KP Vivekanand Goud: ప్రజలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకోకుండా శివారు మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్(Hyderabad)లో విలీనం చేశారని బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద గౌడ్(KP Vivekanada), కల్వకుంట్ల సంజయ్(Sanjay) మండిపడ్డారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ సర్కార్ హైదరాబాద్ నగరాన్ని చిన్న చూపు చూస్తున్నదన్నారు. తన ఊహల నగరం ఫోర్త్ సిటీ అంటూ సర్కార్ ఊహల్లో ఉన్నదన్నారు. రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు మెట్రోను రద్దు చేశారని ఆరోపించారు.మూసీ ప్రక్షాళన పేరుతో ఎక్కడ పడితే అక్కడ కూల్చివేతలకు పాల్పడిందన్నారు. నగరంలో కాలుష్యం లేకుండా ఫార్మా సిటీ కట్టాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దాన్ని కాంగ్రెస్ సర్కార్ రద్దు చేసిందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు రాలేదన్నారు.
జీహెచ్ఎంసీలో విలీనం
హైదరాబాద్ నగరం నుంచి ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని కోరితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అజారుద్దీన్‌ను మంత్రిని చేశారని, ఆయనకు హైదరాబాద్ నగరంపై పూర్తి స్థాయిలో అవగాహన లేదన్నారు. హైదరాబాద్ నగరం తెలంగాణకు గుండె కాయ, ఆర్థిక అభివృద్ధికి గ్రోత్ ఇంజన్ అన్నారు. మహేశ్వరం, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల నియోజకవర్గంలో ఉన్న గ్రామాలను కార్పొరేషన్‌లో కలిపి వారికి అన్యాయం చేస్తున్నారన్నారు. పేరుకు ప్రజా పాలన చేసేది రాచరిక పాలన అని ఆరోపించారు. 27 శివారు మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేశారన్నారు. ప్రజలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకోకుండా శివారు మున్సిపాలిటీలను విలీనం చేశారని, మంత్రులు, అధికారులు, మేయర్‌కు తెలియకుండా జీహెచ్ఎంసీలో 300 డివిజన్లు చేశారన్నారు. రేవంత్ రెడ్డి నియంతృత్వ పాలన చేస్తున్నారన్నారు.
Also Read: The RajaSaab: ‘ది రాజాసాబ్’ క్లైమాక్స్ గురించి మారుతీ చెప్పింది ఇదే.. అది 70 రోజుల కష్టం..
రాష్ట్రంలో చాలా ప్రజా సమస్యలు
బీఆర్ఎస్ హయాంలో జీహెచ్ఎంసీకి 30 అవార్డులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వచ్చాయన్నారు. హైదరాబాద్‌కు ప్రపంచ గ్రీన్ సిటీ అవార్డు బీఆర్ఎస్ హయాంలో వచ్చిందన్నారు. స్వచ్ఛ ఎక్స్‌లెన్స్ అవార్డ్ వచ్చిందన్నారు. పార్టీ నిర్ణయాలను కాంగ్రెస్ కార్పొరేటర్లు, నేతలే వ్యతిరేకిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో చాలా ప్రజా సమస్యలు వున్నాయన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఈ సంవత్సరం 16 రోజులు మాత్రమే నడిచిందన్నారు. స్పీకర్ ఇటీవల ఇంగ్లండ్ వెళ్లి వచ్చారని, అక్కడ పార్లమెంట్ సంవత్సరంలో 160 రోజులు జరుగుతుందని, అసెంబ్లీలో జీరో అవర్ జీరో ఆన్సర్‌గా మారిందన్నారు. అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు, బూతులు ఎక్కువ అయ్యాయని, స్పీకర్‌కు అసెంబ్లీని ఎక్కువ రోజులు నడపాలని ఉన్నా ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. అసెంబ్లీ శీతాకాల సెషన్స్ ఎక్కువ రోజులు నడపాలని కోరారు. రాష్ట్రంలో హాస్పిటల్స్ పరిస్థితి దారుణంగా ఉందని ఆరోపించారు. అసెంబ్లీని ప్రభుత్వం హుందాగా నడపాలని, అసెంబ్లీలో వ్యక్తిగత విమర్శలు లేకుండా చూడాలన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరైనా వ్యక్తిగత విమర్శలు చేస్తే అడ్డుకోండి అని సూచించారు.
Also Read: Spirit: వంగా కన్ఫర్మ్ చేశాడు.. ఫస్ట్ పోస్టర్ వచ్చేస్తోంది

