Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం తెలంగాణకు రానున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. పవన్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను సైతం విడుదల చేశారు.
వసతి గృహాలకు భూమి పూజ
శనివారం హైదరాబాద్ రానున్న పవన్ కళ్యాణ్.. ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాఫ్టర్ ద్వారా కొండగట్టుకు చేరుకుంటారు. కొండగట్టులోని జేఎన్టీయూలో ల్యాండ్ అయి అక్కడ నుంచి వాహనం ద్వారా నేరుగా ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్తారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా మంజూరైన 100 వసతి గృహాలకు భూమి పూజ చేయనున్నారు. రూ.35 కోట్ల 19 లక్షలతో భక్తుల కోసం టీటీడీ ఈ వసతి గృహాలను నిర్మించనుంది.
పవన్ కృషి వల్లే..
కొండగట్టుకు టీటీడీ నిధులు రావడంతో పవన్ ముఖ్య భూమిక పోషించారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం వసతి గృహాన్ని నిర్మించాలని గతంలో ఆయన టీటీడీకి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల రూ.35 కోట్ల మంజూరు చేసింది. దీంతో పవన్ స్వయంగా కొండగట్టు ఆలయానికి వచ్చి వసతి గృహ నిర్మాణానికి భూమి పూజ చేయబోతున్నారు. భూమి పూజ తర్వాత బృందావన్ రిసార్ట్ లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పవన్ పాల్గొంటారు. గంటసేపు అక్కడ గడిపి.. తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి ఏపీకి పయనమవుతారు. పవన్ పర్యటన సందర్భంగా కొండగట్టు ప్రాంతంలో భారీ భద్రతను ఏర్పాటు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Lover Attacks Man: రాత్రి 1.30 గంటలకు ప్రియుడిని ఇంటికి పిలిచి.. ప్రైవేటు పార్ట్స్ కోసేసిన ప్రియురాలు
కొండగట్టుతో అనుబంధం
కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే పవన్ కు ఎనలేని భక్తి. తన వ్యక్తిగత, రాజకీయ జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ కొండగట్టులోనే తీసుకున్నట్లు పవన్ చెబుతుంటారు. అంతేకాదు తనను కరెంట్ షాక్ నుంచి ఆంజనేయ స్వామే రక్షించారని పవన్ నమ్ముతుంటారు. ఏపీ ఎన్నికల ప్రచారం సందర్భంగా పవన్ తన వారాహి రథాన్ని తొలుత కొండగట్టు ఆలయానికే తీసుకొచ్చి పూజలు చేయించారు. వారాహి పూజ అనంతరం ఏం కావాలని ఆలయ అర్చకులను పవన్ ప్రశ్నించగా.. వసతి గృహం లేక భక్తులు ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. వారి అభ్యర్ధనను గుర్తుపెట్టుకున్న పవన్ ఈ విషయాన్ని టీటీడీ దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరులో ముఖ్య భూమిక పోషించారు.

