Urea Black Marketing: యాసంగి ప్రారంభం కావడంతో రైతులు పంటలకు వేసుకునేందుకు యూరియా కోసం కొనుగోలు కేంద్రాల దగ్గరకు వస్తున్నారు. అయితే డిమాండ్ కు తగ్గ సరఫరా లేకపోవడం తో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీనిని ఆసరాగా ప్రవేట్ డీలర్లు చేసుకొని యూరియా దందాకు తీరదీశారు. ఒక్కో యూరియా బస్తా కు అదనంగా 233 వసూలు చేస్తున్నారు. ఎవరైనా రైతు ఇదేంటని ప్రైవేటు డీలర్ ని అడిగితే.. తమ దగ్గర స్టాక్ లేదని నిర్లక్ష్యం సమాధానం ఇస్తున్నారని రైతులు ఆపోతున్నారు. చేసేదేమీ లేక అడిగినంత ఇచ్చి యూరియా బస్తా కొనుగోలు చేస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు నిమ్మకు నీరేతనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ఎమ్మార్పీ ధర కంటే రెట్టింపు వసూలు..
కోదాడ నియోజకవర్గం చిలుకూరు మండలం బేతవోలు పిఎసిఎస్ పరిధిలోని ఆచార్యుల గూడెం కు చెందిన ఓ రైతు యూరియా కోసం బేతవోలు సొసైటీ కి మూడు రోజులకి క్రితం మూడు రోజుల క్రితం వెళ్ళాడు. ఈ సొసైటీ కింద పది వేల ఎకరాలు సాగు అవుతుంది. కానీ ఈ సొసైటీ కి చెందినవారు యూరియా సరఫరా కోసం డబ్బులు చెల్లించకపోవడంతో స్టాక్ రాలేదని తెలిపారు. సమయానికి యూరియా వేయకపోతే పైరుకు ఎదగదని భావించిన ఆ రైతు.. సమీపంలోని ఓ ప్రైవేటు ఫర్టిలైజర్స్ దుకాణాన్ని సంప్రదించాడు. అయితే యూరియా బస్తాకు నిర్ణయించిన ఎమ్మార్పీ ధర కంటే రెట్టింపు వసూలు చేశాడు. దీంతో చేసేదేం లేక ఆ రైతు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది ఒక రైతుకు సంబంధించిన అంశం కాదు.. అన్ని ప్రాంతాల్లో ఇదే ఘటనలో పునరావృతం అవుతున్నాయి.
యూరియా బస్తా కు రూ. 500
యాసంగి ప్రారంభమైంది. ముమ్మరంగా రాష్ట్రంలో సాగు పనులు కొనసాగుతున్నాయి. ముందస్తుగా ప్రభుత్వం ప్రైవేటు ఫర్టిలైజర్స్ దుకాణదారులు, పిఎసిఎస్, మార్క్ పెడ్ కేంద్రాల్లో యూరియా నిల్వలు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే డిమాండ్ తగిన సరఫరా లేకపోవడం, మరోవైపు ప్రైవేటు డీలర్లు సైతం కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. రైతుల డిమాండ్ దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ డీలర్లు ధర రెట్టింపు చేసి అమ్ముతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది రైతులు బహిరంగంగానే పేర్కొంటున్నారు. యూరియా బస్తాకు ప్రభుత్వం ఎమ్మార్పీ ధర 267 గా నిర్ణయించింది. మార్క్ పెడ్, పిఎసిఎస్ లలో, ప్రైవేట్ డీలర్లు సైతం ఈ ఎంఆర్పి ధరకే విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది . కానీ కొంతమంది ప్రైవేట్ డీలర్ బస్తాకు 500 రూపాయలకు విక్రయిస్తున్నారు. అంటే ఒక బస్తా కు అదనంగా 233లకు అమ్ముతున్నారు. ఎవరైనా రైతు ఇదేంటని ప్రశ్నిస్తే తమ దగ్గర స్టాక్ లేదని సమాధానం ఇస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయానికి యూరియా వేయకపోతే నారు పెరగదని, నాటు వేసిన యూరియా వెయ్యకపోతే పచ్చగా కాదని, జొన్న మొక్కజొన్న మిర్చి ఇలా పలు పంటలకు సమయానికి వేయాల్సిందేనని రైతులు పేర్కొంటున్నారు. దీనిని ఆసరాగా చేసుకొని ప్రైవేటు డీలర్లు కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరకు యూరియా అమ్ముతున్నట్లు సమాచారం.
