలిపి మొత్తం 2.63 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరిగాయి. 2023–24 సంవత్సరంలో యాసంగి సీజన్‌లో డిసెంబర్ నాటికి 2.17 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు నమోదయ్యాయి. 2024–25 సంవత్సరంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మొత్తం 3.04 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరిగాయి, ప్రస్తుత 2025–26 యాసంగి సీజన్‌లో అక్టోబర్ నుంచి డిసెంబర్ 31 వరకు మొత్తం 4.04 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరిగాయి. ఇది గత 8 సంవత్సరాల్లో అత్యధికం’’ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు.
Read Also- New Year Party: న్యూఇయర్ పార్టీకి ఆర్టీసీ బస్ డిపోలో మేక కటింగ్.. ప్రోత్సహించిన డిపో మేనేజర్!
యూరియా సరఫరాకు ప్రభుత్వం సిద్ధం
యాసంగిలో డిసెంబర్ వరకు కేంద్ర కేటాయింపులు 5.60 లక్షల మెట్రిక్ టన్నులకుగాను, ఇప్పటికే 5.78 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను తెప్పించుకోగలిగామని, రైతులకు అవసరమున్నంతమేర యూరియా సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధం అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న క్యూల సంగతి, ఆ క్యూలలో రైతులు మరణించిన సందర్భాల గురించి తాను మాట్లాడదల్చుకోలేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘కపాస్ కిసాన్’ యాప్ రాష్ట్రంలో కూడా అమలు చేశామన్నారు. ఆ యాప్‌ను ఉపయోగించిన పత్తి రైతులలో సన్న, చిన్నకారు రైతులే ఎక్కువవారు కూడా ఈ యాప్ ని వినియోగించి పత్తి అమ్మకాలు చేస్తున్నారని తెలిపారు. ఈ యాప్ ఆధారంగా యూరియా యాప్‌ను రాష్ట్రంలో 5 జిల్లాలలో ప్రయోగాత్మకంగాచేపట్టడం జరిగిందన్నారు. యాప్ మీద కూడా లేని పోని అపోహలు, గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేయడం దురదృష్టమని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ యాప్‌ను తీసుకొచ్చే ముందు రైతులందరికీ అవగాహన కల్పించామన్నారు. ప్రతీ రిటైల్ అవుట్ లెట్ దగ్గర ఒక వాలంటీర్‌ను ఉంచామని ప్రస్తావించారు. ఈ యాప్ ప్రయోగాత్మక దశలో ఏర్పడుతున్న సాంకేతిక సమస్యలన్నింటిని ఒక్కొక్కటిగా పరిష్కరించామన్నారు. ‘‘కౌలు రైతులకు, పట్టాలు లేని రైతులకు ఇబ్బంది కలగకుండా చూసుకొన్నాం. నేను స్వయంగా రైతు వేదికల ద్వారా ఆయా జిల్లాల రైతులతో మాట్లాడితే వారు సంతృప్తి వ్యక్తం చేశారు. యాప్ ద్వారా డిసెంబర్ 20 నుంచి ఇప్పటివరకు 1.18 లక్షల మంది రైతులు 3.36 లక్షల యూరియా బస్తాలు కొనుగోలు చేశారు. యూరియా ఇబ్బందులు కలగకుండా స్పెషల్ ఆఫీసర్‌లను వేశాం. ఎన్ని టన్నులు కావాలంటే అన్ని టన్నులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్షాలు రాజకీయం చేయాలంటే కుదరదు’’ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

