New Year 2026: నూతన సంతవ్సర వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. అర్ధరాత్రి వరకూ వేచి ఉన్న ఏపీ, తెలంగాణ ప్రజలు.. 2026 ఏడాదికి స్వాగతం పలికారు. అనంతరం తెల్లవారుజామున లేచి.. దేవాలయాలను సందర్శిస్తున్నారు. కొత్త ఏడాదిలో అంతా మంచే జరిగాలని భగవంతుడ్ని వేడుకుంటున్నారు. మరోవైపు నూతన సంవత్సరం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో తమ ప్రభుత్వ లక్ష్యాలకు సంబంధించిన వాగ్దానాలు చేస్తూనే.. అందరి జీవితాల్లో కాంతి నెలకొనాలని ఆకాంక్షించారు.
కొత్త ఏడాదిలో లక్ష్య సాదన దిశగా..
తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్- 2047 లక్ష్య సాధన దిశగా ఈ ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం మరింత ముందుకు సాగుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు, దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. రైతులతో పాటు యువత, మహిళలు, కార్మికులు సహా అన్ని వర్గాల ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని గుర్తు చేశారు. కొత్త సంవత్సరంలో ప్రతి కుటుంబం తాము ఆశించిన ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని, ప్రజలందరూ ఆనందంతో, ఆరోగ్యంగా ఉండాలని సీఎం ఆకాంక్షించారు.
ఏపీ సీఎం ఏం చెప్పారంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ 2026 నూతన సంవత్సరం సందర్భంగా సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పారు. గడిచిన 2025 సంవత్సరంలో కూటమి ప్రభుత్వ పాలన మరిచిపోలేని విజయాలను అందించిందన్నారు. ఎన్నో మైలురాళ్లను చేరుకున్నట్లు పేర్కొన్నారు. ‘అనేక సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి పనులకు 2025 ఏడాది నాంది పలికింది. ఏ రంగంలో చూసినా… 2025 కేవలం ఒక గడిచిన సంవత్సరం కాదు…. నాటి విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ ను వికాసం వైపు నడిపించిన గొప్ప మలుపు. ఎన్నో సంక్షోభాలను, సమస్యలను, సవాళ్లను అధిగమించి గొప్ప పురోగతి సాధించిన సంవత్సరంగా 2025 గుర్తుండిపోతుంది. ఇదే స్ఫూర్తితో ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం ప్రారంభమయ్యే 2026 నూతన సంవత్సరం అందరి జీవితాలలో కొత్త కాంతులు నింపాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ ఏడాది ప్రజలకు రెట్టింపు సంతోషం – సంక్షేమం – అభివృద్ధి అందించేందుకు కృషి చేస్తానని మాటిస్తున్నాను’ అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.
Also Read: Hyderabad Liquor Sales: ఇలా తాగేశారేంట్రా.. డిసెంబర్ 31 రాత్రి.. రికార్డు స్థాయిలో మద్యం సేల్స్!
రాష్ట్రపతి, ప్రధాని ఏమన్నారంటే?
మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం దేశ ప్రజలకు నూతన సంతవ్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026 ఏడాది కొత్త శక్తి, సానకూల మార్పులకు ప్రతీకగా నిలవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాక్షించారు. ప్రతీ ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకొని.. కొత్త లక్ష్యాలను ఏర్పరుచుకోవాలని ప్రధాని సూచించారు. దేశాభివృద్ది, పర్యావరణ పరిరక్షణపై తమకున్న నిబద్దతను ప్రజలు చాటుకోవాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఈ ఏడాది అందరికీ అద్భుతమైన సంవత్సరం కావాలని కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. 2026లో తలపట్టే అన్ని ప్రయత్నాలు సక్సెస్ కావాలని.. శాంతి, ఆనందంతో ప్రతి ఒక్కరూ జీవించాలని ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు.

