GHMC Payments: బల్దియాలో నగదు చెల్లింపులు బంద్
ఆన్‌లైన్ చెల్లింపులతోనే స్వీకరణ
ప్రాపర్టీ ట్యాక్స్, వీఎల్టీ, ట్రేడ్ లైసెన్స్ ఛార్జీల స్వీకరణపై కమిషనర్ సంచలన నిర్ణయం
బిల్ కలెక్టర్లకు, సీఎస్‌సీ సెంటర్లలో చెల్లించాలంటూ ఆదేశాలు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: జీహెచ్ఎంసీకి ఉన్న ఆర్థిక వనరుల్లో అతి ముఖ్యమైన ప్రాపర్టీ ట్యాక్స్, ఓపెన్ ల్యాండ్ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ ఫీజుల చెల్లింపులను ఇకపై నగదు రూపంలో స్వీకరించేదిలేదని (GHMC Payments) జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వీ. కర్ణన్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపులు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, ఓపెన్ ల్యాండ్ ట్యాక్స్ చెల్లింపుల్లో తరుచూ చోటుచేసుకుంటున్న భారీ అక్రమాలకు చెక్ పట్టేందుకే కమిషనర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం.
ఇప్పటివరకున్న జీహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తున్న 145 మంది ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు, మరో 300 పైచిలుకు బిల్ కలెక్టర్లలో చాలా మంది సిబ్బంది ప్రాపర్టీ ట్యాక్స్‌ను నగదు రూపంలో వసూలు చేసుకుని తమ సొంత అవసరాలకు వినియోగించుకోవటం, లేదా వడ్డీలకు తిప్పుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఈ రకంగా అడ్డదారిలో వడ్డీలకు ట్యాక్స్ నగదును ఇస్తూ నెలకు వేల రూపాయలను సంపాదిస్తున్నారో ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు ప్రశ్నించినప్పుడో, నెలాఖరులో వసూలు చేసిన నగదును ఖజానాలో జమ చేస్తున్నట్లు కూడా ఉన్నతాధికారులు గుర్తించారు. దీంతో, నగదు చెల్లింపులకు బదులుగా ఆన్‌లైన్ చెల్లింపులను అమల్లోకి తీసుకువచ్చినట్లు సమాచారం.
Read Also- Lady Constable: లేడీ కానిస్టేబుల్ దుస్తులు చింపేసిన నిరసనకారులు.. షాకింగ్ వీడియో వైరల్
ట్యాక్స్ చెల్లింపులు, ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్‌కు సంబంధించిన ఫీజులను కూడా కేవలం చెక్కులు, డీడీలు, యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే చెల్లింపులు జరగాలని కమిషనర్ కర్ణన్ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇటీవలే విలీనం చేసిన తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌లోని 27 పట్టణ స్థానిక సంస్థల్లో ఈ ప్రాపర్టీ ట్యాక్స్, ఓపెన్, వెకెట్ ల్యాండ్ ట్యాక్స్‌లతో పాటు పాత జీహెచ్ఎంసీలోని ముప్పై సర్కిళ్లతో కలిపి మొత్తం 60 సర్కిళ్లలోని సిటిజన్ సర్వీస్ సెంటర్లు, బిల్ కలెక్టర్లు క్యాష్‌లెస్ చెల్లింపులు జరపవచ్చునని కమిషనర్ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎక్కడ చెల్లింపులు జరిగినా ఫైనాన్స్, రెవెన్యూ విభాగం ఉన్నతాధికారులతో పాటు ట్యాక్స్ విభాగం అధికారుల ఫోన్లకు మేసేజ్ వచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
ఆదాయ పన్ను చెల్లింపు తరహాలో…
జీహెచ్ఎంసీ ఆర్థిక వనరుల్లో ఒకటైన ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుల పట్ల బకాయిదారులు నిర్లక్ష్యంగా ఉండటాన్ని గుర్తించిన జీహెచ్ఎంసీ ప్రతి ఏటా ట్యాక్స్ సక్రమంగా వసూలయ్యేందుకు వీలుగా సిబ్బందితో ప్రమేయం లేకుండా ఆదాయ పన్ను తరహాలో ఆన్ లైన్ లో చెల్లించే విధంగా ఏర్పాట్లు చేస్తుంది. ఒక్కసారి అసెస్ మెంట్ ఫిక్స్ చేసిన ఆస్తి పన్ను మొత్తాన్ని సకాలంలో చెల్లించేలా బకాయిదారులకు అలర్ట్ ఇచ్చేలా సరి కొత్త విధానాన్ని జీహెచ్ఎంసీ అందుబాటులోకి తేనుంది. ప్రాపర్టీ యజమాని సెల్ ఫోన్ నెంబర్ కు అలర్ట్ వచ్చేలా, యజమాని బ్యాంకు ఖాతా నుంచి ఒక్క క్లిక్ లో ట్యాక్స్ చెల్లించేలా ఈ విధానాన్ని తీసుకురానున్నట్లు తెలిసింది. ఇక ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్ల కోసం నియమించుకున్న సుమారు 450 పై చిలుకు ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లకు వేరే పనులను అసైన్ చేయాలని కూడా కమిషనర్ కర్ణన్ భావిస్తున్నట్లు తెలిసింది.
Read Also- Budget 2026: దేశ ఆర్థిక దిశను నిర్ణయించే కేంద్ర బడ్జెట్ ప్రకటనకు డేట్ ఫిక్స్.. ఈ ఏడాది ఎప్పుడంటే?