Also Read: Commissioner Sunil Dutt: నూతన సంవత్సర వేడుకల్లో అలా చేస్తే అరెస్ట్ తప్పదు: కమిషనర్ సునీల్ దత్!
కొరవడిన అధికారుల పర్యవేక్షణ
యూరియా సరఫరా పై అధికారులు పర్యవేక్షణ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ క్షేత్రస్థాయిలో అధికారులు నిర్లక్ష్యం కారణంగా యూరియా కొరత ఏర్పడుతుందని ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక దగ్గర యూరియా కోసం రైతులు క్యూ లైన్ లో నిలబడుతున్నారు. ఆందోళనల సైతం తరచుగా జరుగుతున్నాయి. అయినా అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలో యూరియా కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవడం లేదని స్పష్టమవుతుంది. అధికారుల చోద్యం కారణంగానే ప్రైవేటు డీలర్లు సైతం యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీనికి తోడు కొన్ని పిఎస్సిఎస్ లలో అధికారులు సమయానికి యూరియా కోసం డిపాజిట్ చేయకపోవడంతో జాప్యం జరుగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. బేతవోలు సొసైటీ అధికారుల తీరుతో.. ఆ సొసైటీ పరిధిలో ఇబ్బందులు పడుతున్నామని రైతులే పేర్కొంటున్నారు. ఇలా పలు సొసైటీలోనూ ఇదే తతంగం కొనసాగుతుందని ఆరోపణలు వస్తున్నాయి.
అందుబాటులో ఉన్నాయని..
మరోవైపు అధికారుల ప్రకటనలు మరో విధంగా ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో యూరియా నిల్వలు ఉన్నాయని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లోని ప్రైవేటు డీలర్లు, పిఎసిఎస్, మార్క్ పెడ్ కేంద్రాల్లో 47.68 లక్షల యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని ప్రకటించారు. ప్రైవేటు డీలర్ల వద్ద 31077 బస్తాలు, సొసైటీల వద్ద 16755 బస్తాలు, మార్క్ఫెడ్ వద్ద 1,66,730 బస్తాలు అందుబాటులో ఉన్నాయని కావాల్సిన రైతులు మాత్రమే తీసుకోవాలని వ్యవసాయ అధికారులు కోరారు. అవసరం లేకున్నా ముందస్తుగా రైతులు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతి రైతుకు యూరియా అందుతుందని.. అందుకు సంబంధించి నిల్వలు సైతం ఉన్నాయని వెల్లడించారు.
రైతులకు సరఫరా..
యూరియా అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియా సరఫరాపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ చేస్తుందని పేర్కొన్నారు. జిల్లాల వారీగా యూరియా నిల్వల వివరాలను వ్యవసాయ శాఖ విడుదల చేసిందని, అన్ని జిల్లాల్లో తగినంత యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులకు సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా ఎరువుల సరఫరా వ్యవస్థను క్రమబద్ధంగా నిర్వహిస్తోందని, రబీ సీజన్ మొత్తం యూరియా కొరత తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు, రైతులకు అవసరం ఉన్నంత మేరకు యూరియా సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. ఏది ఏమైనా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసి రైతులకు అవసరం మేరకు యూరియా సరఫరా చేయాలని పలువురు విజ్ఞప్తులు చేస్తున్నారు.
Also Read: Mukkoti Ekadashi: మెదక్‌లో వైభవంగా ముక్కోటి.. మంత్రి దంపతుల ప్రత్యేక పూజలు

