Harish Rao on CM Revanth: మూసీలో కంటే బీఆర్ఎస్ నేతల కడుపులోనే ఎక్కువ విషం ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ బాయ్ కాట్ చేసిన అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. మూసీ కంపు కంటే సీఎం నోటి కంపే ఎక్కువగా ఉందంటూ సెటైర్లు వేశారు. ప్రజా స్వామ్య విలువలను కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కుతోందని హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళనపై అడ్డగోలుగా మాట్లాడి.. గంటన్నర పాటు అసెంబ్లీలో టైంపాస్ చేశారని విమర్శించారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సైతం సీఎం వ్యాఖ్యలను ప్రోత్సహించేలా వ్యహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మూసీ ప్రక్షాళన వ్యతిరేకం కాదు’
మూసీ నది ప్రక్షాళనకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదని హరీశ్ రావు స్పష్టం చేశారు. అసలు మూసి ప్రక్షాళన పనులకు శ్రీకారం చుట్టేందని తమ పార్టీ అని గుర్తుచేశారు. సీఎం రేవంత్.. ప్రతీరోజూ కేసీఆర్ చావు కోరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి రౌడీలా ఆయన ప్రవర్తిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ‘RR’ (రేవంత్ రెడ్డి) నడుస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. నగరంలో ఏ బిల్డింగ్ కట్టాలన్న కాంగ్రెస్ పార్టీకి ట్యాక్స్ కట్టాల్సిందేనని విమర్శించారు. ప్రస్తుతం ప్రజాస్వామ్య విలువలు పడిపోయే విధంగా శాసన సభ జరుగుతోందని హరీశ్ రావు అన్నారు. ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. అందుకే తాము బాయ్ కాట్ చేసి బయటకు వచ్చేశామని ప్రకటించారు.
మూసీ ఖర్చు ఎంత?
అంతకుముందు మూసీ ప్రక్షాళనకు సంబంధించి అసెంబ్లీలో హరీశ్ రావు మాట్లాడారు. మూసీ మోడ్రనైజేషన్ ప్రాజెక్టుకు ఎంత ఖర్చవుతుందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ ఒకసారి రూ.లక్ష కోట్లు అని, మరోసారి రూ.1.5 లక్షల కోట్లని చెబుతున్నారని పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా ఇప్పటివరకూ ఎన్ని ఇళ్లను కూల్చేశారని ప్రశ్నించారు. కూల్చిన నివాసాలకు పరిహారం చెల్లించారా? లేదా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. గోదావరి జలాలను మూసీలో వదులుతామని ప్రభుత్వం చెబుతోందని.. ఆ రెండున్నర టీఎంసీలను ఏ విధంగా తీసుకువస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Also Read: Kavitha Kalvakuntla: అసెంబ్లీకి కేసీఆర్ రాకపోతే.. బీఆర్ఎస్‌ను ఎవరూ కాపాడలేరు.. కవిత సంచలన వ్యాఖ్యలు
స్పీకర్‌పై ప్రశ్నల వర్షం..
మరోవైపు అసెంబ్లీలోనే స్పీకర్ చర్యలను హరీశ్ రావు ఎండగట్టారు. ప్రతిపక్ష సభ్యుల హక్కును కాపాడాల్సిన బాధ్యత స్పీకరపై ఉందని గుర్తుచేశారు. బీఏసీ సమావేశంలో చర్చించుకున్న అంశాలకు.. జరుగుతున్న వాటికి సంబంధం లేకుండా పోతోందని హరీశ్ రావు అన్నారు. సభ అజెండా కాపీలను తెల్లవారుజామున 2-3 గంటలకు పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎప్పుడు నిద్రలేవాలి.. ఎప్పుడు సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలని పేర్కొన్నారు. సభ ప్రారంభానికి 24 గంటల ముందు ఎజెండాను సభ్యులకు తెలియజేయడమనేది ఆనవాయితీ అని హరీశ్ రావు అన్నారు. సభలోనూ మైక్ తమకు ఇవ్వకుండా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఈ అసెంబ్లీ శీతకాల సమావేశాలను బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయించుకున్నట్లు హరీశ్ రావు వెల్లడించారు.

