Medaram Jatara 2026: మేడారం జాతర-2026ను విజయవంతం చేయాలి
మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి
ట్రాఫిక్ మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి: మల్టీ జోన్ ఐజి చంద్రశేఖర్ రెడ్డి
ములుగు, స్వేచ్ఛ: మేడారం జాతర 2026ను (Medaram Jatara 2026) సమర్థవంతంగా నిర్వహించాలంటూ సంబంధిత అధికారులను మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశించారు. అధికారుల సమీక్ష సమావేశం సందర్భంగా ఈ ఆదేశాలు ఇచ్చారు. తొలుత మేడారం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను గురించి ఆరా తీశారు. త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. అంతకుముందు ఆయన వనదేవతలు సమ్మక్క సారలమ్మలను దర్శించి, మొక్కులను చెల్లించుకున్నారు.
Read Also- New Year Party: న్యూఇయర్ పార్టీకి ఆర్టీసీ బస్ డిపోలో మేక కటింగ్.. ప్రోత్సహించిన డిపో మేనేజర్!
అనంతరం ఏర్పాటు చేసిన అధికారుల సమీక్ష సమావేశంలో ఐజీ మాట్లాడారు. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా జాతరకు లక్షలాది ప్రజలు తరలివస్తారని, తదనుగుణంగా పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎంతో దూరం నుంచి భక్తులు వస్తారని, వారికి దర్శనం సాఫీగా జరిగేలా తగిన బందోబస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గత జాతరలో పనిచేసిన అనుభవం ఉన్న అధికారులు ఆయా జోన్‌లలో, సెక్టార్‌లలో తిరిగి పని చేయాలని సూచించారు. జాతరకు ఎంత సిబ్బంది అవసరమైతే అంత మందిని తీసుకోవాలని, ప్రజల కోసం కలిపి ఏర్పాటు చేసే బందోబస్తుకు వెనుకాడొద్దని అధికారులను ఆదేశించారు.
మేడారం జాతర సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచన చేశారు. ఎట్టి పరిస్థితులను ట్రాఫిక్ జామ్ కాకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జాతరకు వచ్చి వెళ్లే వాహనాల దారి మళ్లింపు విషయమై ముందస్తు ప్రణాళికలు రచించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా, వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్, కరీంనగర్ సీపీ గౌస్ ఆలం, మహబూబాబాద్ ఎస్పీ డాక్టర్ శబరిష్, భూపాలపల్లి ఎస్పీ సంకీర్త్, రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ గీతే బాబాసాహెబ్, అడిషనల్ ఎస్పీలు, ఏఎస్పీలు, డీఎస్పీలు తదితరులు పాల్గొన్నారు.
Read Also- Pawan Impact: పవన్ కళ్యాణ్ ఫ్లాప్ సినిమా రేంజ్ అలాంటిది మరి.. నిధి అగర్వాల్ ఏం చెప్పారంటే?

