Government Land Scam: పెనుబల్లి మండలంలో వెలుగులోకి వచ్చిన ప్రభుత్వ భూమి అక్రమ పట్టా వ్యవహారం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. తొలుత ఈ ఘటనను ఎమ్మార్వో(MRO) స్థాయిలో జరిగిన తప్పిదంగా మాత్రమే చూపించేందుకు ప్రయత్నించినప్పటికీ, ఇప్పుడు అసలు బాధ్యత ఎవరిది అన్న ప్రశ్నలు ప్రజల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఈ అక్రమ వ్యవహారానికి కేంద్రబిందువుగా సబ్ కలెక్టర్(Sub Collector) కార్యాలయమే ఉన్నట్లు వెలుగులోకి వస్తున్న అంశాలు అనుమానాలను మరింత పెంచుతున్నాయి. చింతగూడెం(Chinthagudem) గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 71/3, 71/4లలో ఉన్న 3.20 ఎకరాల కుంటల భూమిని ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ భూమిగా గుర్తించింది. 2023లో అక్రమ కబ్జాదారుల నుంచి భూమిని స్వాధీనం చేసుకుని, సరిహద్దులు ఖరారు చేసి, ప్రభుత్వ భూమి సూచిక బోర్డులు ఏర్పాటు చేసిన విషయం అధికారిక రికార్డుల్లో స్పష్టంగా ఉంది. అలాంటి భూమిని మళ్లీ ప్రైవేట్ వ్యక్తికి డిజిటల్ విధానంలో పట్టా చేయడం ఎలా సాధ్యమైందన్నదే కీలక ప్రశ్నగా మారింది.
సమన్వయం లేకుండా ఫైల్ కదిలేనా..
ఈ వ్యవహారం పూర్తిగా ఆన్‌లైన్(Online) వ్యవస్థలో జరిగిందన్నది ముఖ్యమైన అంశం. రెవెన్యూ శాఖలో ఫైళ్ల కదలిక ప్రభుత్వ పోర్టల్(Portal), సర్వర్(Servar) ఆధారంగానే జరుగుతుంది. ఎమ్మార్వో కార్యాలయం, సబ్ కలెక్టర్ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ల సమన్వయం లేకుండా ఒక్క ఫైల్ కూడా ముందుకు కదలదన్నది శాఖలోని సాంకేతిక వర్గాల వాదన. అయితే ఈ కేసులో వీఏఓ(VAO) విచారణ, ఆర్‌ఐ(RI) పంచనామా, డిప్యూటీ తహసీల్దార్ పరిశీలన వంటి తప్పనిసరి దశలన్నీ దాటవేసి నేరుగా డిజిటల్ సైన్ ప్రక్రియ పూర్తయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇది కేవలం ఎమ్మార్వో స్థాయిలోనే జరిగిందా? లేక సబ్ కలెక్టర్ అనుమతి, అవగాహన లేకుండానే ఆయన కార్యాలయ వ్యవస్థలో ఫైల్ ప్రాసెస్ అయ్యిందా? అన్న ప్రశ్నకు ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం లేదు.
Also Read: Shiva Lingam Vandalized: శివలింగం ధ్వంసం కేసులో కీలక పరిణామం.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
కాపాడే ప్రయత్నం జరుగుతోందా?
ఈ నేపథ్యంలో ప్రజల్లో “తెర ముందు ఎమ్మార్వో ఉంటే, తెర వెనుక సబ్ కలెక్టర్ ఉన్నారు” అన్న అనుమానం బలంగా వినిపిస్తోంది. ఎమ్మార్వోపై మాత్రమే చర్యలు తీసుకుని, సబ్ కలెక్టర్ పాత్రను పక్కన పెట్టడం ద్వారా అసలు ముద్దాయిని కాపాడే ప్రయత్నం జరుగుతోందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఎమ్మార్వో శ్రీనివాస్ యాదవ్(Srinivas Yadav), చింతగూడెం జీపీవో రవి(Ravi)పై సస్పెన్షన్ వేటు పడినప్పటికీ, ఈ అక్రమ డిజిటల్ ఫైల్ మూవ్‌మెంట్ సబ్ కలెక్టర్ కార్యాలయ అనుమతి లేకుండా జరిగే అవకాశమే లేదని అధికారులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సర్వర్ లాగ్స్, యూజర్ ఐడీలు, టైమ్ స్టాంప్‌లు పరిశీలిస్తే అసలు బాధ్యత ఎవరిదన్నది తేలిపోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సమగ్ర విచారణ జరపాల్సిందే..
అదే సమయంలో, ఒకే డివిజన్ పరిధిలో ద్వంద్వ పరిపాలనా వైఖరి అమలవుతోందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సబ్ కలెక్టర్ కార్యాలయంలోని కొందరు సిబ్బందిపై ఫిర్యాదులు వచ్చినా చర్యలు లేకపోవడం, ఇతర శాఖల్లో మాత్రం వెంటనే బదిలీలు లేదా చర్యలు తీసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ భూముల పరిరక్షణలో నిర్లక్ష్యం వహించిన వారిపై స్థాయి, పదవి చూడకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మార్వో ఒక్కరినే బాధ్యుడిగా చూపకుండా, సబ్ కలెక్టర్ పాత్రపై పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరపాల్సిందేనని ప్రజలు, రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
Also Read: Chinese Manja: ‘చైనా మాంజా విక్రయాలను అరికట్టాలి’.. సీఐకి డివైఎఫ్ఐ వినతి

