తిరుమల, స్వేచ్ఛ: టీటీడీ (TTD)లో అన్యమత ఉద్యోగులు.. ఇది, ఇప్పటి పంచాయితీ కాదు. చాలాకాలంగా నలుగుతున్న విషయం. అయితే, ప్రస్తుత పాలక మండలి మొట్ట మొదటి సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం అధికారులు ముందుకు వెళ్తున్నారు. దీనికి ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నది. ముందుగా 18 మంది అన్యమతస్తులను గుర్తించి వారిని బదిలీ చేస్తూ ఈవో ఆదేశాలు జారీ చేశారు. వీరిని దేవాలయాల్లో విధులలో కానీ, ఉరేగింపు లాంటి కార్యక్రమాల్లో కానీ వినియోగించరాదని స్పష్టం చేశారు.
దీంతో పాటు వారిని ప్రభుత్వ శాఖలకు బదలాయింపు కార్యక్రమం చేపట్టాలని కూడా అందుకు తగిన చర్యలను ప్రారంభించారు. ఎండోమెంట్ యాక్ట్ 1060, 1989 ప్రకారం నవంబర్ 18, 2024 టీటీడీ బోర్డు తీర్మానం ప్రకారం, హిందూ సంప్రదాయాన్ని అనుసరిస్తామని ప్రమాణం చేసి, టీటీడీలో ఉద్యోగం పొంది, నేడు అన్యమతాన్ని ఫాలో అవుతూ భక్తుల మనోభావాలను, టీటీడీ పవిత్రతను కొందరు ఉద్యోగులు దెబ్బతీస్తున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి వారిపై టీటీడీ చర్యలు తీసుకుంటున్నది.
దశాబ్దాల సమస్య
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో అన్యమత ఉద్యోగులు అనే సమస్య దశాబ్దాలుగా ఉన్నది. ప్రస్తుత పాలకమండలి, అన్యమత ఉద్యోగులను పూర్తిగా బయటకు పంపాలని చూస్తున్నది. ఈ నేపథ్యంలో వీఆర్ఎస్‌కు అంగీకరిస్తే స్వచ్ఛంద పదవీ విరమణ, లేకపోతే ప్రభుత్వ శాఖలకు మార్పు వంటి వాటిపై పెద్దఎత్తున ప్రచారం జరుగుతున్నది. 80వ దశకం నుంచి ఈ అన్యమతస్తుల వివాదం ప్రారంభమైంది. దీనికితోడు కొంతమంది కావాలని తిరుమల కొండపై ప్రార్థనలు చేసి తమ మతాన్ని చాటుకోవాలని చూశారు. అనేక అడ్డదారులు తొక్కారు.
కొంతమంది బోర్డు సభ్యులతో పాటు హిందూ సంస్థల ఒత్తిడితో రాష్ట ప్రభుత్వం 1989లో జీవో నెంబర్ 1060ను జారీ చేసింది. దీని ప్రకారం తిరుమలలో అన్యమతస్తుల విషయంలో కఠిన చర్యలు తీసుకోవచ్చు. టీటీడీ ఉద్యోగులు అయితే క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చని స్పష్టమైన ఆదేశాలున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి 2005-2006 మధ్య కాలంలో మరోసారి అన్యమత ప్రచారం వివాదం ఊపందుకుంది. దీంతో ప్రభుత్వం 2007 జూన్‌లో మరోసారి 746, 747 జీవోలు జారీ చేసింది.
జీవో 746 ప్రాకారం శ్రీవారి మొట్టు నుంచి బాలాయపల్లి వరకు విస్తరించి ఉన్న తిరుమల కొండల పరిధిలో పూర్తి స్థాయిలో అన్యమత ప్రచారం నిషేధించారు. జీవో 747 ప్రకారం తిరుమల క్షేత్ర పరిధిలో హిందూ మత విశ్యాసాలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవచ్చని ఉంది. దీని ప్రకారం కొంతమందిపై కఠినంగా చర్యలు తీసుకున్నారు. అలాగే, 2008లో దర్మకర్తల మండలి మరో కీలక నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం అన్యమతస్తులు టీటీడీలో ఉద్యోగానికి అనర్హులు అని, వారిని తీసుకోకూడదని తీర్మానం చేసింది. అప్పటికి ఉన్నవారిని విద్య, వైద్య సంస్థలకు పంపించింది.
TTD లో అంతకంతకూ పెరిగిన అన్యమస్తులు
2017 వరకు అన్యమత ప్రచారం అంతగా బయటకు రాలేదు. కానీ, కొంతమంది ఉద్యోగులు చర్చిలకు వెళ్ళడం, వాటికి సంబంధించిన విజువల్స్ బయటకు రావడంతో మరోసారి వివాదం పెద్దదయింది. దీంతో లో పనిచేస్తున్న అన్యమతస్తుల వివరాలను బయటకు తీశారు. జన్మతహా అన్యమతస్తులతో పాటు తర్వాత మతం మారిన వారిని గుర్తించారు. అప్పటికి వారి సంఖ్య 44 అని తేలింది. వారందరికీ షోకాజ్ నోటీసులు పంపారు. హిందూ సంస్థలో పనిచేస్తూ ఇతర మత విశ్వాసాలను కలిగి ఉండటం వల్ల ఎందుకు తొలగించకూడదని ప్రశ్నించారు.
అయితే, వారందరి కోర్టును ఆశ్రయించారు. ఇది రాజ్యాంగ పరమైన ఉల్లంఘన అని, 2018లో కోర్టు స్టే ఇచ్చింది. విచారణ జరుగుతున్న సమయంలో కొంతమంది పదవీ విరమణ చేశారు. 2019లో మరోసారి అన్యమత వివాదం తెరపైకి వచ్చింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యం ఓ ప్రకటన చేశారు. అన్యమతస్తులు తమ నమ్మకాన్ని తమ ఇంటి వరకే ఉంచుకోవాలని పవిత్రమైన తిరుమలలో ప్రదర్శించరాదన్నారు. అప్పుడు మరో సారి లెక్కలు తీస్తే 77 మంది ఉన్నట్లు తేలింది. ఈ విషయం ప్రభుత్వ పెద్దలకు చెబితే ఆయనపై వేటు పడిందనే ప్రచారం ఉంది. అప్పటి నుంచి తిరుమలలో ఈ అన్యమత వివాదం కొనసాగుతున్నది.
300 మంది ఉన్నారా?
ప్రస్తుత TTD చైర్మన్ బీఆర్ నాయుడు నాయకత్వంలోని పాలకమండలి తీసుకున్న తాజా నిర్ణయం వివాదాలకు దూరంగా ఉందని అంటున్నారు. ఈ తీర్మానం ప్రకారం అన్యమతస్తులు వారి ఇష్ట ప్రకారం వీఆర్ఎస్ తీసుకోవచ్చు. లేదా ఇతర ప్రభుత్వ శాఖలకు మారవచ్చు. దీని వల్ల వారికి వేతనం తగ్గదు. భవిష్యత్‌లో వచ్చే పింఛన్లు లాంటివి ఆగవు. ప్రభుత్వ ఉద్యోగిగా మారే అవకాశం ఉంది. చాలావరకు మంచి నిర్ణయం అని అంటున్నారు. ప్రస్తుతానికి 18 మందిని గుర్తించినట్లు ఈవో వారి పేర్లతో ఓ ఉత్తర్వు ఇచ్చారు. దాని ప్రకారం ఆలయంలో జరిగే కార్యక్రమాలలో వారిని ఉపయోగించరాదు.
అయితే, ఇప్పుడు ప్రకటించిన జాబితాలో ఎక్కువగా విద్యాసంస్థలు అస్పత్రులలో పనిచేస్తున్నవారే ఉన్నారు. వీరందరూ 2007కు ముందు ఉద్యోగాలలో చేరిన వారే. ఆ తర్వాత కొంతమంది తమ మతాన్ని దాచి చేరారు. మరి కొందరు ఉద్యోగంలో చేరిన తర్వాత మతం మారారు. వీరందరిని గుర్తించి టీటీడీ విజిలెన్స్ నిఘా పెట్టింది. అలా మొత్తం 300 మంది వరకు టీటీడీలో అన్యమతస్తులు ఉన్నట్లు సమాచారం.